PUSHPA: మేకప్‌ వేసి తీయడానికి మూడు గంటల సమయం పట్టేది: అల్లు అర్జున్‌

అల్లుఅర్జున్‌-రష్మిక జంటగా నటించిన ‘పుష్ప’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నటీనటులిద్దరూ ఓ స్పెషల్‌ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. సుమ వ్యాఖ్యాతగా జరిగిన ఈ చిట్‌చాట్‌లో పలు...

Published : 16 Dec 2021 01:24 IST

హైదరాబాద్‌: అల్లుఅర్జున్‌-రష్మిక జంటగా నటించిన ‘పుష్ప’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నటీనటులిద్దరూ ఓ స్పెషల్‌ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. బన్నీ మాటల వల్ల తాను ఇంటికెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నానని రష్మిక అన్నారు. అలాగే, ‘పుష్ప’ నాలుగు సినిమాల కష్టమని.. సుమారు 500 మంది రోజూ ఈ సినిమా కోసం పనిచేశారని బన్నీ తెలిపారు.

సుమ: ఈసినిమాలో మేకప్‌ కోసమే మీరు ఎక్కువ సమయం కేటాయించినట్లు తెలిసింది. నిజమేనా?

అల్లు అర్జున్‌: అవును. ఇందులో ఫుల్‌ రఫ్‌ లుక్‌లో కనిపిస్తాను. అందుకోసం రోజూ సుమారు రెండు గంటలపాటు మేకప్ కోసమే కేటాయించాల్సి వచ్చేది. తెల్లవారుజామున 4.30 నిద్రలేచి.. ఐదుకల్లా సెట్‌కెళ్లి.. 5 నుంచి 7 వరకూ మేకప్‌ కోసమే ఓపిగ్గా కూర్చొవాలి. షూట్‌ పూర్తయ్యాక మేకప్ తీయడానికి మరో 20 నుంచి 40 నిమిషాలు.

రష్మిక: శ్రీవల్లిగా సిద్ధం కావడానికే రెండున్నర గంటలు పట్టేది. మొదట్లో ఆ మేకప్‌ తీయడానికి కూడా నాకు అంతే సమయం పట్టేది. అయితే ఓసారి బన్నీని కలిసి ‘‘మేకప్‌ త్వరగా ఎలా తీసేస్తున్నారు?’’ అని  అడగ్గా.. ఆయిల్‌ వాడమని సలహా ఇచ్చారు. ఆయన సలహా పాటించడం వల్ల 30 నిమిషాల్లోనే మేకప్‌ రీమూవ్‌ చేసుకునేదాన్ని.

అల్లు అర్జున్‌:  పాత్రలు చక్కగా సిద్ధం చేయడానికి మేకప్‌ బాయ్స్‌ అందరూ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమాలో నటీనటులు కేవలం ముఖానికి మాత్రమే కాకుండా చాలా షాట్స్‌లో శరీరానికి కూడా మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది.

రష్మిక: శ్రీవల్లి పాత్ర కోసం రెండు మూడు లుక్‌ టెస్ట్‌లు అయ్యాక.. ప్రస్తుతం మీరు చూస్తున్న దాన్ని డైరెక్టర్‌ సుకుమార్‌ ఫైనల్‌గా ఓకే చేశారు.

సుమ: షూట్‌ సమయంలోనూ మీరు ఫుల్‌ వర్కౌట్లు చేశారట?

అల్లు అర్జున్‌: సాధారణంగా వారంలో ఐదురోజులు వర్కౌట్లు చేసేలా చూసుకుంటా. ‘పుష్ప’ షూట్‌లోనూ అదే కొనసాగించా. సాయంత్రం ఐదింటికి షూట్‌ అవ్వగానే 7 నుంచి 8 గంటల వరకూ వర్కౌట్‌ చేసేవాడిని. ఒకవేళ షూటింగ్స్‌ వల్ల బడలికగా ఉంటే మిగిలిన రెండు రోజులు వర్కౌట్ల నుంచి కొద్దిగా విశ్రాంతి తీసుకుంటా. కానీ రష్మిక అలా కాదు. ఆమె ఫుల్‌ ఫిట్‌నెస్‌ ప్రియురాలు.

రష్మిక: ‘పుష్ప’ షూట్‌ జరిగినన్ని రోజులు బన్నీ నా జిమ్‌ మేట్‌. ఆయన్ని చూసి స్ఫూర్తి పొంది నేను కూడా వర్కౌట్లు చేసేదాన్ని.

సుమ: మీ డీవోపీ గురించి?

అల్లు అర్జున్‌: మా డీవోపీని కూబా అని పిలుస్తాం. ఆయన పోలాండ్‌కు చెందిన సినిమాటోగ్రాఫర్‌. ఆ దేశంలో సినిమాటోగ్రఫీకి ఫేమస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది సినిమాటోగ్రాఫర్లు ఆ దేశం నుంచి వచ్చినవాళ్లే. ఆ దేశంలోనే సినిమాటోగ్రఫీ కల్చర్‌ ఉంది. అదే విధంగా కర్ణాటక నుంచి ఎంతో మంది హీరోయిన్స్‌ వచ్చారు. ఐశ్వర్యరాయ్‌, శిల్పాశెట్టి, ఇప్పుడు రష్మిక ఇలా చెప్పుకొంటూ వెళితే అక్కడి నుంచి వచ్చిన వారి లిస్ట్‌ పెద్దదే.

సుమ: గూగుల్‌లో కనిపించని రూట్స్‌ని కూడా మీరు కనిపెట్టారట?

అల్లు అర్జున్‌: మారుమూల గ్రామాలకు వెళ్లి సినిమా చేశామంటే ఆ క్రెడిట్‌ సుకుమార్‌, మైత్రీ వాళ్లకే ఇవ్వాలి. అటవీ ప్రాంతంలో షూట్‌.. కొన్నిసార్లు మనమే రోడ్లు వేసుకోవాలి. రాత్రికి రాత్రి మట్టి తెప్పించి.. రోడ్డు వేసి లారీలు, కార్లు వేసుకుని సెట్‌కి వెళ్లేవాళ్లం. కొన్నిసార్లు వర్షాలు పడి, వాహనాలు ఆగిపోయి సెట్‌కి వెళ్లడానికీ ఇబ్బందులు పడ్డాం. చేసేది లేక బౌన్సర్ల బైక్‌పై సెట్‌కి వెళ్లేవాడిని. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చెప్పినట్లు ‘పుష్ప’ నాలుగు సినిమాల కష్టం. ఈ సినిమా కోసం రోజుకి దాదాపు 500 నుంచి 600 మంది పనిచేసేవాళ్లు. 300 వాహనాలు సెట్‌లో ఉండేవి.

సుమ: ‘పుష్ప-ది రైజ్‌’ వస్తోంది. మరి, ‘పుష్ప’ పార్ట్‌-2 ఏ పేరుతో పరిచయం చేయనున్నారు?

అల్లు అర్జున్‌: ‘పుష్ప’ పార్ట్‌-2కి ఎలాంటి టైటిల్‌ పెట్టాలో జనాలకే వదిలేద్దాం. మంచి హ్యాష్‌ట్యాగ్‌లు క్రియేట్‌ చేసి సోషల్‌మీడియాలో షేర్‌ చేయండి.

సుమ: సుకుమార్ వర్కింగ్‌ స్టైల్‌ గురించి రష్మిక ఏమైనా చెప్పగలరు?

రష్మిక: సుకుమార్‌ ఒక లెక్కల టీచర్‌. ఆయన క్లాస్‌లో నేను లాస్ట్‌ బెంచ్‌ స్టూడెంట్‌ని. ఫస్ట్‌ బెంచ్‌ స్టూడెంట్‌ మన బన్నీ. (మధ్యలో సుమ అందుకొని రష్మిక ఎదిగిపోయింది. మాటలు బాగా మాట్లాడుతుంది అనగానే వెంటనే బన్నీ అందుకొని మీరు ఎదగలేదా? అంటూ నవ్వులు పూయించారు)

అల్లు అర్జున్‌: రష్మిక చాలా ఓపెన్‌గా ఉండే అమ్మాయి. మనసులో ఏం అనుకుంటే అది పైకి చెప్పేస్తుంది.

సుమ: రష్మిక ఇప్పుడు కొంచెం తక్కువగా మాట్లాడుతుంది. గతంలో ఆమెను ఎప్పుడు కలిసినా మాటలకు ఫుల్‌స్టాప్‌ అనేది ఉండేది కాదు(నవ్వులు)

రష్మిక: ఇప్పుడిప్పుడే వయసు పెరుగుతోంది కదా. అందుకే మాటలు తగ్గిస్తున్నా.

సుమ: సుకుమార్‌ మంచి డైరెక్టర్‌, అల్లు అర్జున్‌ మంచి డ్యాన్సర్‌.. వీళ్లిద్దరితో పనిచేయడం ఎలా ఉంది రష్మిక?

అల్లు అర్జున్‌: నాకు డ్యాన్స్‌ మాత్రమే వచ్చా. ఇంకేమీ లేదా?(నవ్వులు)

రష్మిక: మేజికల్‌ ఫిల్మ్‌. సెట్‌లోకి అడుగుపెట్టిన మొదట్లో నేను చేయగలనా లేదా?అని బాగా భయపడ్డా. ఓసారి బన్నీ సర్‌.. ‘నువ్వు చేయలేకపోతే నువ్వు ఈ స్టేజ్‌పై ఉండవు. నిన్ను మేము ఈ సినిమాకి సెలక్ట్‌ చేసుకోం’ అని చెప్పారు. ఆయన మాటలతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.

అల్లు అర్జున్‌: నిజం చెబుతున్నా.. ఈ సినిమాలో రష్మిక అదరగొట్టేసింది. వేరే అమ్మాయి అయితే రష్మిక అంత బాగా చేయలేదేమో అని నా ఫీలింగ్‌. సాధారణంగా హీరోయిన్స్‌ డీగ్లామర్‌ రోల్‌ చేయడానికి కాస్త బెరుకుగా ఉంటారు. కానీ, రష్మిక అలా కాదు.. ఎలాంటి కంగారు లేకుండా అద్భుతంగా నటించింది. ఇది తనకి ఛాలెంజింగ్ రోల్‌.

రష్మిక: బన్నీ.. ఇటీవల ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లోనూ నాపై ప్రశంసలు కురిపించారు. ఆయన మాటలతో ఇంటికెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నా. ఇప్పుడు మళ్లీ కన్నీళ్లు వస్తున్నాయి కానీ కెమెరా ముందు ఏడవను.

సుమ: దేవిశ్రీ ప్రసాద్‌తో వర్క్‌..?

అల్లు అర్జున్‌: నటీనటులు ఎవరు ఉన్నా సుకుమార్‌-దేవిశ్రీ కాంబినేషన్‌ అదిరిపోతుంది. లక్కీగా నాకు-దేవికి కూడా మంచి కాంబినేషన్ ఉంది‌. నా సినిమాకు దేవి వర్క్‌ చేస్తే తప్పకుండా రెండు బ్లాక్‌బస్టర్‌ సాంగ్స్‌ ఇస్తాడు. కానీ, ఇందులో అన్నీ చక్కగా కుదిరాయి. పాటలు అంతగా హిట్‌ అయ్యాయంటే క్రెడిట్‌ దేవితోపాటు చంద్రబోస్‌ గారికి కూడా ఇవ్వాలి. లిరిక్స్ చాలా అద్భుతంగా రాశారు.

సుమ: సినిమాలో మీరు ఎక్కువగా భుజం పైకి పెట్టే కనిపిస్తారు కదా?

అల్లు అర్జున్‌: సినిమా మొత్తం అలాగే కనిపిస్తాను. అలా చేయడం వల్ల భుజం పట్టేసేది. రోజూ ఉదయాన్నే ఫిజియోథెరపిస్ట్‌ ఇచ్చిన సలహాలు ఫాలో అయ్యేవాడిని.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని