
MAA Elections: గత ఎన్నికల్లో నేను ఓడిపోలేదు.. ఓడించారు: శ్రీకాంత్
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ అభివృద్ధి ప్రకాశ్‌రాజ్ వల్లే సాధ్యమవుతుందని నటుడు శ్రీకాంత్ అన్నారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి ఆయన పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో శ్రీకాంత్ ‘మా’ ఎన్నికలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కావాలనే పరిశ్రమలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ‘మా’కు శాశ్వత భవన నిర్మాణం ప్రకాశ్‌రాజ్ వల్లే సాధ్యమవుతుందని తెలిపారు.
‘‘కొంతమంది కావాలనే సినిమా పరిశ్రమలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారు. తెలుగువాళ్లంటే మిగతా పరిశ్రమల్లో కూడా గౌరవం ఉంది. అసోసియేషన్ కోసం ఎంత చేసినా మా మీద బురద జల్లుతున్నారు. అందుకే ఈసారి జరగనున్న ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకున్నాను. కానీ, ఆరు నెలల క్రితం ప్రకాశ్‌రాజ్ నన్ను కలిసి.. తన ప్రణాళిక గురించి వివరించారు. ఆయన అడగటం వల్లే నేను ఈ సారి బరిలోకి దిగాను. గత ఎన్నికల్లో నేను ఓడిపోలేదు, ఓడించారు. ఓడిపోయినచోటే కసితో పని చేద్దామని నిర్ణయించుకున్నా. ‘మా’కు శాశ్వత భవనం ఉండాలనేది అందరి కల. అది కేవలం ప్రకాశ్రాజ్తోనే నెరవేరుతుంది’’ అని శ్రీకాంత్ పేర్కొన్నారు.