C Kalyan: ‘గాడ్సే’ నిర్మించినందుకు గర్వపడుతున్నా

సినిమా టిక్కెట్‌ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయంతో చిత్ర    పరిశ్రమలో ఎవ్వరూ సంతోషంగా లేరన్నారు ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌. ఆ సమస్య    పరిష్కారం కోసం పరిశ్రమ తరఫున మేమంతా కలిసి మరోసారి ప్రభుత్వానికి

Updated : 09 Dec 2021 17:52 IST

సినిమా టిక్కెట్‌ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయంతో చిత్ర    పరిశ్రమలో ఎవ్వరూ సంతోషంగా లేరన్నారు ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌. ఆ సమస్య    పరిష్కారం కోసం పరిశ్రమ తరఫున మేమంతా కలిసి మరోసారి ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. సత్యదేవ్‌ కథానాయకుడిగా ‘గాడ్సే’ సినిమాని   నిర్మిస్తున్న సి.కల్యాణ్‌ పుట్టినరోజు   గురువారం. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ‘గాడ్సే’ సినిమాని ఓ పీరియాడిక్‌ డ్రామాతో రూపొందించామని, జనవరి 26న విడుదలకి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ‘‘ప్రభుత్వాల్ని ప్రశ్నించే అంశాలతో సాగే చిత్రమిది. అందరి సమస్యలూ ఈ కథలో ప్రతిబింబిస్తాయి. గాడ్సే పాత్ర వింతగా ఉంటుంది. అమ్మానాన్నలు కష్టపడి చదివిస్తే, ఏదో చేద్దామని కలలు కన్న యువత ఏమీ చేయలేని పరిస్థితులతో ఎలా సతమతమవుతుందో ఇందులో చక్కగా ఆవిష్కరించారు దర్శకుడు. దీన్ని నిర్మించినందుకు గర్వపడుతున్నా. సత్యదేవ్‌కి చాలా మంచి పేరు వస్తుంది. ఈ చిత్రం తర్వాత దర్శకుడు గోపీగణేష్‌తో మరో భారీ ప్రాజెక్ట్‌ని తీస్తా. సత్యదేవ్‌తోనూ ఓ సినిమా ఉంటుంది’’ అన్నారు సి.కల్యాణ్‌. ఆయన చిత్ర పరిశ్రమ సమస్యలపై మాట్లాడుతూ ‘‘టిక్కెట్‌ ధరల్ని తగ్గించి ప్రజలకి మేలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుకోవచ్చు. మరీ ఇంతగా తగ్గించడం భావ్యం కాదు. నా వస్తువుని నేను తయారు చేసుకుని, నేనే ధరని నిర్ణయించుకుంటా. ఆ వస్తువుని కొనాలా? వద్దా? సినిమాని చూడాలా వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టం’’ అన్నారు.


బాలకృష్ణతో రామానుజా చార్యులు

బాలకృష్ణతో ఆయన కలల ప్రాజెక్ట్‌ని నిర్మించాలని ఉందని చెప్పారు సి.కల్యాణ్‌.  ‘‘రామానుజ చార్యులు పాత్రలో బాలకృష్ణని చూడాలనేది చాలా మంది కోరిక. ఆయనకీ ఆ సినిమా చేయాలని ఉంది. ‘రూలర్‌’ తర్వాత మా కలయికలో మరో సినిమా రావాలి. వరుసగా మూడు ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు బాలకృష్ణ. ఆయన ఎప్పుడంటే అప్పుడు మా సంస్థలో సినిమా ఉంటుంద’’ని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని