Published : 28/10/2021 23:09 IST

Varudu Kaavalenu: నేను సినిమాల్లోనే నటిస్తా.. బయట కాదు: నాగశౌర్య

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నేను సినిమాల్లోనే నటిస్తా. బయట నటించను’ అని యువ నటుడు నాగశౌర్య అన్నారు. తాను హీరోగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. రీతూవర్మ కథానాయిక. ఈ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మీడియాతో నాగశౌర్య పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.

అక్కడ మొదలైంది..

నేను నటించిన ‘ఛలో’ సినిమా విజయోత్సవ పార్టీలో దర్శకురాలు లక్ష్మీ సౌజన్య కలిశారు. నన్ను అభినందించి, ఓ కథ చెబుతా వింటావా అన్నారు. సరే అనగానే ‘వరుడు కావలెను’ స్టోరీ చెప్పారు. స్క్రిప్టు బాగా నచ్చడంతో వెంటనే ఒకే చేశా. అలా 2018లో మొదలైందీ మా ప్రయాణం. గతంలో నేను నందినీ రెడ్డి దర్శకత్వంలో నటించా. మహిళా డైరెక్టర్ల దగ్గర కొంచెం కంఫర్ట్‌ ఉంటుంది. త్వరగా కోప్పడరు. పైగా ఓపిక ఎక్కువ. ఎప్పుడు, దేనికి స్పందించాలో అప్పుడు మాత్రమే స్పందిస్తారు. మరికొన్ని గంటల్లో తెరపై తన సినిమా చూసుకోవాలనే మా అక్క (లక్ష్మి) కల నెరవేరబోతున్నందుకు సంతోషంగా ఉంది.

అందరికీ కనెక్ట్‌ అయ్యే కథ..

30 ఏళ్లలోపు అమ్మాయి, అబ్బాయిలు కనిపిస్తే చాలు ‘పెళ్లి ఎప్పుడు? సంబంధాలు ఏమైనా చూడాలా?’ అని మన చుట్టూ ఉన్నవారు ప్రశ్నిస్తుంటారు. కానీ, పెళ్లిపై వారి అభిప్రాయం ఏంటి? అనే విషయాన్ని పట్టించుకోరు. ఇలాంటి సున్నితమైన అంశాన్ని ఈ సినిమాలో చూపించనున్నాం. ఈ పాయింట్‌ అందరికీ కనెక్ట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. నేను ఈ చిత్రంలో ఆకాశ్‌ అనే పాత్రలో కనిపిస్తా. ఈ పాత్ర నా జీవితానికి కాస్త దగ్గరగా ఉంటుంది. ఓ సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్‌ రాసిన మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. క్లైమాక్స్‌ ప్రేక్షకులకి మంచి అనుభూతినిస్తుంది. రీతూవర్మ గొప్ప నటి. తెలుగు చక్కగా మాట్లాడుతుంది. తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేస్తుంది.

నా ముఖం చూసి చెప్పొచ్చు..

మేం అనుకున్న దానికంటే ఔట్‌పుట్‌ చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా హిట్‌ అవుతుందని నమ్మకంగా చెబుతున్నా. నేను సినిమాల్లోనే నటిస్తా. కానీ, బయట నటించను. ఒకవేళ సినిమాపై అపనమ్మకం ఉంటే నా ముఖంలో ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడది లేదు కదా! ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్‌ అన్న నా గురించి చెప్పడం ఆనందంగా ఉంది. ఇకపై మరింత కష్టపడాలి అనేంతగా తన మాటలు నాలో స్ఫూర్తినింపాయి.

ఆ బాధ్యత నాదే..

సినిమా విజయం అందుకున్నా, పరాజయంపాలైనా పూర్తి బాధ్యతని నేనే స్వీకరిస్తా. అప్పుడప్పుడు అమ్మ సలహాలు తీసుకుంటా. ఓటీటీపై నాకంత ఆసక్తి లేదు. నా దృష్టంతా 70 ఎం.ఎం. తెరపైనే! అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటిస్తోన్న ‘ఫలానా అమ్మాయి- ఫలానా అబ్బాయి’ నా కలల ప్రాజెక్టు. నాలుగేళ్లుగా ఈ కథతో ప్రయాణిస్తున్నా. నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది. ఇందులో ఏడు విభిన్న పాత్రల్లో కనిపిస్తా. గతంలో ప్రకటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంలో నటించట్లేదు. మరికొన్ని ప్రాజెక్టుల వివరాల్ని త్వరలోనే తెలియజేస్తా.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని