
Bigg boss telugu 5: ప్రియాంక ఎలిమినేట్.. 90 రోజులు హౌస్‌లో ఉండటానికి కారణాలివే!
ఇంటర్నెట్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్-5 (Bigg boss telugu 5) నుంచి పింకీ అలియాస్ ప్రియాంక (Priyanka) సింగ్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో అతి తక్కువ ఓట్లు ప్రియాంకకు పడటంతో ఆమె బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. సెప్టెంబరు 5న మొదలైన సీజన్-5లో 9వ కంటెస్టెంట్‌గా ప్రియాంక హౌస్‌లోకి అడుగు పెట్టిన ఆమె.. మొత్తం 91 రోజులు ఉండటం గమనార్హం. ‘జబర్దస్త్’ వంటి కామెడీ షోల ద్వారా ప్రియాంక మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అదే సమయంలో బిగ్‌బాస్ అవకాశం రావడంతో మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశారు. దీంతో తమన్నా సింహాద్రి తర్వాత తెలుగు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన రెండో ట్రాన్స్‌జెండర్‌గా పింకీ నిలిచారు. ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా హౌస్‌లోకి వచ్చిన ఆమె దాదాపు 90 రోజుల పాటు హౌస్‌లో ఉండటం మామూలు విషయం కాదు.
హౌస్‌మేట్స్‌తో ప్రియాంక ఏం మాట్లాడిందంటే!
ఎలిమినేట్ అయి, బయటకు వచ్చిన ప్రియాంకకు నాగార్జున హౌస్‌లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్‌ల ఫొటోలను ఇచ్చారు. మొదటి రోజు చూసినప్పుడు వాళ్లపై ఉన్న అభిప్రాయం, ఇప్పుడు ఏమనుకుంటున్నావో చెప్పమన్నారు.
సిరి: సిరి ఇంటిలోకి వచ్చిన మొదటి కంటెస్టెంట్. ఆ రోజు గోల్డెన్ కలర్ డ్రెస్‌లో ఉంది. మొదటిసారి చూడగానే, నాకంటే అందంగా ఉందేంటి? అనిపించింది. ఆ తర్వాత వైజాగ్ అని తెలిసిన తర్వాత ఇద్దరం బాగా కలిసిపోయాం. ఇప్పుడు సిరిని చూస్తే ఆమెలో మా చెల్లి కనిపిస్తుంది. చాలా బలమైన కంటెస్టెంట్. ఆమె ఈ హౌస్‌లో ఉండటం చాలా అవసరం.
శ్రీరామ్: మీ సాంగ్స్ చాలా ఇష్టమని చెప్పా. మొదటిసారి మా మధ్య ఎలాంటి అనుబంధం ఉందో, ఇప్పటికీ అలాంటి చక్కని స్నేహబంధమే ఉంది. శ్రీరామ్‌ను శ్రీకృష్ణుడు చేద్దామనుకున్నా. కానీ ఆయన శ్రీరాముడిలానే ఉన్నారు.
షణ్ముఖ్: పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. మొదట తమ్ముడు అని పిలుద్దామనుకున్నా. కానీ, ముదిరిపోయిన బెండకాయ అని తెలిసిన తర్వాత ‘అన్నయ్య’ పిలిచా.
సన్నీ: నేను హౌస్‌లోకి వచ్చిన తర్వాత ‘స్వప్నలోక సుందరి’ అన్నాడు. రెండు రోజులు తర్వాత ‘అన్నయ్యా’ అనేసరికి చక్కగా కలిసిపోయాడు. ఎవరికీ చెప్పుకోలేని విషయాలను కూడా సన్నీ అన్నయ్యతో పంచుకున్నా. చివరి వరకూ నాతో బాగా ఉన్నాడు.
కాజల్: మొదట కాజల్‌ను చూడగానే ఇంతలా అల్లరి చేస్తోందేంటి? అనుకున్నా. ‘కాజల్ ఇక మీదట కూడా ఆ అల్లరి కొనసాగించు. బయటకు వెళ్లిన తర్వాత నేను చూస్తూ ఉంటా’
మానస్: మానస్ చూడగానే ఎవరీ సిల్కీ హెయిర్ అబ్బాయి అనుకున్నా. మొదట పలకరించగానే మానస్ ఏమీ మాట్లాడలేదు. ఎంత పొగరు అనుకున్నా. ఆ తర్వాత మా మధ్య నెమ్మదిగా స్నేహం ఏర్పడింది. ‘నువ్వు బాగా ఆడాలి. నీ నుంచి నేను అదే ఆశిస్తున్నా. విన్నర్‌గా చూడాలనుకుంటున్నా’
పింకీ 90 రోజులు హౌస్‌లో కొనసాగడానికి కారణాలివే!
తన కథతో అందరి మనసులు గెలుచుకుని..
బిగ్‌బాస్ సీజన్-3లో తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్‌గా తమన్నా సింహాద్రిని తీసుకొచ్చారు. అయితే, ఆమె ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండలేకపోయారు. ఈ సీజన్‌లో ప్రియాంక రావడంతో మరోసారి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇంటి సభ్యులతో ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. తమన్నాకు పూర్తి భిన్నంగా మొదటి నుంచి అందరితోనూ కలిసిపోయింది ప్రియాంక. ఇక తన లైఫ్ జర్నీ పంచుకుని హౌస్‌మేట్స్‌తోనే కాకుండా ప్రేక్షకులతోనూ కంటతడి పెట్టించింది. దీంతో బిగ్‌బాస్ చూసే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైంది.
కుకింగ్‌కు దగ్గరగా.. గేమ్‌కు దూరంగా..
ప్రియాంకకు వంట చేయడమంటే ఇష్టమని చెబుతూ మొదటి నుంచి కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్కువగా ఉండేది. హౌస్‌మేట్స్‌కు అవసరమైన అన్ని రకాల వంటలనూ చేసి పెట్టేది. దీంతో ఎవరికీ ఆమెపై కోపం ఉండేది కాదు. ఇతర ఇంటి సభ్యులు ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు చెప్పుకొంటూ.. వాటిపై గొడవపడుతూ ఉండేవారు. ప్రియాంక వాటికి దూరంగా ఉండేది. అదే సమయంలో మానస్‌కు దగ్గరగా ఉండేది. అతడికి అవసరమైన సేవలన్నింటినీ చేసేది. ఒకానొక సమయంలో గేమ్ ఆడకుండా కేవలం మానస్‌కు సేవ చేసేందుకు వచ్చిందా? అని ప్రేక్షకులు భావించారు. ఇక తనని ఎవరైనా నామినేట్ చేస్తే, తిరిగి వారిని నామినేట్ చేయటం, వారిపైన అరవడం చేసేది. వరెస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చినా తట్టుకోలేకపోయేది. ‘ఎప్పుడు చూసినా కిచెన్‌లోనే ఉంటున్నావు. నీ గేమ్ కనపడటం లేదు’ అంటూ షణ్ముఖ్‌తో సహా ఒకరిరిద్దరు ఆమెను నామినేట్ చేయగా, ‘నేను వంట చేసి పెడితే తిని, నన్ను గేమ్ ఆడటం లేదని ఎలా అంటారు. అదొక కారణమా? ఇక వంట చేయను’ అంటూ కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చేది. దీంతో అనీ మాస్టర్, ప్రియలాంటి వాళ్లు అది నిజమేకదా! అని భావించారు. ఆ సమయంలో సహనాన్ని కోల్పోయేది. ఇక ఏ చిన్న టాస్క్ జరిగినా ఎక్కువ మందిని కార్నర్ చేసేది కాదు. కేవలం లోబోలాంటి ఒకరిద్దరినే ప్రతిసారీ నామినేట్, వరెస్ట్ పెర్ఫార్మర్ ఇవ్వడం లాంటివి చేసేది. దీని ద్వారా ఎక్కువ మందితో శత్రుత్వం పెంచుకోకూడదనేది ఆమె గేమ్ ప్లాన్ కూడా కావచ్చు. ఒకరకంగా ప్రియాంక తనదైన సేఫ్ గేమ్ ఆడినట్లే. అయితే ఇన్ని రోజుల జర్నీలో ప్రియాంక ఒక్క టాస్క్‌లోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. అయితే, సూపర్ విలన్స్, సూపర్ హీరోస్ టాస్క్‌లో మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. ప్రత్యర్థి సభ్యులు పరీక్షలు పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గింది. కానీ, కెప్టెన్ కాలేకపోయింది.
వాళ్లు చేసిన తప్పులు ప్రియాంకకు కలిసొచ్చాయి!
మొదటి నుంచి అందరితోనూ కలిసి మెలిసి ఉన్నా, నాలుగైదు వారాలకు మించి ప్రియాంక హౌస్‌లో ఉండదని అందరూ భావించారు. ఎందుకంటే ఆమెతో పోలిస్తే హౌస్‌లో ఉన్న చాలా మందికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. పైగా వాళ్లందరూ, ప్రేక్షకులకు బాగా తెలిసిన వాళ్లు. ఈ క్రమంలోనే తాను ఎలిమినేట్ అయిపోతానేమోనని భయపడింది. కానీ, అందుకు భిన్నంగా దాదాపు 90 రోజులు హౌస్‌లో ఉంది. మొత్తం ఏడుసార్లు నామినేషన్స్‌లో ఉండగా, ఆ సమయంలో ఉమాదేవి, శ్వేత, లహరి, విశ్వ, అనీ మాస్టర్, రవిని దాటుకుని పింకీ సేవ్ అయింది. ఎలిమినేట్ అయిన వాళ్లందరూ ఇతర హౌస్‌మేట్స్‌తో గిల్లికజ్జాల పెట్టుకోవడంతో వీళ్లను ఓడించడానికి ప్రేక్షకులు ప్రియాంకకు ఓట్లు ఎక్కువ వేశారు. అలా ప్రియాంక నామినేషన్ నుంచి బయట పడింది. అనీ మాస్టర్ ఎలిమినేట్ అయిన సమయంలోనూ తాను సేవ్ అవుతానని ఆమె చాలా నమ్మకంతో ఉన్నారు. కానీ, ఆ సమయంలో మానస్ నామినేషన్‌లో లేకపోవడంతో ఆ ఓట్లన్నీ ప్రియాంకకు పడ్డాయి. అలా ఎలాంటి ఫ్యాన్ బేస్ లేకుండా హౌస్‌లోకి అడుగుపెట్టిన ప్రియాంక.. అందరితో కలుపుకొంటూ వెళ్లి, ఇన్ని రోజులు హౌస్‌లో నిలదొక్కుకోవటం గమనార్హం.
► Read latest Cinema News and Telugu News
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.