Sridevi Soda Center: ప్రభాస్‌ మామూలుగా అలా అడగడు కానీ.. ఈ కథకి.. 

Prabhas: సుధీర్‌బాబు-ఆనంది జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ‘పలాస 1978’ ఫేమ్‌ దర్శకుడు కరుణకుమార్‌ దర్శకుడు. తాజాగా ఈ చిత్ర బృందంతో ప్రభాస్‌ పంచుకున్న విశేషాలు ఇవే!

Published : 26 Aug 2021 16:25 IST

‌‘శ్రీదేవి సోడా సెంటర్‌’ టీమ్‌తో ప్రభాస్‌ సరదా ముచ్చట్లు

హైదరాబాద్‌: సుధీర్‌బాబు-ఆనంది జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ‘పలాస 1978’ ఫేమ్‌ దర్శకుడు కరుణకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్‌ చిల్లా నిర్మించారు. శుక్రవారం ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ ప్రమోషన్‌లో పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ భాగమయ్యారు. దర్శకనిర్మాతలతోపాటు హీరోతో సరదాగా కాసేపు ముచ్చటించారు. సినిమా గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆ విశేషాలివే..

ప్రభాస్‌: విజయ్‌ చిల్లా నాకు ఎప్పటినుంచో స్నేహితుడు. ఇటీవల తను మీ సినిమా టీజర్‌ చూపించాడు. నాకు బాగా నచ్చింది. సుధీర్‌ ఇంతకీ ఆ బాడీ ఏంటి? అలా మారిపోయావేంటి?

సుధీర్‌: థ్యాంక్యూ. సినిమా కోసం కథ డిమాండ్‌ చేయడం వల్ల ఫిట్‌నెస్‌ విషయంలో జాగ్రత్తలు పాటించి బాగా వర్కౌట్లు చేసి అలా మారాల్సి వచ్చింది.

ప్రభాస్‌: ‘గ్లిమ్స్‌ ఆఫ్‌ సూరిబాబు’లో బోట్‌ రేస్‌ ఉన్నట్లు చూపించారు? ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలని ఉంది?

కరుణకుమార్‌: తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఏడాదికొకసారి ‘బోట్‌ రేస్‌’ నిర్వహిస్తారు. పులస చేపలు ఎక్కువ లభించే రేవు కోసం ఆ పోటీ జరుగుతుంది. మత్స్యకారులు ఇందులో పాల్గొంటారు. రేసులో గెలుపొందిన వారికి ఏడాది పాటు ఆ రేవులో చేపలు పట్టుకునే అవకాశం ఉంటుంది. మిగతా వారు అక్కడ చేపలు పట్టుకోకూడదు. ఆ రేసులో వాడే పడవలు కూడా ఎంతో విభిన్నంగా ఉంటాయి. కేవలం ఇద్దరు మనుషులు మాత్రమే ఆ పడవలో ప్రయాణించగలరు. ఒకవేళ బరువుకుమించి మూడో వ్యక్తి కనుక అందులో ఎక్కితే పడవ అక్కడికక్కడే మునిగిపోతుంది. సినిమాలోని ఓ సన్నివేశంలో ఆ రేస్‌ సీక్వెన్స్ చూపించాం. అది నేచురల్‌గా కనిపించడం కోసం నిజంగా రేస్‌ జరిగినప్పుడు అక్కడికి వెళ్లి కొన్ని వీడియోలు షూట్‌ చేశాం. దానికి అనుగుణంగా మేము సీక్వెన్స్ కంపోజ్‌ చేసుకున్నాం.

విజయ్‌: మత్స్యకారులు మాత్రమే కాకుండా రాజమండ్రిలోని సాధారణ ప్రజల జీవన స్థితిగతులను ఈ సినిమాలో చూపించాం.

ప్రభాస్‌: సినిమాలో సుధీర్‌ పాత్ర ఏమిటి?

కరుణకుమార్‌: సుధీర్‌ ఈ సినిమాలో ఎలక్ట్రిషియన్‌ పాత్ర పోషించాడు. ఓ ఎలక్ట్రికల్‌ షాపు పెట్టి జీవితంలో స్థిరపడాలనేది హీరో కల. ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌ పాత్ర ఆయనది. అతని స్నేహితుడు ఓ మత్స్యకారుడు. పడవల పోటీలో స్నేహితుడ్ని గెలిపించడం కోసం బోట్‌కి మోటర్ తయారు చేస్తాడు.

ప్రభాస్‌: ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ అనే టైటిల్‌ ఎందుకు పెట్టారు?

కరుణకుమార్‌: శ్రీదేవి అంటే అందరికీ తెలిసిన పేరు. సినిమాలో హీరోయిన్‌ పాత్ర పేరు కూడా శ్రీదేవినే. స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకున్న తర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ అయితే బాగుంటుందని ఫిక్స్‌ అయిపోయాను. సినిమా తూర్పుగోదావరి జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో చూపించాం. ఆ జిల్లాలో ఎక్కడా చూసిన ‘శ్రీదేవి’ పేరుతో ఎన్నో షాపులు కనిపిస్తాయి. (మధ్యలో ప్రభాస్‌ అందుకుని టైటిల్‌లో చూపించిన బోర్డు ఎంతో నేచురల్‌గా ఉంది. చూడడానికి చక్కగా ఉంది)

ప్రభాస్‌: సర్‌... మీ లైఫ్ స్టోరీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని విజయ్‌ చెప్పాడు. మీ కథ మరోసారి చెబుతారా?
కరుణకుమార్‌: 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయాను. ఆ తర్వాత హోటల్‌లో పనిచేశాను. కొంతకాలంపాటు ఇళయరాజా, యేసుదాస్‌ ఇళ్లల్లో పనిచేశాను. వివాహమైన తర్వాత సొంతంగా ట్రావెల్‌ బిజినెస్‌ ప్రారంభించాను. నాకు కథలు రాయడమంటే ఎంతో ఆసక్తి. దాంతో బిజినెస్ చూసుకుంటూనే కథలు, కవితలు రాసి పేపర్లకు పంపించేవాడిని. ఓసారి సరదాగా స్టాండప్‌ కామెడీ ట్రై చేశాను. అందులో నాకు ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. అప్పుడు ఓ పెద్దాయన సినిమాలకు రచయితగా వ్యవహరిస్తావా? అని అడిగారు. ఓకే అన్నాను. కొన్ని సినిమాలకు రైటర్‌గా వ్యవహరించాను. ‘అ!’ సినిమాకు నా పేరు స్క్రీన్‌పై వేశారు.

ప్రభాస్‌: సినిమా మొత్తంలో నీకు కష్టంగా అనిపించిన సన్నివేశం ఏమిటి?

సుధీర్‌: కథ విన్నా వెంటనే కొంచెం భయంగా అనిపించింది. ఫిజికల్‌గా కొంచెం కష్టపడాల్సి వచ్చింది. షూట్‌ ప్రారంభించిన మొదట్లోనే ఫిజిక్‌ చూపించే షాట్స్‌ చిత్రీకరించాలని అనుకున్నాం. కానీ అది ప్రతిసారీ వాయిదా పడుతూ వచ్చి.. చివర్లో షూట్‌ చేశాం. దానివల్ల కొంత ఇబ్బందిపడ్డాను. షూట్‌లో చిన్న చిన్న గాయాలు అయ్యాయి.

ప్రభాస్‌: అమలాపురంలో మీకు గుర్తుండిపోయే జ్ఞాపకాలు?

విజయ్‌: అమలాపురంలో బాగా నచ్చిన వంటకం పొట్టిక్కలు. షూటింగ్‌ జరిగినన్ని రోజులు ఓ హోటల్‌లో టీఫిన్‌ చేసేవాళ్లం. ఆ హోటల్‌.. అక్కడి ప్రజలు మాకు బాగా నచ్చేశారు. ( మధ్యలో సుధీర్‌ అందుకుని.. 35 రోజులు అక్కడే షూట్‌ చేశాం. కానీ ఎవరూ ఈ పొట్టిక్కలు గురించి చెప్పనే లేదు. (నవ్వులు))

కరుణకుమార్‌: లేదు సర్‌. షూట్‌ నుంచి వచ్చిన వెంటనే సుధీర్‌గారు జిమ్‌కి వెళ్లిపోయేవాళ్లు . మేము పొట్టిక్కలకు వెళ్లేవాళ్లం. అందుకే ఆయనకు ఇది తెలియలేదు.

ప్రభాస్‌: హీరోయిన్‌ ఆనంది నటన కూడా బాగుంది.

కరుణకుమార్‌: స్క్రిప్ట్‌ అనుకున్నప్పుడే ఇందులో హీరోయిన్‌గా తప్పకుండా తెలుగమ్మాయిని తీసుకోవాలనుకున్నాం. వాళ్లు అయితేనే గోదావరి భాషలో మాట్లాడగలరని భావించాను. అయితే, కథ సిద్ధం చేసుకున్నాక.. ఎంతోమందిని ఆడిషన్‌, లుక్‌ టెస్ట్‌లు కూడా చేశాం. చివరికి ఆనందిని సెలక్ట్‌ చేశాం.

ప్రభాస్‌: ప్రొడ్యూసర్‌ విజయ్‌ గురించి ఏమనుకుంటున్నారు?

కరుణకుమార్‌: ఆయన ఒక డ్రిల్‌ మాస్టర్‌ సర్‌. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఆయన ప్రొడ్యూసర్‌ విజయ్‌ చిల్లా. ఆరు తర్వాత విజయ్‌ చిల్‌. (నవ్వులు)

ప్రభాస్‌:మణిశర్మ మంచి సంగీతం అందించారు.

విజయ్‌: మణిశర్మ స్వరాలు బాగా అందించారు. ఆయన ప్రతి సీన్‌ గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని మ్యూజిక్‌ కంపోజ్‌ చేశారు.

కరుణకుమార్‌: క్లైమాక్స్‌ ఫైట్‌కి ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయింది.

ప్రభాస్‌: సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు?

కరుణకుమార్‌: మంచి కథతో సినిమా చేశాం. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ప్రతి ప్రేక్షకుడి మదిలో ఇది గుర్తుండిపోతుంది.

విజయ్‌: ఈ సినిమా కథ ఇటీవల ప్రభాస్‌కి చెప్పాను. సాధారణంగా ప్రభాస్‌ ఏదైనా కథ చెబితే ఓకే అంటాడు. కానీ ఈ కథ చెబుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏమైంది అని అడుగుతూనే ఉన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని