Shyam Singha Roy Review: రివ్యూ: శ్యామ్‌ సింగరాయ్‌

Shyam Singha Roy Review: నాని, సాయి పల్లవి జంటగా నటించిన శ్యామ్‌ సింగరాయ్‌ ఎలా ఉంది?

Updated : 24 Dec 2021 15:09 IST

చిత్రం: శ్యామ్ సింగ‌రాయ్; న‌టీన‌టులు: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు; సంగీతం:  మిక్కీ జే మేయ‌ర్‌; కూర్పు: నవీన్ నూలి; ఛాయాగ్ర‌హ‌ణం: సాను జాన్ వర్గీస్; ద‌ర్శ‌క‌త్వం:  రాహుల్ సంకృత్యాన్; నిర్మాత‌: వెంక‌ట్ బోయ‌నప‌ల్లి; విడుద‌ల తేదీ: 24-12-2021

వైవిధ్య‌భ‌రిత క‌థ‌ల‌కు చిరునామాగా నిలిచే క‌థానాయ‌కుడు నాని(Nani). అందుకే ఆయ‌న నుంచి ఓ చిత్రం వ‌స్తుందంటే చాలు.. సినీ ప్రియులంతా ఆస‌క్తిగా చూస్తుంటారు.  ఇటీవ‌లే  ‘ట‌క్ జ‌గ‌దీష్‌’గా ఓటీటీ వేదిక‌గా వినోదాలు పంచిన ఆయ‌న‌.. ఇప్పుడు ‘శ్యామ్ సింగ‌రాయ్‌’(Shyam Singha Roy)గా వెండితెర ముందుకొచ్చారు. ‘టాక్సీవాలా’ వంటి హిట్ త‌ర్వాత రాహుల్ సంకృత్యాన్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. సాయిప‌ల్ల‌వి(Sai pallavi), కృతిశెట్టి(Krithi Shetty) క‌థానాయిక‌లు. ఇది పున‌ర్జ‌న్మ‌ల క‌థాశంతో రూపొందిన చిత్రం కావ‌డం.. ఇందుకు త‌గ్గ‌ట్లుగానే దీంట్లో నాని ద్విపాత్రాభిన‌యం చేయ‌డంతో  ప్రేక్ష‌కుల దృష్టి ఈ చిత్రంపై పడింది. పాట‌లు, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకోవ‌డంతో.. ఆ అంచ‌నాలు రెట్టింప‌య్యాయి.  మ‌రి ఇన్ని అంచ‌నాల మ‌ధ్య థియేట‌ర్లోకి వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉంది?(Shyam Singha Roy Review)  సినీప్రియుల‌కు ఎలాంటి అనుభూతిని అందించింది? రెండేళ్ల విరామ త‌ర్వాత థియేట‌ర్లోకి వ‌చ్చిన నానికి విజ‌యం ద‌క్కిందా?

కథేంటంటే: మంచి ద‌ర్శ‌కుడ‌వ్వాల‌ని క‌ల‌లు క‌నే కుర్రాడు వాసు (నాని). ఆ క‌ల నెర‌వేర్చుకోవ‌డం కోసం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కూడా వ‌దిలిపెట్టేస్తాడు. కీర్తి (కృతి శెట్టి)ని ప్ర‌ధాన పాత్ర‌లో పెట్టి ‘వ‌ర్ణం’ అనే లఘు చిత్రం చేస్తాడు. అది అంద‌రికీ న‌చ్చ‌డంతో వాసుకు ఓ పెద్ద సినిమా చేసే అవ‌కాశమొస్తుంది. ‘ఉనికి’ పేరుతో చేసిన ఆ చిత్రం కూడా భారీ విజ‌యాన్ని అందుకుంటుంది. దీంతో వాసు పేరు అన్ని చిత్ర‌సీమ‌ల‌కు పాకిపోతుంది. అత‌ని తొలి సినిమానే బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ముందుకొస్తుంది. హిందీ వెర్ష‌న్‌కూ వాసునే ద‌ర్శ‌కుడిగా తీసుకోవ‌డానికి ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించే స‌మ‌యంలోనే.. కాపీ రైట్ కేసులో వాసు అరెస్ట్ అవుతాడు. అత‌ని గ‌త చిత్రాలు రెండూ ప్ర‌ముఖ బెంగాలీ ర‌చ‌యిత‌ శ్యామ్ సింగ‌రాయ్(Shyam Singha Roy) ర‌చ‌న‌ల నుంచి కాపీ చేశార‌ని.. ఎస్ఆర్ ప‌బ్లికేష‌న్ అధినేత మ‌నోజ్ సింగ‌రాయ్ (రాహుల్ ర‌వీంద్ర‌న్‌) కోర్టుకెక్కుతాడు. అనంత‌రం  కేసు విచార‌ణ క్ర‌మంలో వాసును క్లినికల్ హిప్నాసిస్ చేయ‌గా.. అతనే గ‌త జ‌న్మ‌లో శ్యామ్ సింగరాయ్(Shyam Singha Roy) అని తెలుస్తుంది. మ‌రి అత‌ని క‌థేంటి?  దేవ‌దాసి మైత్రీ అలియాస్ రోజీ (సాయిప‌ల్ల‌వి)తో అత‌ని ప్రేమ‌ క‌థేంటి?  అస‌లు వాళ్లిద్ద‌రికీ ఏమైంది?  శ్యామ్ తిరిగి వాసుగా ఎందుకు పుట్టాడు?  వాసు తానే శ్యామ్ అని కోర్టు ముందు ఎలా నిరూపించుకున్నాడు? అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా ఉందంటే:  పున‌ర్జ‌న్మ‌ల క‌థ‌లు తెలుగు తెర‌కు కొత్తేమీ కాదు. అల‌నాటి ‘జాన‌కి రాముడు’ నుంచి ఇటీవ‌ల కాలంలో వ‌చ్చిన ‘మ‌గ‌ధీర’  వ‌ర‌కు ఈ త‌రహా క‌థ‌లు చాలానే వ‌చ్చాయి. వాటిలో చాలా వ‌ర‌కు విజ‌య‌వంతమ‌య్యాయి. ఈ ‘శ్యామ్ సింగ‌రాయ్’(Shyam Singha Roy review)కూడా ఆ త‌ర‌హా క‌థ‌తో రూపొందిన‌దే.  దీంట్లో నాని వాసుగా.. శ్యామ్‌గా రెండు భిన్న‌మైన పాత్రల్లో న‌టించారు. వాసు పాత్ర క‌థ వ‌ర్త‌మానంలో సాగుతుంటే.. శ్యామ్ సింగ‌రాయ్‌ పాత్ర  క‌థ 1970ల కాలం నాటి  బెంగాల్ నేప‌థ్యంలో సాగుతుంటుంది. ఇదే చిత్రానికి కాస్త కొత్త‌ద‌న‌మందించింది. అలాగే శ్యామ్‌ ప్రేమ‌క‌థ‌ను రాహుల్ రాసుకున్న విధానం.. నాని, సాయిప‌ల్ల‌విల పాత్ర‌ల్ని తీర్చిదిద్దినతీరు  ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తాయి. అయితే వాసు, శ్యామ్‌ల క‌థ‌ల్ని స‌మ‌ర్థ‌ంగా ముడివేయలేకపోయాడు.

ఆరంభంలో వాసు, కీర్తి  పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేసిన తీరు.. వాళ్లిద్ద‌రి ప్రేమ‌క‌థ‌ను చూపించిన విధానం  బాగుంది. ద‌ర్శ‌కుడు కావ‌డం కోసం వాసు ప‌డే క‌ష్టాలు..  అక్క‌డ్క‌క్కడా న‌వ్వులు పంచుతాయి. మ‌ధ్య‌లో వాసు, కీర్తిల మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ స‌న్నివేశాలు కుర్ర‌కారును ఆక‌ట్టుకుంటాయి. అయితే వాసు ద‌ర్శ‌కుడిగా ఎదిగిన తీరు మ‌రీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు అంత భావోద్వేగ‌భ‌రితంగా అనిపించ‌వు. ప్ర‌థమార్ధం మ‌ధ్య‌లో వ‌చ్చే యాక్ష‌న్ సీక్వెన్స్ ఆక‌ట్టుకుంటాయి. అక్క‌డి నుంచే క‌థ మ‌రో మ‌లుపు తీసుకుంటుంది. కాపీ రైట్ కేసులో వాసు అరెస్ట్ అయ్యాక‌.. క‌థ‌లో వేగం పెరుగుతుంది. అయితే ఆ త‌ర్వాత వ‌చ్చే కోర్ట్ డ్రామా స‌న్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి.  విరామానికి ముందు కేసు విచార‌ణ క్ర‌మంలో వాసును క్లినికల్ హిప్నాసిస్ చేయ‌గా.. అతనే గ‌త జ‌న్మ‌లో శ్యామ్ అని చెప్ప‌డంతో ద్వితీయార్ధంపై అంచ‌నాలు పెరుగుతాయి. ఇక  అక్క‌డి నుంచి కథ మొత్తం శ్యామ్ సింగ‌రాయ్(Shyam Singha Roy) పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ప‌రిచ‌య స‌న్నివేశంలో అంట‌రానిత‌నంపై శ్యామ్ ప‌లికే సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి. దేవ‌దాసి మైత్రిగా సాయిప‌ల్ల‌వి(Sai Pallavi) పాత్రని ప‌రిచ‌యం చేసిన తీరు మెప్పిస్తుంది. ఈ ఇద్ద‌రి ప్రేమ‌క‌థ ఎమోష‌న‌ల్‌గా సాగినా.. అక్క‌డ‌క్క‌డా మ‌రీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది.  కాళీ ఆల‌యంలో నాని చేసే యాక్ష‌న్ సీక్వెన్స్ హైలైట్‌గా అనిపిస్తాయి.  సినిమాలో శ్యామ్ పాత్ర‌ను స‌మాజంలోని అస‌మాన‌త‌లు.. అన్యాయాల‌పై పోరాడే వ్య‌క్తిగా చూపించినా ఆయ‌న పోరాటాన్ని ఎక్క‌డా ఆస‌క్తిక‌రంగా చూపించ‌లేదు. దేవ‌దాసీ వ్య‌వ‌స్థ‌పై శ్యామ్ ప‌లికిన సంభాష‌ణ‌లు క‌దిలించేలా ఉంటాయి. భావోద్వేగ‌భ‌రిత‌మైన క్లైమాక్స్ అంద‌రినీ మెప్పిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే:  వాసుగా.. శ్యామ్ సింగ‌రాయ్‌గా రెండు పాత్ర‌ల్లోనూ నాని(Nani) ఎంతో చ‌క్క‌గా ఒదిగిపోయాడు.  ముఖ్యంగా శ్యామ్ పాత్ర‌లో నాని న‌ట‌న‌.. ఆహార్యం.. మాట తీరు అన్నీ కొత్త‌గా అనిపిస్తాయి.  ఈ పాత్ర నాని కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిపోతుంది. మైత్రీ పాత్ర‌కు సాయిప‌ల్ల‌వి త‌న‌దైన అభిన‌యంతో వ‌న్నెల‌ద్దింది. డ్యాన్స్‌లో త‌న‌కు తిరుగులేద‌ని మ‌రోసారి నిరూపించుకుంది. ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేసింది. కీర్తిగా కృతి శెట్టి ఆక‌ట్టుకుంది. తెర‌పై చాలా అందంగా క‌నిపించింది. న‌ట‌న ప‌రంగా పెద్ద‌గా స్కోప్ దొర‌క‌లేదు. మ‌డోన్నా సెబాస్టియ‌న్, ముర‌ళీ శ‌ర్మ‌, జిషూ సేన్ గుప్తా, రాహుల్ ర‌వీంద్ర‌న్‌ పాత్రలు ప‌రిధి మేరకు ఆక‌ట్టుకుంటాయి. పున‌ర్జ‌న్మ‌ల క‌థ‌ను రాహుల్ కొత్త‌గా చెప్ప‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యాడు. అయితే క‌థ‌ని మ‌రింత బిగితో తీర్చిదిద్దుకొని ఉంటే సినిమా మ‌రోస్థాయిలో ఉండేది. ముఖ్యంగా కోర్ట్ రూమ్ డ్రామా చాలా వీక్‌గా ఉంది.  1970ల కాలం నాటి బెంగాల్ వాతావ‌ర‌ణాన్ని ఎంతో చ‌క్క‌గా చూపించాడు. అవినాష్ సెట్ వ‌ర్క్, జాన్ వ‌ర్గీస్ ఛాయాగ్ర‌హ‌ణం ప్రేక్ష‌కులకు కొత్త ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేస్తాయి. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. సిరివెన్నెల‌, రైజ్ ఆఫ్ సింగ‌రాయ్ పాట‌లు హ‌త్తుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు క‌థకు త‌గ్గ స్థాయిలో అత్యున్న‌తంగా ఉన్నాయి.

బ‌లాలు

+ క‌థా నేప‌థ్యం, ద్వితీయార్ధం

+ నాని, సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌

+ ఆర్ట్ వ‌ర్క్‌.. సంగీతం.. ఛాయాగ్ర‌హ‌ణం

బ‌ల‌హీన‌త‌లు

- ప్రథమార్ధం

- కోర్టు ఎపిసోడ్స్

చివ‌రిగా: శ్యామ్ - మైత్రీల ప్రేమ‌క‌థ మెప్పిస్తుంది!(Shyam Singha Roy review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని