Biggboss OTT: బిగ్‌బాస్‌ ఓటీటీ.. ఇక 24X7 ఎంటర్‌టైన్‌మెంట్‌ షురూ: నాగార్జున

బుల్లితెర వేదికగా తెలుగువారికి చేరువైన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఐదు సీజన్లగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈషో ఇకపై ఓటీటీ వేదికగా 24X7 అలరించనుంది. ఈ విషయాన్ని తాజాగా డిస్నీ హాట్‌స్టార్‌ యాజమాన్యంతోపాటు...

Updated : 24 Dec 2021 13:16 IST

త్వరలోనే కంటెస్టెంట్స్, గేమ్‌ రూల్స్‌ ప్రకటిస్తాం

హైదరాబాద్‌: బుల్లితెర వేదికగా తెలుగువారికి చేరువైన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఐదు సీజన్లుగా ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈషో ఇకపై ఓటీటీ వేదికగానూ 24X7 అలరించనుంది. ఈ విషయాన్ని తాజాగా డిస్నీ హాట్‌స్టార్‌ యాజమాన్యంతోపాటు నటుడు నాగార్జున ప్రకటించారు. శుక్రవారం ఉదయం డిస్నీ హాట్‌స్టార్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడారు.

‘‘బిగ్‌బాస్‌ షోని హిట్‌ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. కొవిడ్‌ సమయంలో తెలుగు ప్రేక్షకులను బిగ్‌బాస్‌ ఎంతగానో ఎంటర్‌టైన్‌ చేసింది. నాక్కూడా చక్కటి అనుభూతిని అందించింది. వ్యాఖ్యాతగా అడుగుపెట్టే సమయంలో ఏదో తెలియని భయం.. కానీ అడుగుపెట్టాక.. నేను కూడా ఈ షోకి అభిమానిగా మారిపోయాను. ఎపిసోడ్స్‌ అన్నింటినీ చూడటం మొదలుపెట్టాను. సీజన్‌-3, 4 పూర్తయ్యాక కంటెస్టెంట్స్‌ చాలామంది మా ఇంటికి వచ్చి.. షో మాకెంతో నేర్పించింది. మేము లైఫ్‌లో ఎంతో సక్సెస్‌ అయ్యాం అని చెబుతుంటే నేనెంతో ఆనందించాను. ఇక బిగ్‌బాస్‌-5 షో అప్పుడే అయిపోయిందా.. నమ్మలేకపోతున్నాం అని పలువురు అభిమానులు అడుగుతున్నారు. అదే సమయంలో డిస్నీ హాట్‌స్టార్‌ యాజమాన్యం నావద్దకు వచ్చి.. ‘బిగ్‌బాస్‌ ఓటీటీ ప్రారంభించాలనుకుంటున్నాం’ అని చెప్పడంతో షాక్‌ అయ్యాను. చివరికి వాళ్లు ఒప్పించారు. బిగ్‌బాస్‌కి పూర్తి విభిన్నంగా ఈ షో ఉంటుంది. సుమారు 6 కోట్ల మంది బిగ్‌బాస్‌ చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిగ్‌బాస్‌ షోలన్నింటిలో మన తెలుగు షోనే సూపర్‌హిట్‌. త్వరలోనే ఓటీటీ ప్రారంభం కానుంది’’ అని నాగార్జున అన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

త్వరలో రాబోయే ఓటీటీ షోకి బిగ్‌బాస్‌ షోకి వ్యత్యాసం ఉంటుందా..?

నాగార్జున: ఇప్పటివరకూ చూసిన బిగ్‌బాస్‌ షోకి.. ఓటీటీలో చూడబోయేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండూ విభిన్నమైన ఫార్మాట్లు.

ఓటీటీలో కూడా మీరు వారంలో రెండు రోజులు కనిపిస్తారా?

నాగార్జున: బిగ్‌బాస్‌ ఓటీటీ గురించి ఇంకా చర్చలు జరుపుతున్నాం. షో ఎలా ఉండాలి? ఎంతమంది కంటెస్టెంట్స్‌? ఎన్ని రోజులు? మిగిలిన విషయాలన్నింటి గురించి చర్చించుకుంటున్నాం. అన్నీ ఓకే అనుకున్నాక వచ్చే నెలలో ప్రకటిస్తాం.

బిగ్‌బాస్‌ సీజన్‌-6 ఉంటుందా? దానికి హోస్ట్‌ మీరేనా?

నాగార్జున: తప్పకుండా ఉంటుంది. నేనే వ్యాఖ్యాతగా కనిపిస్తాను.

సినిమాలు, బిగ్‌బాస్‌ ఓటీటీ.. మీరు ఏమైనా ఒత్తిడికి లోనవుతున్నారా?

నాగార్జున: నాకు ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా పని చేస్తా.

బంగార్రాజు సంక్రాంతికి వస్తుందా?

నాగార్జున: సినిమా సిద్ధమైంది. దాన్ని గురించి వేరే చోట మాట్లాడుకుందాం.

బిగ్‌బాస్‌ సీజన్‌ పూర్తైనప్పుడు బాధపడ్డారా?

నాగార్జున: సీజన్‌ పూర్తైన ప్రతిసారీ నాకు బాధ కలుగుతూనే ఉంటుంది. కంటెస్టెంట్స్‌, టీమ్‌ అందరూ నాకు కుటుంబసభ్యుల్లా మారిపోయారు. కాకపోతే, ఇప్పుడు కాస్త రిలాక్స్‌గా విహారయాత్రలకు వెళ్లొచ్చు.

బిగ్‌బాస్‌-5 ఫినాలేకి బిగ్గెస్ట్‌ సెలబ్రిటీలు రావడానికి కారణం మీరేనా?

నాగార్జున: నేను కాదు.. అది కేవలం బిగ్‌బాస్‌ పాపులారిటీతోనే సాధ్యమైంది. వాళ్లే వస్తామని అడిగి వచ్చారు. మేము ఇంకా చాలామందికి వద్దని చెప్పాం.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని