Updated : 09/11/2021 13:10 IST

Nani: హృతిక్‌ రోషన్‌ నా చిత్రంలో నటిస్తారేమో: నాని

ఇంటర్నెట్‌ డెస్క్‌: పక్కింటి కుర్రాడిగా కనిపించే నటుల్లో నాని ఒకరు. భావోద్వేగం, కామెడీ ప్రధానంగా సాగే కథల్లో ఎక్కువగా కనిపించిన ఆయన తొలిసారి పూర్తిస్థాయి యాక్షన్‌ భరిత చిత్రంతో సందడి చేయనున్నారు. ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో నాని నటించిన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల టైటిల్‌ గీతాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని.. మీడియా, అభిమానులతో ముచ్చటించారు. ఆ ఆసక్తికర సంగతులివీ..

* మీ ప్రతి చిత్రంలోనూ ఏదో ప్రత్యేకత ఉంటుంది. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ నుంచి ఏం ఆశించవచ్చు?

నాని: ఒకటి కాదు చాలా ఉన్నాయి. విడుదలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడే ఆ వివరాల్ని బయటపెట్టలేను. కానీ, ఒకటి మాత్రం నమ్మకంగా చెప్పగలను. సాంకేతికత వినియోగం (ముఖ్యంగా ఫోన్లు) విపరీతంగా పెరిగిన ప్రస్తుత రోజుల్లో సినిమాని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోతున్నాం. గతంలో ఎలా అయితే కథలో లీనమయ్యేవాళ్లమో ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో అలా కనెక్ట్‌ అవుతాం. ఏ పని ఉన్నా పక్కన పెట్టేస్తాం.

* ‘శ్యామ్‌ సింగరాయ్‌’.. పాన్‌ ఇండియా స్థాయి చిత్రం అనిపిస్తుంది. హిందీలో విడుదలవుతుందా?

నాని: మీ దృష్టిలో పాన్‌ ఇండియా ఫిల్మ్‌ అంటే భారీ బడ్జెట్‌ అయి ఉండొచ్చు. కథే.. చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్తుందనేది నా అభిప్రాయం. అన్ని భాషల వారు చూడదగ్గదే పాన్‌ ఇండియా చిత్రం. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఈ కోవకే చెందుతుంది. ‘టక్‌ జగదీష్‌’లాంటి చిత్రాలు తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటాయి కాబట్టి మిగతా భాషల్లో చూడకపోవచ్చు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’కి అలాంటి పరిధులు లేవు. అందుకే దక్షిణాది భాషలన్నింటిలో విడుదల చేస్తున్నాం. ప్రస్తుతానికి హిందీలో విడుదల చేసే ఆలోచన లేదు. ఏమో చూద్దాం! ఏ హృతిక్‌ రోషనో ఈ చిత్రాన్ని హిందీలో చేసేస్తారనే నమ్మకం ఉంది.

* ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా. వారి ప్రాధాన్యత ఏంటి?

నాని: ఈ సినిమాలోనే కాదు నా ప్రతి చిత్రంలోనూ కథానాయిక పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్.. ముగ్గురు పాత్రలకు ఈ సినిమాలో చాలా ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురి, నా పాత్రే కాదు సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌కీ ప్రాధాన్యత ఉంటుంది.

* ఈ ముగ్గురిలో మీ అభిమాన నటి ఎవరు?

నాని: ఫలానా అని చెప్పలేను. ముగ్గురూ అభిమాన నటులే. ఒక్కో సన్నివేశంలో ఒక్కొక్కరు ఆకట్టుకున్నారు.

* ‘శ్యామ్‌ సింగరాయ్‌’ లుక్‌ కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?

నాని: నటులు కేర్‌ తీసుకున్నంత మాత్రాన లుక్‌ అద్భుతంగా రాదు. స్క్రిప్టు వల్లే అది సాధ్యమవుతుంది. దర్శకులు, రచయితలు, సాంకేతిక బృందం కలిసి పాత్రని తీర్చిదిద్దితే లుక్‌లో ఇంపాక్ట్‌ కనిపిస్తుంది. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ లుక్‌ బాగుందంటే కారణం 24 విభాగాల కష్టమే.

* ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. శ్యామ్‌ సింగరాయ్‌, వాసు.. ఈ రెండింటిలో ఏ పాత్ర సవాలుగా అనిపించింది?

నాని: రెండింటికీ ఒకేలా కష్టపడ్డా. కానీ, శ్యామ్‌ సింగరాయ్‌ మనసుకి దగ్గరైంది. ఈ పాత్ర చాలా కొత్తగా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది.

* పోస్టర్లు చూస్తుంటే సత్యజిత్‌ రే జీవిత కథ ఆధారంగా వస్తోన్న చిత్రమనిపిస్తుంది..!

నాని: మీరు అనుకున్నట్టు ఏం కాదు. కానీ, సత్యజిత్‌ రే గారితో పనిచేసిన కొందరు నటులు ఈ చిత్రంలో కనిపిస్తారు.

* మళ్లీ స్పోర్ట్స్‌ డ్రామాలో ఎప్పుడు నటిస్తారు?

నాని: ఇప్పటికే రెండు (భీమిలి: కబడ్డీ జట్టు, జెర్సీ) సినిమాలు చేశాను. స్పోర్ట్స్‌ డ్రామాలో మరో చిత్రం చేశానంటే ఇలాంటి చిత్రాలకి అంబాసిడర్‌ అయిపోతానేమోనని బ్రేక్‌ ఇస్తున్నా. ఇంకో ఐదారేళ్లు అయితే ప్లేయర్‌గా కాదు కోచ్‌ పాత్రల్లో నటించాల్సి వస్తుంది (నవ్వులు).

* మీ నుంచి భక్తి ప్రధాన చిత్రాలు, బయోపిక్స్‌ వచ్చే అవకాశం ఉందా?

నాని: హా. తప్పకుండా.

* చిన్నపిల్లల కోసం సినిమా ఎప్పుడు చేస్తారు?

నాని: చిన్నపిల్లలతో నేను నటించినట్టుగా యువ నటుల్లో ఎవరూ నటించి ఉండరు. ‘ఈగ’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తదితర చిత్రాల్లో బాల నటులు కనిపించారు. పిల్లలు ఎక్కువగా ఉండే చిత్రాన్ని త్వరలోనే ప్రకటిస్తా (నవ్వులు).


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్