Updated : 01 Jan 2022 10:37 IST

Nani: మ‌న ద‌గ్గరున్నది ఈ రోజే.. నా రెజ‌ల్యూష‌న్ అదే- నాని

హైదరాబాద్‌: విజ‌యోత్సాహంతో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న క‌థానాయ‌కుల్లో నాని ఒకరు.  క్రిస్‌మ‌స్ మ‌న‌దే అని వేదిక‌ల‌పై గ‌ట్టిగా చెప్పుకొచ్చిన ఆయ‌న అనుకున్నట్టుగానే ‘శ్యామ్ సింగ‌రాయ్‌’తో విజ‌యాన్ని అందుకున్నారు. వ‌రుస‌గా రెండు సినిమాలు ఓటీటీలో విడుద‌లైన త‌ర్వాత ఆయ‌న సినిమా థియేట‌ర్లో విడుద‌ల కావ‌డం ఇప్పుడే. అది మాత్రమే కాదు.. ఈసారి త‌న త‌న‌యుడు అర్జున్‌తో క‌లిసి సినిమాని చూడ‌టం మ‌రింత ప్రత్యేకం అంటున్నారు. కొత్త ఏడాది సంద‌ర్భంగా నాని  ఈనాడు.నెట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విష‌యాలివీ.

విజ‌యంతో కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్నారు.. మీ అనుభూతి ఎలా ఉంది?

నాని: చాలా సంతోషంగా ఉంది. ఈ రెండేళ్లు చాలా ఇబ్బందిగా గ‌డిచింది. నాకే కాదు, అంద‌రికీ. పైగా పెద్ద తెరపై నా సినిమాని చూసుకుని చాలా కాల‌మైంది. ఆ అనుభ‌వం ప‌క్కా ఓ థియేట‌ర్ సినిమాతో మ‌ళ్లీ థియేట‌ర్లకి తిరిగి రావ‌డం, దానికి ఇంత ప్రశంస‌లు రావ‌డం, ప్రేమ దొర‌క‌డం చాలా సంతోషంగా ఉంది. నాకే కాదు, టీమ్ అంద‌రికీ చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాదికి ఇంత‌కుమించిన మంచి ముగింపు నాకింకేం ఉంటుంది!

ఈసారి సంబ‌రాలు రెట్టింపుగా ఉండ‌బోతున్నాయ‌న్నమాట‌.

నాని: సందేహ‌మే లేదు. క్రిస్మస్ నుంచే నాకు కొత్త ఏడాది సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. ఈసారి ఈ ఉత్సాహంలో ఎక్కడికైనా ప్రయాణం చేద్దాం అనుకున్నాం కానీ, మ‌ళ్లీ ఈ ప‌రిస్థితుల్లో ఎందుక‌ని ఇంట్లో కుటుంబంతో క‌లిసే కొత్త ఏడాదిని ఆహ్వానించాల‌ని నిర్ణయించుకున్నాం. 1న ఇంట్లోనైనా ఉంటాం లేదంటే, పొలానికైనా వెళ్లి అక్కడైనా గ‌డుపుతాం.

మీ పొలం ఎక్కడుంటుంది?

నాని: సిటీ నుంచి ఒక గంట ప్రయాణం చేస్తే మా పొలం వ‌స్తుంది. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం.  అందుకే ఓ చిన్న ప్లేస్ కొన్నా. చిత్రీక‌ర‌ణ లేదంటే అక్కడికే వెళ్లి గ‌డుపుతుంటాం. కుటుంబ స‌భ్యులు, స్నేహితులతో అక్కడ గ‌డ‌ప‌డంలో భ‌లే హాయిగా ఉంటుంది. క‌రోనా స‌మ‌యంలో ఎక్కువ‌గా పొలంలోనే గ‌డిపా.

చాలా రోజుల త‌ర్వాత మీ సినిమాని మ‌ళ్లీ థియేట‌ర్లో చూసుకుంటున్నప్పుడు క‌లిగిన అనుభూతిని పంచుకుంటారా?

నాని: తొలి రోజు తొలి ఆట‌. ఈల‌లు, చ‌ప్పట్లు. ఈ రెండేళ్లలో నేను చాలా మిస్ అయిన ఎలిమెంట్స్ ఇవి. ప్రేక్షకుల‌తో క‌లిసి చూసుకుంటున్నప్పుడు తొలి నిమిషంలోనే ‘ఇది క‌దా మ‌నం మిస్ అయ్యింద‌’నే ఓ ఫీలింగ్ క‌లిగింది. ఈసారి నాతోపాటు మా అబ్బాయి కూడా సినిమా చూశాడు. త‌న‌కిప్పుడు నాలుగేళ్లు. త‌న రెండేళ్ల జీవితం పాండ‌మిక్ స‌మ‌యంలోనే గ‌డిచింది. రెండేళ్ల కింద‌ట త‌న‌కి అంత‌గా ఊహ తెలియ‌దు. ఊహ తెలిశాక త‌ను థియేట‌ర్లో, అది కూడా నా సినిమాని చూడ‌టం ఇదే తొలిసారి. త‌ను సినిమా చూస్తూ షాక్ అయ్యాడు. రోజూ ఇంట్లో చూసే నాన్న ఇంత పెద్ద తెర‌పై ఇలా క‌నిపిస్తున్నాడేంటి? ఇంత‌మంది ఇలా చూస్తూ, ఇలా అరుస్తున్నారేంట‌ని ఆశ్చర్య పోయాడు. ప‌క్కనున్న నావైపు చూశాడు.  త‌ను శ్యామ్ సింగ‌రాయ్‌ని చూడ‌టం ఎప్పటికీ మ‌రిచిపోలేడు. త‌ను సినిమా చూడ‌టాన్ని గ‌మ‌నించిన నేను కూడా ఎప్పటికీ ఈ సినిమాని మ‌రిచిపోలేను.

‘శ్యామ్‌సింగ‌రాయ్’ లుక్‌లో మిమ్మల్ని తొలిసారి చూసిన‌ప్పుడు మీ అబ్బాయి స్పంద‌న ఏమిటి?

నాని: ఈమ‌ధ్య నా మీసాలు తిప్పుతూ ల‌య‌న్‌లా ఉన్నావంటున్నాడు కానీ, మొద‌ట త‌న‌కి ‘శ్యామ్ సింగ‌రాయ్‌’ లుక్ అంత‌గా న‌చ్చలేదు. పిల్లల‌కి ఎప్పుడూ అల‌వాటైన రూపమే బాగా న‌చ్చుతుంది. ఉన్నట్టుండి మారిపోతే వాళ్లకి ఏదో కొత్తగా అనిపిస్తుంది. అప్పటిదాకా గెడ్డంలో క‌నిపించిన నేను ఒక్కసారి క్లీన్ షేవ్‌తో, మీసాలు తిప్పి క‌నిపించేస‌రికి న‌న్ను ఆశ్చర్యంగా చూశాడు. కొన్నాళ్లకి మ‌ళ్లీ ఆ లుక్ అల‌వాటైంది. మీసంతో ఆడుకోవ‌డం మొద‌లుపెట్టాడు.

క‌రోనాతో గ‌డిపిన ఈ రెండేళ్లలో మీ మ‌న‌సులో ఎలాంటి ఆలోచ‌న‌లు వ‌చ్చేవి?

నాని: సినిమాల గురించి వ‌చ్చిన ఆలోచ‌న‌లు త‌క్కువే. ఈ రెండేళ్లలో సినిమాలే విడుద‌ల కాని ప‌రిస్థితుల్లో నేనైనా ఓటీటీలో ప్రేక్షకుల్ని ప‌ల‌క‌రించాన‌నే ఓ తృప్తి, మ‌రోప‌క్క పెద్ద తెర‌పై నా సినిమా రాలేదు క‌దా అని మ‌రో అసంతృప్తి. ఇలా ఓ సాహ‌సాల ప్రయాణంలా గడిచింది. ఎవ‌రి స్టైల్‌లో వాళ్లకి ఇది అనుభ‌వమే.  నాకు సినిమా గురించ‌నే కాదు.. త‌ర్వాతేమిటి? పిల్లల భ‌విష్యత్తేమిటి?ఈ వైర‌స్‌లు ఏమిటి? ఎప్పటికి త‌గ్గుతుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు. కొన్నాళ్ల త‌ర్వాత మ‌న‌సులోని గుబులుని ప‌క్కన‌పెట్టి ‘మ‌న‌కి ఇంకో దారి లేదు, ఇలాంటివి వ‌స్తానే ఉంటాయి, ముందుకు వెళుతూనే ఉండాలి’ అనే విష‌యం అర్థమైంది.

కొత్త ఏడాది అన‌గానే కొత్త నిర్ణయాలు తీసుకోవ‌డం, మ‌ధ్యలోనే వాటిని వ‌దిలేయ‌డం చాలామంది విష‌యంలో జ‌రిగే తంతే ఇది. మ‌రి మీరూ?

నాని: గ‌డిచిన రెండేళ్ల దెబ్బకి నిన్న‌, రేపు అనే విష‌యాన్నే ప‌క్కన‌పెట్టా.  మ‌న ద‌గ్గరున్నది ఈ రోజే అనేది అర్థమైంది. ఈరోజు అంద‌రితో బాగుండాలి, అంద‌రూ హ్యాపీగా ఉండేలా చూసుకోవాల‌నే సిద్ధాంతంతో ప్రయాణం చేస్తున్నా. కొత్త ఏడాదిలోనూ అదే కొన‌సాగిస్తా. ఇక చిన్నప్పటి రెజ‌ల్యూష‌న్స్ అయితే భ‌లే గ‌మ్మత్తుగా ఉండేవి. పుస్తకాలు బాగా చ‌ద‌వాల‌నుకునేది, మ‌ధ్యలోనే ఆ నిర్ణయాన్ని గాలికొదిలేయ‌డం.  జిమ్‌కి వెళ్లాల‌నుకోవ‌డం, ఒక‌ట్రెండురోజులు సీరియ‌స్‌గా వెళ్లడం ఆ త‌ర్వాత బ‌ద్ధకించ‌డం. కానీ కొన్ని విష‌యాల్లో మాత్రం కొత్త ఏడాది, కొత్త నిర్ణయాలని కాకుండా మ‌ధ్యలోనే గ‌ట్టిగా అనుకుని పూర్తయ్యేవ‌ర‌కు వ‌దిలిపెట్టేవాణ్ని కాదు. అలా చేసిన ప్రతిసారీ మంచి ఫ‌లితాలు వ‌చ్చేవి. అందుకే ఓ మంచి నిర్ణయం తీసుకోవ‌డానికి ప్రత్యేకమైన రోజులంటూ అవ‌స‌రం లేదు, ఏదైనా స‌రే ఓ రోజు చాలంతే.

నాని కోసం బ‌ల‌మైన క‌థ‌లు కావాల‌ని ద‌ర్శకుడు రాహుల్ సంకృత్యాన్ చెప్పారు. క‌థ‌ల ఎంపికలో మీ ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయి?

నాని: ఒక న‌టుడి స‌త్తా బ‌య‌టపడేది, స‌త్తా ఉన్న స్క్రిప్ట్‌తోనే. అలాంటి బ‌ల‌మైన ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగ‌రాయ్’లాంటి  స్క్రిప్ట్‌లు నా ద‌గ్గర‌కి రావ‌డం నా అదృష్టం. ద‌ర్శకులు న‌న్ను న‌మ్మారు, నేను కూడా వంద‌శాతం త‌ప‌న‌తో ప‌నిచేశాను. అందుకే అంత గుర్తింపు. రాబోయే ‘అంటే సుంద‌రానికి’, ‘ద‌స‌రా’ సినిమాలు కూడా అలాగే ఉంటాయి.

ద‌స‌రా కోసం వేషం మారుస్తున్నారంట క‌దా?

నాని: జుట్టు, గెడ్డం పెంచ‌బోతున్నా. ఆ త‌ర్వాత సెట్లోకి అడుగు పెట్టాలి. అది చాలా మంచి స్క్రిప్ట్‌. తెలంగాణ యాస‌లో మాట్లాడ‌తా. ‘అంటే సుంద‌రానికి’ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అంద‌రికీ వినోదం పంచే ఓ మంచి క‌థ అది. ఒక‌ట్రెండు రోజులు మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్తయింది. స‌మ్మర్‌లో విడుద‌ల‌వుతుంది. ‘ద‌స‌రా’ కోసం ఇంకో రెండు నెల‌ల త‌ర్వాత సెట్లోకి అడుగు పెడ‌తా.

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్