Rajamouli: ఆ సినిమాలో చిరు అలా చేయలేకపోయారు.. అందుకే చరణ్‌తో చేయించా!

సాధారణ సన్నివేశాన్ని సైతం తన టేకింగ్‌తో భావోద్వేగంగా మలిచి ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేయడంలో సిద్ధహస్తులు దర్శక ధీరుడు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి.

Updated : 16 Nov 2021 10:22 IST

హైదరాబాద్‌: సాధారణ సన్నివేశాన్ని సైతం తన టేకింగ్‌తో భావోద్వేగంగా మలిచి ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేయడంలో సిద్ధహస్తులు దర్శక ధీరుడు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. అందుకే ఆయన తీసే సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాదు, బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. ఇక ఎమోషనల్‌ సన్నివేశాలు, హీరో ఎలివేషన్‌ సీన్స్‌ తీయడంలో ఆయనను కొట్టిన వారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’ రామ్‌చరణ్‌ కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకుంది. అందులోని ఓ సన్నివేశం భావోద్వేగభరితంగా రావడానికి చిరంజీవి నటించిన ‘కొదమ సింహం’ చిత్రమే కారణమని రాజమౌళి ఇటీవల చెప్పుకొచ్చారు.

‘‘నేను చిరంజీవిగారికి పెద్ద అభిమానిని. అప్పట్లో థియేటర్‌లో ‘కొదమసింహం’ సినిమా చూస్తున్నా. అందులో రౌడీలు చిరును పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి వెళ్లిపోతారు. అక్కడే ఉన్న ఆయన గుర్రం ఆయన నోటికి తాడు అందించి కాపాడుతుంది. ఆ సీన్‌ చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యా. అయితే, ఆ కష్టంలో నుంచి బయటకు వచ్చిన ఆయనకు, గుర్రానికీ అనుబంధం లేదనిపించింది. చాలా నిరుత్సాహ పడిపోయా. నా దృష్టిలో అక్కడ అది గుర్రం కాదు. ప్రాణాలు కాపాడిన ఒక వ్యక్తి. మనకు సాయం చేసిన ఒక వ్యక్తికి థ్యాంక్స్‌ చెప్పకపోతే ఆ భావోద్వేగం ఎలా సంపూర్ణమవుతుంది? అనిపించింది. అది నా మైండ్‌లో అలాగే ఉండిపోయింది. ఒక ప్రేక్షకుడిగా అప్పుడు నా ఎమోషన్ తృప్తి చెందలేదు. అందుకే ‘మగధీర’లో ఇసుక ఊబిలో కూరుపోయిన చరణ్‌ బయటకు వచ్చిన తర్వాత తన గుర్రాన్ని కౌగలించుకుంటాడు. ఒక స్నేహితుడిలా చూస్తూ దానితో కృతజ్ఞత భావంతో మాట్లాడతాడు. అలా నా సినిమాల్లో బలమైన సన్నివేశాలు ప్రేక్షకుల ఆలోచనల నుంచి స్ఫూర్తి పొంది రాసినవే ఉంటాయి’’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘ఆర్ఆర్ఆర్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్నారు. అలియా భట్‌, అజయ్‌దేవ్‌గణ్‌, ఓలివియా మోరిస్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని