
ETV: ఈటీవీలో రంగుల రాట్నం
ఈరోజు నుంచి ప్రతి రాత్రి 7:30గం.లకు
మల్లెమాల ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ ధారావాహిక 2011 జనవరి 31న ప్రారంభమైంది. అనతికాలంలోనే తెలుగు వారికి అభిమాన సీరియల్‌గా మారి, కొన్ని సంవత్సరాల పాటు తెలుగు సీరియల్స్‌లో అగ్ర స్థానంలో నిలిచింది. అనేక అవార్డులు సాధించింది.
ఇంతటి ప్రాచుర్యం పొందిన ఈ ధారావాహిక బుధవారంతో ముగియనుంది. సుదీర్ఘ కాలం మహిళా లోకాన్ని విశేషంగా ఆకర్షించిన ఈ సీరియల్‌కు ‘శుభం’ కార్డు పడనుంది. అదే సమయంలో.. మరో విశేషం ఏమిటంటే..
మనసు- మమత
దశాబ్ద కాలం నుంచీ తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన పేరిది. ఈటీవీలో సోమవారం నుంచి శనివారం వరకు, ప్రతిరోజూ రాత్రి 7:30గం.లకు ప్రసారమయ్యే ఈ ధారావాహిక ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈరోజు నుంచే ఈటీవీలో.. ప్రతి రాత్రి 7:30గం.లకు..
మల్లెమాల ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణంలోనే.. ‘మనసు మమత’ దర్శకుడు అనిల్ కుమార్ దర్శకత్వంలోనే ‘రంగులరాట్నం’ అనే సరికొత్త ధారావాహిక ప్రారంభమవుతుంది. ఎంతో విజయవంతమైన ఈ కాంబినేషన్లో మరో కొత్త ధారావాహిక వస్తోందనగానే సాధారణంగానే ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. అనుబంధాలకీ.. ఆర్థిక బంధాలకీ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో రూపొందించిన ‘రంగులరాట్నం’ సీరియల్లో జాకీ, చంద్రశేఖర్, రాజశ్రీ, రాజేష్, గౌతమి తదితరులు నటించారు. స్క్రీన్‌ప్లే ఫణికుమార్ సమకూర్చగా.. కథ, దర్శకత్వం బాధ్యతలు అనిల్ కుమార్ నిర్వహించారు.
3304
ఈరోజుకి ‘మనసు - మమత’ పూర్తి చేసుకున్న ఎపిసోడ్ల సంఖ్య ఇది.
* ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఈనాటి కాలంలో, మారిన పరిస్థితుల్లో.. మనుషుల మధ్య ప్రేమాభిమానాల కన్నా, డబ్బు-హోదాలే ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఓ యువతి ధైర్యంగా ఎలా ఎదుర్కొంది? ఆస్తుల కన్నా ఆప్తులే మిన్న అని ఎలా నిరూపించింది? అహంకారాన్ని, ఆత్మాభిమానంతో ఎలా జయించింది? అన్నదే ఈ ‘రంగులరాట్నం’’ అని వివరించారు. అడుగడుగునా భావోద్వేగాలతో, మనసును కట్టిపడేసే కథాకథనాలతో ‘రంగులరాట్నం’ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు.
* మల్లెమాల ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సీరియల్‌ని నిర్మిస్తున్న దీప్తిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మనసు మమత’ ధారావాహిక దాదాపు 12ఏళ్ల పాటు విజయవంతంగా ప్రసారమైందంటే.. దానికి ఈటీవీ యాజమాన్యం అందించిన సహకారం, ప్రేక్షకుల ఆదరాభిమానాలే కారణం. ఇంత సుదీర్ఘ కాలం ప్రేక్షకులతో కలిసి ప్రయాణం చేయడం వల్ల.. వాళ్ల అభిరుచులేంటి? ఎలాంటి కథల్ని ఇష్టపడతారన్నది మేము తెలుసుకోగలిగాం. ఇప్పుడిందుకు తగ్గట్లుగానే ట్రెండ్‌కు అనుగుణమైన ఓ సరికొత్త కథాంశంతో.. అన్ని వర్గాల మహిళలు మెచ్చేలా ‘రంగులరాట్నం’ ధారావాహికను తీసుకొస్తున్నాం. నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువుల నుంచి రకరకాల సమస్యలు ఎదుర్కొంటుంటాం కదా. అలాంటి అనేక అంశాలు, సంఘర్షణలే ‘రంగులరాట్నం’లో కనిపిస్తాయి. సీరియల్ చూసిన ప్రతి ఒక్కరూ ‘ఇవన్నీ మన జీవితాల్లో జరిగినవే కదా’ అని కచ్చితంగా అనుభూతి చెందుతారు. ప్రస్తుత సమాజంలో మహిళలకు ఆత్మాభిమానం.. ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమన్నది దీంట్లో చూపించాం. ఇందులో ఉన్న ప్రతి పాత్ర చాలా బలంగా ఉంటుంది. ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోతుంది’’ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.