MAA Elections: మా ఇంట్లో బయటవాళ్లకెలా అధికారమిస్తా: రాజీవ్‌ కనకాల

మరో నాలుగు రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో తాను మంచు విష్ణు ప్యానల్‌కే సపోర్ట్‌ చేస్తానని నటుడు రాజీవ్‌ కనకాల అన్నారు....

Updated : 16 Sep 2022 14:30 IST

విష్ణు ప్యానల్‌కే నా సపోర్ట్‌ 

హైదరాబాద్‌: మరో నాలుగు రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో తాను మంచు విష్ణు ప్యానల్‌కే సపోర్ట్‌ చేస్తానని నటుడు రాజీవ్‌ కనకాల అన్నారు. ఇటీవల ‘లవ్‌స్టోరీ’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆయన తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాల గురించి వివరించారు. ముఖ్యంగా ‘మా’ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

‘గతేడాది జరిగిన ‘మా’ ఎన్నికల్లో నేను శివాజీ రాజా ప్యానెల్‌ నుంచి పోటీ చేసి కోశాధికారి పదవి పొందాను. ఆ ప్యానెల్‌ నుంచి నేను ఒక్కడినే గెలిచాను. నరేశ్‌ టీమ్‌తో కలిసి సభ్యుల సంక్షేమం కోసం ఎంతో పనిచేశా. అవకాశాల్లేని ఎంతోమంది ఆర్టిస్టుల కోసం కష్టపడ్డాం. 40 మందికి అవకాశాలు వచ్చేలా చేశాం. కానీ, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేవాళ్లు మాత్రం మా గురించి ఎన్నో కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో నేను విష్ణు ప్యానెల్‌కే సపోర్ట్‌ చేస్తున్నాను. ఎందుకంటే, ‘మా’ బిల్డింగ్‌ నిర్మాణం, సభ్యుల సంక్షేమంపై ఆయన పూర్తి స్పష్టతతో ఉన్నారు. ఆయనే తప్పకుండా గెలుస్తారని ఆశిస్తున్నారు. అలాగే, మంచు విష్ణుకు బాలకృష్ణ సపోర్ట్‌ చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మహేశ్‌, ప్రభాస్‌ ఎన్టీఆర్‌.. ఇలా ఇతర నటీనటులు కూడా ఆయనకే మద్దతు ఇవ్వవచ్చు. మరో విషయం ఏమిటంటే.. మా ఇంటికి ఎవరైనా బంధువు వస్తే అతనికి సకల మర్యాదలు చేస్తాను. అన్ని రకాలుగా అతిథ్యం కల్పిస్తాను. కానీ, మా ఇంటి సమస్యల్లో అతను పెద్దరికం తీసుకుంటే.. నేను ఎందుకు ఒప్పుకుంటాను?’ అని రాజీవ్‌ కనకాల వ్యాఖ్యానించారు.

నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్‌ గుడ్‌ మూవీ ‘లవ్‌స్టోరీ’. కుల వ్యవస్థ, అమ్మాయిలపై కుటుంబసభ్యులే ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారనే సున్నితమైన విషయాన్ని శేఖర్‌ కమ్ముల ఈ సినిమాలో చూపించారు. శ్రీవేంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమైంది. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీ, దేవయాని, ఉత్తేజ్‌ కీలకపాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని