Rajamouli: ఆరోజు అజిత్ చేసిన పనిని నేను ఎప్పటికీ మర్చిపోను: రాజమౌళి

కోలీవుడ్‌ స్టార్‌హీరో అజిత్‌ తనతో ప్రవర్తించిన తీరుని ఎప్పటికీ మర్చిపోలేనని దర్శకుడు రాజమౌళి అన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ తమిళ ఛానెల్‌కు ఆయన, చరణ్‌, తారక్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ....

Published : 01 Jan 2022 01:21 IST

హైదరాబాద్‌: కోలీవుడ్‌ స్టార్‌హీరో అజిత్‌ ఎంతో సాధారణంగా ఉంటారని.. ఆయన తనను పలకరించిన విధానాన్ని తాను ఎప్పుడూ మర్చిపోలేనని దర్శకుడు రాజమౌళి అన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ తమిళ ఛానల్‌కు ఆయన, చరణ్‌, తారక్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా కోలీవుడ్‌ స్టార్‌హీరోలతో తమకున్న అనుబంధంపై స్పందించారు. కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పటికీ అజిత్‌ సాదాసీదాగా ఉంటాడని.. డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌ అని రాజమౌళి ప్రశంసించారు. అనంతరం అజిత్‌ని కలిసిన ఓ రోజుని ఆయన గుర్తు చేసుకున్నారు.

‘‘సితార హోటల్‌లో ఓసారి అజిత్‌ని చూశా. హోటల్‌లోని రెస్టారెంట్‌లో ఆయన భోజనం చేస్తూ కనిపించారు. ఆయన వద్దకు వెళ్లకుండా వేరే టేబుల్‌లో కూర్చొని నా సతీమణి రమా కోసం ఎదురుచూస్తున్నా. అదే సమయంలో నన్ను చూసిన అజిత్‌ నా వద్దకు వచ్చి.. ‘‘సర్‌. ఎలా ఉన్నారు?’’ అని పలకరించారు. నన్ను కూడా ఆయన టేబుల్‌ వద్దకు తీసుకువెళ్లారు. మేమిద్దరం మాట్లాడుకుంటున్న సమయంలో రమా రెస్టారెంట్‌లోకి వచ్చి నాకోసం చూస్తోంది. దాంతో నేను పిలుస్తుండగా.. అజిత్‌ ఆమె వద్దకు వెళ్లి తనని తాను పరిచయం చేసుకుని టేబుల్‌ దగ్గరకు తీసుకువచ్చారు. మాతో ఎంతో సరదాగా మాట్లాడారు. కోట్లాది మంది అభిమానులు కలిగిన ఆయన సాధారణ వ్యక్తిలా తనని తాను పరిచయం చేసుకుని మాతో మాట్లాడటం ఆశ్చర్యపరిచింది. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఇటీవల కాలంలో తనని తలా అని పిలవొద్దు అని కేవలం ఏకే, లేదా అజిత్‌కుమార్‌ అని మాత్రమే పిలవమని చెప్పడం నాకెంతో నచ్చింది’’ అని రాజమౌళి తెలిపారు.

అనంతరం విజయ్‌ గురించి తారక్‌ స్పందించారు. విజయ్‌ తనకెంతో నచ్చిన వ్యక్తి అని తెలిపారు.‘‘విజయ్‌ సూపర్‌స్టార్‌. నాకొక గురువు, బ్రదర్‌, ఫ్రెండ్‌. అప్పుడప్పుడూ మేమిద్దరం ఫోన్‌లో మాట్లాడుకుంటాం. ఇటీవల ‘మాస్టర్‌’ విడుదలైనప్పుడు ఆయనతో నేను ఫోన్‌లో మాట్లాడాను. స్టార్‌డమ్‌ ఉన్నప్పటికీ ఆయనలో ఆ గర్వం కనిపించదు. సాధారణమైన వ్యక్తిలాగే ఉంటారు. ముఖ్యంగా ఆయన డ్యాన్స్‌ అంటే నాకెంతో ఇష్టం’’ అని తారక్‌ చెప్పారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఆలియాభట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు. సుమారు రూ. 400 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా 2022 జనవరి 7న విడుదల కానుంది.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని