
Akhanda: బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారు: నందమూరి రామకృష్ణ
హైదరాబాద్: బాలకృష్ణ ‘అఖండ’ చిత్రంలో నట విశ్వరూపం చూపించారని ఆయన సోదరుడు నందమూరి రామకృష్ణ అన్నారు. సినిమా చూసిన ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘విడుదలైన అన్ని చోట్లా ‘అఖండ’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది. సినిమా ప్రదర్శనకు సంబంధించిన వారికి మంచి రోజులు వచ్చాయనే నమ్మకాన్నిచ్చింది. ఈ చిత్రంలో బాలకృష్ణ నటవిశ్వరూపం చూపించారు. ఎప్పుడూ ఆయన రికార్డుల్ని ఆయనే బద్దలు కొడుతుంటారు. ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘బొబ్బిలి సింహం’, ‘నిప్పురవ్వ’, ‘పెద్దన్నయ్య’, ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘సింహా’, ‘లెజెండ్’ ఇలా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అందుకున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ‘అఖండ’ చేరింది. చరిత్ర సృష్టించాలన్నా దాన్ని తిరగరాయాలన్నా తనకు తానే సాటి అని నిరూపించారు. సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ పనితనం అద్భుతంగా ఉంది. తమన్ అందించిన పాటలు, నేపథ్యం ప్రధానబలంగా నిలిచాయి. సినిమాని బోయపాటి శ్రీను చాలా బాగా తెరకెక్కించారు. నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి ఇలాంటి మంచి సినిమాల్ని మరిన్ని నిర్మించి అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ల తర్వాత రూపొందిన సినిమాకావడంతో ‘అఖండ’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించింది. పూర్ణ, జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు.
► Read latest Cinema News and Telugu News