Prithviraj Sukumaran: తెరపైకి ‘బిస్కెట్‌ కింగ్‌’ జీవితం.. ప్రధాన పాత్రలో ‘అయ్యప్పనుమ్‌’ పృథ్వీరాజ్‌

‘బిస్కెట్‌ కింగ్‌’గా పేరుగాంచిన రాజన్‌ పిళ్లై జీవితాధారంగా బాలీవుడ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ రూపొందుతోంది. ఈ సిరీస్‌లో మలయాళీ దర్శకనటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

Published : 02 Dec 2021 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బిస్కెట్‌ కింగ్‌’గా పేరుగాంచిన రాజన్‌ పిళ్లై జీవితాధారంగా బాలీవుడ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ రూపొందుతోంది. ఈ సిరీస్‌లో మలయాళీ దర్శకనటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడిగా బాలీవుడ్‌లో ఆయన చేస్తున్న తొలి ప్రాజెక్టు ఇదే. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయన ‘లూసీఫర్‌’ (మలయాళం) చిత్రంతో దర్శకుడిగా మారారు. మోహన్‌లాల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్‌ అవుతుంది. ‘గాడ్‌ ఫాదర్‌’ పేరుతో మోహన్‌రాజా రూపొందిస్తున్నారు. పృథ్వీరాజ్‌ నటించిన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ సినిమా మలయాళంలో ఘన విజయం అందుకుంది. ఇదే సినిమా పవన్‌ కల్యాణ్‌, రానా హీరోలుగా ‘భీమ్లా నాయక్‌’ పేరుతో తెలుగు ప్రేక్షకుల్ని త్వరలోనే అలరించనుంది.

రాజన్‌ పిళ్లై ఓ వ్యాపారవేత్త. బ్రిటానియా ఇండస్ట్రీల్లో వాటాదారు. 1970లో సింగపూర్‌ కేంద్రంగా తన వ్యాపారాన్ని కొనసాగించారు. బిస్కెట్‌ కింగ్‌గా మారారు. 1993లో సింగపూర్‌ వాణిజ్య వ్యవహారాల శాఖ ఆయనపై విచారణ చేపట్టింది. సింగపూర్‌ ప్రభుత్వ సమాచారం మేరకు భారత పోలీసులు 1995 జులై 4న న్యూ దిల్లీలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ఆయన్ను అరెస్ట్‌ చేసి తీహార్‌ జైలుకి తరలించారు. అనారోగ్యంతో కస్టడీలోనే ఆయన మరణించడం అప్పట్లో సంచలనమైంది. కె. గోవిందన్‌ కుట్టితో కలిసి రాజన్‌ సోదరుడు రామ్మోహన్‌ పిళ్లై ‘ఏ వేస్టెడ్‌ డెత్‌: ది రైజ్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ రాజన్‌ పిళ్లై’ పేరుతో ఓ పుస్తకం రాశారు. 2001లో విడుదలైంది. దీని ఆధారంగా సిరీస్‌ను నిర్మిస్తున్నారు. 

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని