Shyam Singha Roy: ఈ క్రిస్మస్‌ మనదే.. ఎనర్జీ దాచి పెట్టుకోండి: నాని

నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా తెరకెక్కిన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...

Published : 18 Nov 2021 11:50 IST

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా తెరకెక్కిన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్‌ విడుదల అనంతరం నాని మాట్లాడుతూ.. ‘‘రెండేళ్ల తర్వాత థియేటర్‌కి వస్తున్నామంటే ఈ మాత్రం ఉండాలి. టీజర్‌ విడుదల సందర్భంగా ఈ రోజు మీ అందర్నీ చూడటం, మీ అరుపులు వినడంతో నా కడుపు నిండిపోయింది. దీని కోసమే కదా మేము కష్టపడి పనిచేసేది. కరెక్ట్‌ సినిమాతో వస్తున్నా.. క్రిస్మస్‌ మాత్రం మనదే. ఇలాంటి మంచి సినిమాలో భాగమైనందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మీ అందరితో కలిసి ఈ సినిమా ఫస్ట్‌డే మార్నింగ్‌ షో చూసేందుకు ఎదురుచూస్తున్నాను. మీ ఎనర్జీ దాచి పెట్టుకోండి’’ అని నాని తెలిపారు.

ఈ సినిమాతో మీ కెరీర్‌లో మరో సరికొత్త దశ ప్రారంభించారనుకోవచ్చా?

నాని: ప్రతి సినిమా మనం ఏదైనా కొత్త దశ ప్రారంభించడానికే చేస్తాం. కొన్ని బాగా కుదురుతాయి. కొన్ని కుదరవు. కానీ కష్టం, ప్రయత్నంలో ఏమాత్రం లోపం ఉండదు. ఈసారి ఎందుకో అన్నీ చక్కగా కుదిరినట్లు అనిపిస్తోంది.

‘టక్‌ జగదీశ్‌’, ‘వి’ చిత్రాల తర్వాత మీరు ఈ సినిమాతో థియేటర్‌లోకి వస్తున్నారు? దానిపై మీ అభిప్రాయం?

నాని: ఈ సినిమాతో మేము తప్పకుండా మాంచి సక్సెస్‌ సొంతం చేసుకుంటామని నమ్ముతున్నాను. క్రిస్మస్‌ నాకెంతో స్పెషల్‌. ఓ ఏడాది క్రిస్మస్‌ సమయంలో విడుదలైన ‘ఎంసీఏ’ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టి విజయాన్ని సొంతం చేసుకొంది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందని నమ్ముతున్నాను. 

టీజర్‌ చూస్తుంటే ఏదో విప్లవాత్మకమైన కథగా ఉంది. ఇందులో ప్రేమ కథలకు ఎంత వరకూ స్కోప్‌ ఉంటుంది?

నాని: ఇది ఒక భిన్నమైన లవ్‌ స్టోరీ

సత్యదేవ్‌ కథలో నటించడానికి కారణమేమిటి?

నాని: సత్యదేవ్‌ కొత్త రచయిత కాదు. ఆయన ఎంతో కాలం నుంచి పరిశ్రమలో ఉన్నారు. నేను ఇప్పటి వరకూ కొత్త, పాత అనేది చూడలేదు. సత్యదేవ్‌ మంచి కథతో వచ్చారు. ఆయన చెప్పిన కథ నాకెంతో నచ్చింది. అందుకే ఓకే చేశాను.

ఈ స్టోరీ బెంగాలీ నేపథ్యంలో సాగుతుందా?

నాని: ఈ స్టోరీ బెంగాలీ నేపథ్యంలో ఉంటుంది. కానీ, డైలాగ్స్‌ అన్నీ బెంగాలీలో ఉండవు. ఒక్క డైలాగ్‌ ఇక్కడ టీజర్‌లో వచ్చింది. మిగిలినవి అక్కడక్కడ వస్తుంటాయి. ఇప్పుడే ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలీదు.. మీకున్న కొన్ని అనుమానాలు తీర్చడానికి చెబుతున్నా.. సినిమాలో శ్యామ్‌ వాళ్ల అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. అందుకే అతను బెంగాలీలో మాట్లాడుతుంటాడు.

‘ఎంసీఏ’ తర్వాత సాయిపల్లవితో కలిసి వర్క్‌ చేయడం ఎలా ఉంది?

నాని: సాయి పల్లవితో కలిసి మరోసారి స్క్రీన్‌ పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ‘ఎంసీఏ’తో ఇప్పటికే మేమిద్దరం బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాం. ఇప్పుడు డిసెంబర్‌ 24న ఏం జరగనుందో నాకు బాగా తెలుసు. హిట్‌ కాంబినేషన్‌గా మేము మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను.

ఈ సినిమాలో మీ లుక్‌ చాలా విభిన్నంగా ఉంది?

నాని: ఇప్పటి వరకూ మీరు చూడని నానిని ఇక నుంచి చూస్తారు. అదే పనిలో ఉన్నాను. దాని కోసమే కష్టపడుతున్నాను.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని