Radhe Shyam: అభిమానుల కోసమే ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ చేశారు: పూజాహెగ్డే

ఎన్నో యాక్షన్‌ సినిమాలు చేసినా తమ అభిమానులకు విభిన్నమైన చిత్రాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’లో నటించారని పూజాహెగ్డే అన్నారు.

Published : 23 Dec 2021 22:24 IST

హైదరాబాద్‌: ఎన్నో యాక్షన్‌ సినిమాలు చేసినా తమ అభిమానులకు విభిన్నమైన చిత్రాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’లో నటించారని పూజాహెగ్డే అన్నారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన పాన్‌ ఇండియా చిత్రమే ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణకుమార్‌ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ‘రాధేశ్యామ్‌’టీమ్‌తో పాటు ప్రభాస్‌ నటిస్తున్న తదుపరి చిత్రాల దర్శకులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

వేడుకనుద్దేశించి పూజాహెగ్డే మాట్లాడుతూ.. ‘‘మీ అందరికీ ‘రాధేశ్యామ్‌’ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా. వెండితెరపై ఈ ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించడానికి నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు. దర్శకుడు రాధాకృష్ణకు సినిమాపై ఎంతో ప్యాషన్‌ ఉంది. సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌ చాలా అందంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. పరిస్థితుల కారణంగా సినిమా ఆలస్యమవుతుంటే కొన్నిసార్లు నిరాశపడ్డారు. కానీ, సినిమాపై వారికున్న ఇష్టమే ‘రాధేశ్యామ్‌’ను మరో స్థాయిలో తీర్చిదిద్దేలా చేసింది. పాత్రల మధ్య భావోద్వేగాలు మిమ్మల్ని మెప్పిస్తాయి. ‘బాహుబలి’తో పాటు అంతకు ముందు ఎన్నో యాక్షన్‌ సినిమాలు చేసినా తమ అభిమానులకు ఒక డిఫరెంట్‌ సినిమాను ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభాస్‌ ఈ సినిమా చేశారు. మీరు సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఈ సినిమాతో ఓ కొత్త పూజా హెగ్డే, సరికొత్త ప్రభాస్‌ను చూస్తారు. సంక్రాంతికి వచ్చే ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. నాకు కూడా సంక్రాంతి కలిసొచ్చిన పండగ’’ అని తెలిపారు.

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడంతా పాన్‌ ఇండియా అంటున్నారంటే దానికి కారణం ప్రభాస్‌, దర్శకుడు రాజమౌళి. వారు చూపిన దారిలోనే మేం పయనిస్తున్నాం. ‘రాధేశ్యామ్‌’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ప్రభాస్‌- పూజా కెమిస్ట్రీ బాగుంది. ఈ చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌. ‘ప్రాజెక్ట్‌ కె’ విషయానికొస్తే.. ప్రభాస్‌ హిందీ పెర్ఫామెన్స్‌, దీపికా పదుకొణె తెలుగు పెర్ఫామెన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా (నవ్వులు). దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం’’ అని అన్నారు.

దర్శకుడు ఓంరౌత్‌ మాట్లాడుతూ.. ‘‘రాధేశ్యామ్‌’ ఓ ప్రేమకథ అని ప్రభాస్‌ అన్నారు. ట్రైలర్‌ చూశాక అది నిజం కాదనిపిస్తోంది. ఇందులో డ్రామా, సస్పెన్స్‌, యాక్షన్‌.. ఇలా అన్ని కోణాలూ ఉన్నాయి. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. ‘ఆదిపురుష్‌’.. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది’’ అని అన్నారు.

‘‘రాధేశ్యామ్‌’ ట్రైలర్‌ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ విడుదలైనప్పుడు నాకూ ప్రభాస్‌కు ఒక సంభాషణ జరిగింది. ‘మాస్‌ హీరోను ఇంత క్లాస్‌గా ఎవరు చూస్తారు’ అని అనుకున్నాం. కానీ, ఆ రెండు సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. యాక్షన్‌ సినిమాలు చేసిన తర్వాత ప్రభాస్‌ను ‘రాధేశ్యామ్‌’లో సరికొత్తగా చూపించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అని దిల్‌రాజు చెప్పుకొచ్చారు.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని