
Puneeth Rajkumar: పునీత్ మరణించే వరకూ ఆ విషయం ఎవరికీ తెలీదు: రాజమౌళి
బెంగళూరు: పునీత్ రాజ్‌కుమార్ మరణం తనని ఎంతగానో కలచివేసిందని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. తాజాగా బెంగళూరుకు చేరుకున్న ఆయన పునీత్ ఇంటికి వెళ్లారు. పునీత్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పునీత్ మరణాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు.
‘‘నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నాలుగేళ్ల క్రితం బెంగళూరుకు వచ్చినప్పుడు పునీత్‌ని కలిశాను. నన్ను ఒక కుటుంబసభ్యుడిలా చూసుకున్నారు. ఎంతో సరదాగా మాట్లాడారు. ఒక స్టార్‌తో మాట్లాడుతున్నాననే భావనే నాకు కలగలేదు. అలాంటిది పునీత్ మరణ వార్త విని ఎంతో షాక్ అయ్యాను. ఆయన మన మధ్య లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన ఎంతోమందికి సాయం చేశారని మరణం తర్వాతే అందరికీ తెలిసింది. సాధారణంగా మనం ఓ చిన్న సాయం చేసినా ప్రపంచానికి తెలియాలనుకుంటాం. కానీ పునీత్ అలా కాదు. తను ఎంతో మందికి సాయం చేసినా ఎవరికీ చెప్పలేదు’’ అని రాజమౌళి అన్నారు.