MAA Elections: మా అన్నయ్య ఎప్పుడూ అలా వ్యవహరించలేదు: నాగబాబు

‘మేమంతా ఒకే కుటుంబం. మాది సినిమా కుటుంబం’ అని చెప్పుకునే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ (మా)లో ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు...

Updated : 13 Oct 2021 14:28 IST

హైదరాబాద్: ‘మేమంతా ఒకే కుటుంబం. మాది సినిమా కుటుంబం’ అని చెప్పుకునే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ (మా)లో ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. హోరాహోరీ పోరులో ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించిన తర్వాత ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్‌, నటుడు నాగబాబు రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగబాబు ‘మా’ ఎన్నికలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను ‘మా’ అసోసియేషన్‌ సభ్యుడిగా కొనసాగాలనుకోవడం లేదని మరోసారి స్పష్టం చేశారు.

‘సాధారణ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరుగుతాయో ‘మా’ ఎన్నికల్లో అలాంటివి జరిగాయి. తాము గెలిస్తే సభ్యుల సంక్షేమం, అసోసియేషన్‌ అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపడతాం అనే విషయాలను తెలియజేస్తూ సాధారణంగా ఎన్నికల్లో నిలబడతారు. ప్రాంతీయవాదం, కులంతోపాటు ప్రకాశ్‌రాజ్ వృత్తిపరమైన విషయాలను తెరపైకి తీసుకువచ్చి పర్సనల్‌ ఇమేజ్‌కి ఇబ్బందికలిగేలా ప్రత్యర్థి ప్యానల్‌ సభ్యులు కామెంట్‌ చేసినప్పుడు.. అతనికి సపోర్టర్‌గా నేను వారికి కౌంటర్‌ ఇచ్చాను. ఇన్నాళ్లు ఈ అసోసియేషన్‌లో భాగమైనందుకు ఎంతో గర్వపడ్డాను. తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదు. విశాలహృదయంతో వ్యవహరిస్తారనుకున్నాను. కానీ, ఎన్నికల తర్వాత ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్‌లో ఉండాలనిపించలేదు. మనస్థాపంతో బయటకు వచ్చేశాను. సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇకపై ఈ అసోసియేషన్‌తో నాకు ఎలాంటి సంబంధంలేదు. సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని అన్నయ్య ఎప్పుడూ అనుకోలేదు. పరిశ్రమకు చెందిన నటీనటులు, ఇతర వ్యక్తులు, అభిమానులు.. ఇలా ఎవరైనా కష్టమంటూ మా ఇంటికి వస్తే ఆయన తనకు చేతనైనంత సాయం చేశారు. అంతే తప్ప పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని ఎప్పుడూ అనలేదు. ఆయనకు అంత అహంకారం లేదు’ అని నాగబాబు అన్నారు. అనంతరం మరో అసోసియేషన్‌ పెట్టే ఆలోచన తమ కుటుంబానికి లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని