MAA Elections: ‘ఏజెంట్లతో పోస్టల్‌ బ్యాలెట్‌ కుట్ర’: మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్‌ ఫిర్యాదు

త్వరలో ‘మా’ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

Updated : 05 Oct 2021 12:40 IST

హైదరాబాద్‌: ‘మా’ ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కుతోంది. మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని మంచు విష్ణు ప్యానల్‌ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ‘మా’ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ దుర్వినియోగం అవుతోందని చెప్పారు. ఈ మేరకు తన ప్యానల్‌ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్‌ ఫిర్యాదు చేశారు. అనంతరం జీవితా రాజశేఖర్‌, శ్రీకాంత్‌ తదితరులతో కలిసి ప్రకాశ్‌రాజ్‌ మీడియాతో మాట్లాడారు.

వాళ్లు సమాధానం చెప్పాలి..

‘‘60 ఏళ్లు పైబడిన నటీనటులు పోస్టల్‌ బ్యాలెట్‌కు అర్హులు. ఏజెంట్ల ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ కుట్ర చేస్తున్నారు. అర్హత ఉన్న సభ్యుల నుంచి విష్ణు ప్యానల్‌ సంతకాలు సేకరిస్తోంది. నిన్న సాయంత్రం విష్ణు తరఫున ఓ వ్యక్తి 56 మంది సభ్యుల తరఫున రూ.28వేలు కట్టారు. ఆయన కడితే ఇక్కడ ఎలా తీసుకున్నారు? కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్‌, శరత్‌బాబు తదితరుల పోస్టల్‌ బ్యాలెట్‌ డబ్బులు కూడా మంచు విష్ణు తరఫు వ్యక్తే కట్టారు. ఆగంతుకులతో ‘మా’ ఎన్నికలు నిర్వహిస్తామా?ఇలా గెలుస్తారా?మీ హామీలు చెప్పి గెలవరా? ఇంత దిగజారుతారా? ఈ విషయంపై పెద్దలు కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని