
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్నే ఎక్కువగా చూశారట..!
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సినిమా మార్కెట్ తీవ్రంగా నష్టపోయింది. చాలా ప్రాంతాల్లో ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లేందుకు ఇంకా పూర్తిస్థాయిలో ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో పలు సినిమాలు కేవలం థియేటర్‌లోనే కాకుండా ఓటీటీలోనూ విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలా థియేటర్, ఓటీటీ వేదికగా విడుదలైన ఓ భారీ యాక్షన్ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. సదరు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఎక్కువసేపు వీక్షించిన చిత్రంగా రికార్డు అందుకుంది. విడుదలైన నెలరోజులలోపే ఈ రికార్డు దక్కడంతో చిత్రబృందం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇంతకీ ఆ చిత్రం పేరు ‘రెడ్ నోటీస్’.
డ్వైన్ జాన్సన్, ర్యాన్ రేనాల్డ్స్ ప్రధాన పాత్రల్లో రాసన్ మార్షల్ థర్బర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రెడ్ నోటీస్’. ప్రపంచం వెతుకుతోన్న ఓ క్రిమినల్‌ని పట్టుకునేందుకు ఇంటర్‌పోల్ ఆఫీసర్ ఎలా శ్రమించాడు? ఎలాంటి పన్నాగాలు పన్ని.. చివరికి అతన్ని బంధించాడు? అనే ఆసక్తికరమైన అంశాలకు యాక్షన్ హంగులు జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 5న ఈసినిమా థియేటర్‌లో విడుదల కాగా, అదే నెలలో 12న నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకాదరణ మెండుగా పొందింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ పోస్ట్ పెట్టింది. ‘‘2018లో విడుదలైన ‘బర్డ్‌బాక్స్’ 282 మిలియన్ గంటల వీక్షణలతో నెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్ వ్యూవుడ్ సినిమాగా రికార్డు సొంతం చేసుకుంది. సుమారు మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొడుతూ ‘రెడ్ నోటీస్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. 328 మిలియన్ గంటలపాటు వీక్షణలు సొంతం చేసుకుంది’’ అని టీమ్ పేర్కొంది.