Published : 20/11/2021 01:10 IST

Oka Chinna Family Story Review: రివ్యూ: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ

వెబ్‌ సిరీస్‌: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ; నటీనటులు: సంగీత్‌ శోభన్‌, సిమ్రన్‌ శర్మ, నరేశ్, తులసి, రాజీవ్‌ కనకాల, గెటప్‌ శ్రీను తదితరులు; సంగీతం: పీకే దండి; ఛాయాగ్రహణం: ఎదురోలు రాజు; కథ: మానస శర్మ, మహేశ్‌ ఉప్పాల; దర్శకత్వం: మహేశ్‌ ఉప్పాల; నిర్మాత: నిహారిక కొణిదల; విడుదల: జీ 5.

కరోనా వైరస్‌/లాక్‌డౌన్‌ తర్వాత ఓటీటీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. అందుకే కొత్తవారితో పాటు అనుభవం ఉన్న నటులూ డిజిటల్‌ మాధ్యమం వైపు అడుగులు వేస్తున్నారు. అలా సీనియర్‌ నటుడు నరేశ్‌ ప్రధాన పాత్ర పోషించిన వెబ్‌ సిరీస్‌ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’. సంగీత్‌ శోభన్‌ హీరోగా నిహారిక కొణిదెల నిర్మించిన సిరీస్‌ ఇది. ప్రముఖ నటులు నాగార్జున, నాని, వరుణ్‌ తేజ్‌ ప్రచారం చేయడంతో ఈ సిరీస్ అందరి దృష్టిలో పడింది. టీజర్‌, ట్రైలర్‌.. కుటుంబ సమేతంగా చూడదగ్గ సిరీస్‌ అని చెప్పకనే చెప్పాయి. మరి ఎలాంటి థ్రిల్లింగ్‌, రొమాన్స్‌ అంశాలులేని ఈ కథేంటో తెలుసుకుందామా...

ఇదీ కథ..: హరిదాస్‌ (నరేశ్‌), రుక్మిణి (తులసి) దంపతుల ముద్దుల తనయుడు మహేశ్‌ (సంగీత్‌ శోభన్‌). ఇంజనీరింగ్‌ విద్యనభ్యసించి ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు. ‘ఉద్యోగం/ పని చేయాల్సిన అవసరం నాకేంటి’ అనుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. కూర్చోపెట్టి జీతం ఇచ్చే జాబ్‌ దొరికితే బాగుండనే కలలో బతుకుతుంటాడు. వారి వీధిలోనే ఉండే కీర్తి (సిమ్రన్ శర్మ) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. మహేశ్‌ చేసే ఏ పనికీ అడ్డుచెప్పకుండా రుక్మిణి ప్రోత్సాహం అందిస్తుంది. వీరిద్దరి ప్రవర్తన హరిదాస్‌కు నచ్చదు. దాంతో హరిదాస్‌, రుక్మిణి- మహేశ్‌ మధ్య రోజూ టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ నడుస్తుంది. చిన్న చిన్న గొడవలు, అరుపులు, నవ్వులు... ఇలా సరదాగా సాగే కుటుంబంలో ఊహించని విషాదం ఎదురవుతుంది. హరిదాస్‌ మరణిస్తాడు. రూ.25 లక్షలు లోన్‌ తీసుకున్నాడనే విషయం చనిపోయిన తర్వాతే హరిదాస్‌ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. ఖర్చుల విషయంలో ‘బడ్జెట్‌ పద్మనాభం’లా వ్యవహరించే హరిదాస్‌ అంత డబ్బు తీసుకోవడం, ఈఎమ్‌ఐలా ద్వారా ఆ మొత్తాన్ని తానే కట్టాలనే విషయం మహేశ్‌ను షాక్‌కు గురి చేస్తాయి. మరి హరిదాస్‌ అంత లోన్‌ ఎందుకు తీసుకున్నాడు? మహేశ్‌ దాన్ని తీర్చగలిగాడా? కీర్తి మనసు గెలిచాడా? అన్నది తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే..: వరంగల్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. బామ్మ, అమ్మ, నాన్న, కొడుకు.. ప్రధాన పాత్రలుగా రూపొందింది. చాలా మధ్య తరగతి కుటుంబాల్లోలానే ఇందులోనూ తల్లీకొడుకు ఓ పార్టీ.. తండ్రి మరో పార్టీగా కనిపిస్తారు. తెలుగులో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. కానీ, సిరీస్‌లు లేవనే చెప్పొచ్చు. ఈ సిరీస్‌ ఆ లోటుని భర్తీ చేస్తూ ఆద్యంతం వినోదాన్ని పంచుతూ అలరిస్తుంది. ఐదు ఎపిసోడ్స్‌తో.. ఇది కథే, మన పక్కింటి వారి కథే అనుకునేంత సహజంగా దర్శకుడు తెరకెక్కించాడు. ‘హౌజ్‌ నం. 9’, ‘ది ఫస్ట్‌ ఈఎమ్‌ఐ’, ‘ఆఫ్‌ ది మనీ, బై ది మనీ, ఫర్‌ ది మనీ’ అనే ఎపిసోడ్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయి. పవర్‌ బిల్లుకు, మీటర్‌ నంబరుకు తేడా తెలియనంత అల్లారుముద్దుగా పెరిగిన హీరో ఈఎమ్‌ఐ తీర్చేందుకు పడే పాట్లు విశేషంగా అలరిస్తాయి. 

‘ఔస్టింగ్‌ డేస్‌’ అనే ఎపిసోడ్‌తో అసలు కథ మొదలవుతుంది. అప్పటి వరకూ నవ్వుల ప్రపంచంలో ముంచెత్తిన దర్శకుడు నెమ్మదిగా ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునే ప్రయత్నం చేశాడు. ‘ట్రూత్‌ డేర్‌’ అనే ఎపిసోడ్‌తో అది ఇంకాస్త ఎక్కువవుతుంది. అందరూ అనుకున్నట్టుగా తన తండ్రి ఎలాంటి తప్పూ చేయలేదని హీరో తెలుసుకునే సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. కుటుంబ కథకి.. రూ.25 లక్షలు ఏమయ్యాయనే ఉత్కంఠని జత చేసిన విధానం కొత్త అనుభూతి పంచుతుంది. చిన్న సబ్జెక్ట్‌ అయినా నిడివి ఎక్కువైంది అనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. హీరో మామయ్య (రాజీవ్‌ కనకాల), హీరోయిన్‌, గెటప్‌ శ్రీను పాత్రల్ని తీర్చిదిద్దడంలో దర్శకుడు మరికొంత శ్రద్ధ పెట్టాల్సింది. 

ఎవరెలా చేశారంటే..: కొంతసేపే కనిపించినా నరేశ్‌ తనదైన మార్క్‌ చూపించారు. మాధ్యమం ఏదైనా నటన ప్రాధాన్యమని నిరూపించారు. తెలంగాణ యాసతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సగటు మధ్యతరగతి ఇంటి యజమాని పడే కష్టాల్ని, బాధల్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రలు పోషించిన తులసి మరోసారి అదే క్యారెక్టర్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. అమాయకత్వంతో ఆమె పంచిన వినోదం అంతా ఇంతా కాదు. సంగీత్‌ విషయానికొస్తే.. ఆయన నటించిన రెండో సిరీస్‌ ఇది. కామెడీ, ఎమోషన్‌.. అన్ని కోణాల్లోనూ పరిణతి చూపించాడు. రాజీవ్‌ కనకాల, గెటప్‌ శ్రీను పాత్ర పరిధి మేరకు నటించారు. సిమ్రన్‌ శర్మ తన అందం, అభినయంతో మెప్పిస్తుంది. సందర్భానుసారం వచ్చే పాటలు ఫర్వాలేదపిస్తాయి. కథ ఎక్కువగా ఇంటి నేపథ్యంలోనే సాగడంతో లొకేషన్లను క్యాప్చర్‌ చేసే అవకాశం లేకపోయింది. దర్శకుడు ఎలాంటి కన్య్ఫూజన్‌ లేకుండా చాలా స్పష్టంగా కథని చెప్పగలిగాడు.

బలాలు

+ సంగీత్‌, రుక్మిణి నటన

+ కామెడీ

బలహీనతలు

- కాస్త నెమ్మదిగా సాగే కథాగమనం

చివరిగా: ఈ ‘చిన్న ఫ్యామిలీ స్టోరీ’.. పెద్దగా నవ్విస్తుంది, కొద్దిగా ఏడిపిస్తుంది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని