MAA Elections: మాట తప్పడం లేదు.. మెగా ఫ్యామిలీ ప్రకాశ్‌రాజ్‌ వెనుకే: నాగబాబు 

మెగాస్టార్‌ చిరంజీవి దగ్గర నుంచి మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరి సపోర్ట్‌ ప్రకాశ్‌రాజ్‌కే ఉందని నటుడు నాగబాబు మరోమారు స్పష్టం చేశారు. ఉత్కంఠభరితంగా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల...

Published : 07 Oct 2021 16:03 IST

ప్రాంతీయ వాదం.. అది వాళ్ల కుసంస్కారం

హైదరాబాద్: మెగాస్టార్‌ చిరంజీవి దగ్గర నుంచి మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరి సపోర్ట్‌ ప్రకాశ్‌రాజ్‌కే ఉందని నటుడు నాగబాబు మరోమారు స్పష్టం చేశారు. ఉత్కంఠభరితంగా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల వ్యవహారంపై తాజాగా నాగబాబు స్పందించారు. అధ్యక్ష పదవికి ప్రకాశ్‌రాజ్‌ అర్హుడని ఆయన అన్నారు. అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రాంతీయవాదాన్ని లేవనెత్తడం సరికాదని తెలిపారు. ‘‘మా’ ఎన్నికల నేపథ్యంలో సినిమా పరిశ్రమలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని అనివార్య చర్యలు.. వ్యాఖ్యల వల్ల పరిస్థితులు వాడీవేడీగా మారుతున్నాయి. ప్రకాశ్‌రాజ్‌ని మొదట్లో సపోర్ట్‌ చేసిన చిరంజీవి ఇప్పుడు మద్దతు ఇవ్వడం లేదంటూ చెప్పుకుంటున్నారు. నిజం చెప్పాలంటే.. ఓటమి భయంతో ప్రత్యర్థి ప్యానల్‌ సభ్యులు సృష్టించిన పుకార్లు ఇవి. అన్నయ్యతోపాటు మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరూ కూడా ప్రకాశ్‌రాజ్‌కే సపోర్ట్‌ చేస్తున్నాం. ప్రకాశ్‌రాజ్‌ టీమ్‌లోకి జీవిత ఎంట్రీ ఇచ్చారు కాబట్టి మేము ఆయన ప్యానల్‌ని పట్టించుకోవడం లేదనుకోవడం పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే.. జీవితతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. అసోసియేషన్‌ అభివృద్ధి కోసం ఆయన చేపట్టనున్న కార్యక్రమాలు నచ్చి మేము మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నాం. తన టీమ్‌లోకి ఎవర్నీ సభ్యుల్ని చేసుకుంటారు అనేది పూర్తిగా ఆయన ఇష్టం’ అని నాగబాబు స్పష్టం చేశారు.

‘భారతదేశం ప్రజాస్వామ్య దేశం. టాలెంట్‌.. మంచి చేయాలని భావించిన ఏ వ్యక్తి అయినా సరే ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. ప్రకాశ్‌రాజ్‌ ఏమీ తీవ్రవాది కాదు.. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయవద్దు అని చెప్పడానికి. ప్రకాశ్‌రాజ్‌ని ఎన్నుకోవద్దు అనడానికి.. ఆయన చేసిన తప్పు ఏమిటో ఒక్కసారి చెప్పండి.  కమలాహ్యారిస్‌ అమెరికాలో వైస్‌ ప్రెసిడెంట్‌ కాలేదా?ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే.. ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. ఇదేక్కడి న్యాయం. ఎన్నో సంవత్సరాల క్రితం ప్రకాశ్‌రాజ్‌ ఇక్కడికి వచ్చి సెటిల్‌ అయ్యారు. ఆయన ఒక్కరే కాదు.. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది వేరే ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యారు. ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకువచ్చి ప్రకాశ్‌రాజ్‌పై వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఇక అది వాళ్ల కుసంస్కారం’ అని నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని