Bollywood: నటి సురేఖ సిక్రీ కన్నుమూత

సహాయనటిగా మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న బాలీవుడ్‌ సీనియర్‌ నటి సురేఖ సిక్రీ(75) కన్నుమూశారు. బ్రెయిన్‌ స్ట్రోక్, ఇతర అనారోగ్య సమస్యలతో గత కొంతకాలం...

Updated : 16 Jul 2021 17:21 IST

ముంబయి: సహాయనటిగా మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న బాలీవుడ్‌ సీనియర్‌ నటి సురేఖ సిక్రీ(75) కన్నుమూశారు. బ్రెయిన్‌ స్ట్రోక్, ఇతర అనారోగ్య సమస్యలతో గత కొంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్న ఆమె శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. సురేఖ మరణంతో పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె మృతిపట్ల పలువురు నటీనటులు సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పోస్టులు పెడుతున్నారు.

నటనమీద ఉన్న ఆసక్తితో చిన్నతనం నుంచే సురేఖ సిక్రీ థియేటర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో నాటకాలు వేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘కిస్సా కుర్సీకా’ అనే సినిమాతో నటిగా వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం ఆమె ఎన్నో సినిమాల్లో సహాయ నటిగా ప్రేక్షకుల్ని అలరించారు. ‘మామో’, ‘తమస్‌’, ‘బధాయి హో’ చిత్రాలకుగాను ఆమె మూడుసార్లు సహాయనటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. సినిమాల్లోనే కాకుండా ఎన్నో ధారావాహికల్లోనూ సురేఖ నటించారు. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో ఆమె తెలుగు వారికి సైతం చేరువయ్యారు. నటిగా రాణిస్తున్న తరుణంలోనే 2018లో సురేఖ పక్షవాతానికి గురయ్యారు. ఓ వైపు అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నప్పటికీ నటన మీద ఉన్న మక్కువతో పక్షవాతం నుంచి కొద్దిగా కోలుకున్న వెంటనే వెండితెరపై కనిపించి అందర్నీ మెప్పించారు. ఈ క్రమంలోనే 2020లో ఆమె బ్రెయిన్‌స్ట్రోక్‌కి గురై కొంతమేర కోలుకున్నారు. గతేడాది విడుదలైన ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’లో ఆమె చివరిసారి వెండితెరపై కనిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని