
Celebrities: క్యాన్సర్‌ను జయించిన తారలు వీరే..!
ఇంటర్నెట్‌డెస్క్: ‘‘ఆశ క్యాన్సర్ ఉన్నవాడిని కూడా బతికిస్తుంది.. భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది’’ అని త్రివిక్రమ్ రాసిన పవర్‌ఫుల్ డైలాగ్ ఈ సెలబ్రిటీలకు సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే వీళ్లందరూ జీవితంపై ఆశతో క్యాన్సర్ మహమ్మారితో పోరాటం చేసి విజయం సాధించారు. క్యాన్సర్ నుంచి కోలుకుని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా సినీ నటి హంసా నందిని సైతం క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో అందరి ముందుకు వస్తానంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కరోనాతో పోరాడి విజయం సాధించిన పలువురు సెలబ్రిటీల గురించి కొన్ని విశేషాలు..
హంసా నందిని
నటి హంసా నందిని ఇటీవల క్యాన్సర్ బారిన పడ్డారు. గతంలో రొమ్ము క్యాన్సర్ గ్రేడ్-3 నుంచి కోలుకున్న ఆమె ఇప్పుడు జన్యుపరమైన క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. దాని ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 70శాతం లేదా గర్భాశయ క్యాన్సర్ బయటపడే అవకాశం 40 శాతం ఉంది. ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు ఇప్పటికే ఆమె 9 విడతల కిమోథెరపీ చేయించుకున్నారు. నవ్వుతూ ధైర్యంగా పోరాడతానని.. మరలా సంపూర్ణ ఆరోగ్యంతో అందరి ముందుకు వస్తానంటూ గుండెల నిండా ఆత్మస్థైర్యంతో హంసా నందిని పోస్ట్ పెట్టారు.
సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అలుపెరగని పోరాటం చేసి జయించారు. 61 ఏళ్ల వయసులోనూ ఆయన క్యాన్సర్‌తో పోరాడిన తీరు ప్రతిఒక్కరిలో స్ఫూర్తినింపింది. వ్యాధి తీవ్రత నాలుగో దశలో ఉందని గతేడాది ఆగస్టులో ఆయన సతీమణి మాన్యతా దత్ తెలిపారు. దీంతో సంజయ్ కొన్నాళ్లు నటనకు కూడా బ్రేక్ ఇచ్చి.. విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకొని, కోలుకున్నారు. ఇప్పుడు మరలా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
యువరాజ్ సింగ్
భారత క్రికెట్ ఆటగాడు యువరాజ్‌సింగ్ అరుదైన క్యాన్స్‌ర్‌పై విజయం సాధించారు. 2011 ప్రపంచకప్ సమయంలో మెడియాస్టినల్ సెమినోమా క్యాన్సర్‌తో ఇబ్బందిపడిన ఆయన అమెరికాలో చికిత్స తీసుకున్నారు. మూడు కిమోథెరపీల అనంతరం 2012లో క్యాన్సర్‌ను జయించారు. జీవితంపై ఆశ.. కుటుంబం, అభిమానులు ఇచ్చిన సపోర్ట్ వల్లే తాను మహమ్మారి నుంచి త్వరగా కోలుకోగలిగానని ఆయన తెలిపారు.
సోనాలిబింద్రే
కంటికి కనపడని నొప్పిని పంటిబిగువున భరిస్తూ, సానుకూల దృక్పథంతో నటి సోనాలిబింద్రే మెటాస్టాటిక్ క్యాన్సర్‌ను జయించారు. కిమోథెరపీల వల్ల జుట్టు కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని వదలక.. కుటుంబం, స్నేహితులు ఇచ్చిన ధైర్యంతో ఆమె వ్యాధిపై పోరాటం చేశారు.
మనీషా కొయిరాలా
నటి మనీషా కొయిరాలా 2012లో అండాశయ క్యాన్సర్ బారినపడ్డారు. మూడేళ్ల చికిత్స అనంతరం 2015లో ఆమె క్యాన్సర్‌ను జయించారు. ‘‘క్యాన్సర్‌తో పోరాటం.. ఇది ఎంత కఠినమైన ప్రయాణమో నాకు తెలుసు. అయితే ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. మీరు దాంతో పోరాడేంత శక్తి మీలో ఉంది’’ అని మనీషా చెబుతుంటారు. 2018లో తన జీవిత చరిత్ర ‘‘హీల్డ్: హౌ క్యాన్సర్ గేవ్ మీ ఏ న్యూ లైఫ్’’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. క్యాన్సర్ నుంచి ఎలా బయటపడ్డారు, అందుకోసం ఏం చేశారనే సమాచారాన్ని అందులో పొందుపరిచారు. వీళ్లు మాత్రమే కాకుండా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ సోదరి సునైనా రోషన్, తండ్రి రాకేశ్ రోషన్, నటి మమతా మోహన్‌దాస్, లీసా రే మహమ్మారి నుంచి కోలుకున్నవారే..!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.