Updated : 18 Jul 2021 16:50 IST

Narappa: అందుకే ‘అసురన్‌’ను రీమేక్‌ చేశాం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెంకటేశ్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్‌హిట్‌ ‘అసురన్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. సురేశ్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను నిర్మించారు. జులై 20 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత సురేశ్‌ బాబు మీడియాతో ముచ్చటించారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రాన్ని ఓటీటీలో ఎందుకు విడుదల చేస్తున్నారు? ‘అసురన్‌’నే ఎందుకు రీమేక్‌ చేశారు? తదితర విషయాలు పంచుకున్నారు. 

ఈ సినిమాని థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయడానికి కారణం?

సురేశ్‌ బాబు: దీనికి చాలా కారణాలున్నాయి. నేనూ తమిళ నిర్మాత కలైపులి ఎస్‌.థాను కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇటీవల ఆయన ‘కర్ణన్’ అనే సినిమా విడుదల చేశారు. 100 శాతం ఆక్యుపెన్సీతో మొదటి వారం, 75 శాతం ఆక్యుపెన్సీతో రెండో వారం మాత్రమే థియేటర్లలో ఆ సినిమా ప్రదర్శితమైంది. కరోనా ఉద్ధృతి ఎక్కువకావడంతో థియేటర్లు మూత బడ్డాయి. దాంతో ఆయనకు సుమారు రూ.15 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ సినిమా విషయంలోనూ అదే ఎదురవుతుందేమోననే భయం మొదలైంది. ఎన్నో రకాలుగా ఆలోచించి ఈ ఓటీటీ విడుదలకి నిర్ణయించుకున్నాం. అయితే కొవిడ్‌ రాని వాళ్లు ఒకలా భావిస్తున్నారు. వచ్చిన వాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులు మరోలా ఆలోచిస్తుంటారు. మనం మన కుటుంబ సభ్యుల్ని థియేటర్లకి పంపించనప్పుడు ‘మా సినిమాకి రండి’ అంటూ ఇతర కుటుంబాల్ని ఎలా అడుగుతాం.

దీని వల్ల వెంకటేశ్‌ అభిమానులు ఫీలవుతున్నారు కదా!

సురేశ్‌ బాబు: అవును నిజమే. అభిమానులే కాదు వెంకటేశ్‌, దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల నేనూ బాధపడుతున్నాను. కానీ, జీవితంలో ప్రాక్టికల్‌గా ఉండాల్సిందే.

మీరూ సినిమాల్ని పంపిణీ చేస్తుంటారు. సరిగ్గా థియేటర్లు తెరచుకునే సమయంలో సురేశ్‌ బాబు ఇలా చేయడం సరికాదంటూ ఎగ్జిబిటర్లు అంటున్నారు. దాని గురించి..

సురేశ్‌ బాబు: ముందుగా చెప్పినట్టు ఇది నేనొక్కడినే నిర్మించిన సినిమా కాదు. మా సొంత బ్యానర్‌ సురేశ్‌ ప్రొడక్షన్‌లో రూపొందిన, పార్టనర్‌ షిప్‌లో అధిక భాగం నాదే అయినా చిత్రమైతే ఓటీటీ విడుదలకు ఒప్పుకోను. పార్టనర్‌ విషయంలో రాజీ పడాలి. లేదంటే ‘మీరు థియేటర్లలో విడుదల చేసి డిస్ట్రిబ్యూషన్‌ కమీషన్‌ సంపాదించుకుంటారా’ అనే మాటలు వినిపిస్తుంటాయి.

స్టార్‌ హీరోల చిత్రాలూ ఓటీటీ వస్తుంటే థియేటర్లు కనుమరుగయ్యే అవకాశం ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి?

సురేశ్‌ బాబు: థియేటర్ల వ్యవస్థలో కొద్దిగా మార్పు వస్తుందేమో కానీ, కనుమరుగయ్యే అవకాశం ఉండదు. ప్రపంచంలోనే పెద్ద నిర్మాణ సంస్థగా పేర్కొన్న డిస్నీనే థియేటర్లతో పాటు తమ చిత్రాల్ని ఓటీటీలోనూ విడుదల చేస్తుంది. ఎందుకంటే పరిస్థితుల్ని బట్టి ప్రేక్షకుల అభిరుచి మారిందని తెలుసుకుందా సంస్థ. కొవిడ్‌ రాకపోయి ఉంటే ఓటీటీ ఇంత పాపులర్‌ అయ్యేది కాదు. చాలా సమయం పట్టేది.

మన దగ్గరా ఇలాంటి పరిస్థితి వస్తుందంటారా?

సురేశ్‌ బాబు: ప్రస్తుతానికి ఉండదు. థియేటర్ల యాజమాన్యాలు ఒప్పుకోవు. కొంత వ్యవధి తర్వాత ఓటీటీలోకి విడుదల చేసేందుకే ఇక్కడ అనుమతి ఉంది.

‘అసురన్‌’ చిత్రాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?

సురేశ్‌ బాబు: ఏ నటుడికైనా కొత్త తరహా పాత్రలు పోషించాలని ఉంటుంది. వెంకటేశ్‌ అలాంటి పాత్రల కోసమే చూస్తుంటాడు. ఓసారి ‘అసురన్‌’ చిత్రం చూసి, బాగుంది నువ్వు కూడా చూడు అని నాతో అన్నాడు. నేను ఆ సినిమా చూసిన వెంటనే చేసేద్దాం అని చెప్పా. వెంకటేశ్‌ హీరోగా తెలుగు దర్శక-రచయితలెవరూ ఇలాంటి కథని రాసి తీసుకురారు. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి పాత్రలు అంగీకరిస్తారో లేదోననే సందేహం ఉంటుంది. వెట్రిమారన్‌ (అసురన్‌ దర్శకుడు) వాస్తవికతని చూపిస్తూనే కమర్షియల్‌ హంగులు అద్దిన విధానం చాలా బాగా నచ్చింది. వెంకటేశ్‌కి తగిన సినిమా అనిపించింది. మాస్‌ సినిమాలా ఉన్నా కుటుంబ నేపథ్యంలో సాగుతుంది. సందేశమూ ఉంది.

షూటింగ్‌ సమయంలో ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?

సురేశ్‌ బాబు: సహజంగా తెరకెక్కించేందుకు ఎన్నో లొకేషన్లు వెతికాం. రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని రోజులు చిత్రీకరించాం. కానీ, షూటింగ్‌కి చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారని చెన్నై చేరుకున్నాం. ఓ షెడ్యూల్‌కి సంబంధించి ఇంకా నాలుగు రోజుల షూట్‌ ఉందనగా అక్కడ దగ్గర్లో కొవిడ్‌ కేసులు ఎక్కువవడంతో హైదరాబాద్‌ తిరిగి వచ్చాం. 

కుటుంబ కథల చిత్ర దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్‌ అడ్డాల చేతిలో ఈ చిత్రాన్ని పెట్టడానికి కారణం?

సురేశ్‌ బాబు: కొన్ని కొన్ని అలా జరిగిపోతుంటాయి. ఈ సినిమా రీమేక్‌ హక్కులు సొంతం చేసుకున్న సమయంలో ఓ సారి శ్రీకాంత్‌ అడ్డాల కలిసి ఓ కథ వినిపించారు. అంతగా నచ్చలేదని చెప్పా. ఆ వెంటనే ‘సర్‌.. మీరు అసురన్‌ రీమేక్‌ చేస్తున్నారట కదా’ అని అడిగారాయన. అవును అనగానే ‘మీరు ఇంకా దర్శకుడ్ని ఖరారు చేయకపోతే.. నాకు ఆసక్తి ఉంది నేను చేస్తా ’అన్నారు. సరే అన్నాను. అలా అసురన్‌ పట్టాలెక్కింది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని