SaiDharam Tej Republic Review: రివ్యూ: రిపబ్లిక్‌

సాయిధరమ్‌ తేజ్‌ నటించిన రిపబ్లిక్‌ సినిమా ఎలా ఉందంటే..

Updated : 01 Oct 2021 13:29 IST

చిత్రం: రిపబ్లిక్‌; న‌టీన‌టులు: సాయిధరమ్‌ తేజ్, ఐశ్వర్యా రాజేశ్‌, జ‌గ‌ప‌తిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామ‌కృష్ణ, పోసాని కృష్ణముర‌ళి; ఛాయాగ్రహ‌ణం: ఎం.సుకుమార్‌; సంగీతం:  మ‌ణిశ‌ర్మ; కూర్పు: కె.ఎల్‌.ప్రవీణ్; స్క్రీన్‌ప్లే: దేవా క‌ట్టా‌, కిర‌ణ్ జ‌య్‌కుమార్‌; నిర్మాత‌లు: జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు; క‌థ‌, మాట‌లు, ద‌ర్శక‌త్వం: దేవా క‌ట్టా; సంస్థలు: జీస్టూడియోస్‌, జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్; విడుద‌ల‌: 1 అక్టోబ‌ర్ 2021

సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతుండ‌గా.. ఆయ‌న న‌టించిన సినిమా ‘రిప‌బ్లిక్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ప్రస్థానం’తో త‌న‌దైన ముద్రవేసిన దేవాక‌ట్టా ద‌ర్శకుడు కావ‌డం.. సాయితేజ్ యువ ఐఏఎస్ అధికారిగా న‌టించ‌డంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక‌మైన ఆస‌క్తి ఏర్పడింది. ప్రచార చిత్రాలు సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల్ని పెంచాయి. మరీ చిత్రం అందుకు త‌గ్గట్టుగా ఉందా..? తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం..

క‌థేంటంటే: చిన్నప్పట్నుంచే తెలివైన విద్యార్థి పంజా అభిరామ్ (సాయిధ‌ర‌మ్ తేజ్‌). పెద్దయ్యాక  వ్యవ‌స్థని ప్రశ్నించ‌డం మొద‌లుపెడ‌తాడు. విదేశాల‌కి వెళ్లాల‌ని కుటుంబసభ్యులు ఒత్తిడి చేసినా.. కాద‌ని మ‌రీ ఐఏఎస్ కావ‌డం కోసం స‌న్నద్ధమ‌వుతాడు. ఇదే క్రమంలో త‌న చుట్టుప‌క్కల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు అత‌డిని క‌ల‌చివేస్తాయి. అనుకున్నట్టుగానే అభిరామ్ ఐఏఎస్ అవుతాడు. కొన్ని ప్రత్యేక అధికారాల‌తో ఏలూరు క‌లెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. వెంట‌నే తెల్లేరు స‌ర‌స్సు స‌మ‌స్యపై దృష్టిపెడ‌తాడు. కొన్నేళ్లుగా తెల్లేరుపై పెత్తనం చలాయిస్తూ అక్రమాల‌కు పాల్పడుతున్న రాజ‌కీయ నాయ‌కురాలు విశాఖ‌వాణి (ర‌మ్యకృష్ణ)తో అభిరామ్‌కి పోరాటం మొద‌ల‌వుతుంది. న్యాయ‌వ్యవ‌స్థని, అధికార వ్యవ‌స్థని కూడా త‌న గుప్పెట్లో పెట్టుకుని రాజ‌కీయం చేస్తున్న విశాఖ‌వాణి వ‌ల్ల ఎన్నారై మైరా (ఐశ్వర్యారాజేశ్‌)కి జ‌రిగిన అన్యాయం ఏమిటి? తెల్లేరు విష‌యంలో జ‌రిగిన పోరాటంలో గెలుపెవ‌రిది? వ్యవ‌స్థ మార‌డం కోసం అభిరామ్ చేసిన పోరాటం ఎలా సాగింది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ప్రజాప్రతినిధుల‌తో కూడిన శాస‌న వ్యవ‌స్థ‌, బ్యూరోక్రాట్లతో కూడిన అధికార వ్యవ‌స్థ‌, న్యాయ వ్యవ‌స్థ.. ఈ మూడూ గుర్రాలైతే.. ప్రస్తుత ప‌రిస్థితుల్లో వాటి గ‌మ‌నం ఎలా సాగుతోందో, అవి ఎలా ప్రయాణం చేస్తే వ్యవ‌స్థ బాగుంటుందో సూటిగా చెప్పే ప్రయ‌త్నం చేశారు ద‌ర్శకుడు దేవా క‌ట్టా. అప‌రిమిత‌మైన అధికారాలు కొంత‌మంది వ‌ద్దే ఉంటే అది స‌మాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇందులో ఆలోచ‌న రేకెత్తించేలా చెప్పారు. పొలిటిక‌ల్ డ్రామాతో కూడిన ఓ నిజాయ‌తీ ప్రయ‌త్నం ఇది. ఆలోచ‌న‌లు రేకెత్తించే సంభాష‌ణ‌లు చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌. ఓ యువ ఐఏఎస్ అధికారి పాత్రతో  కుళ్లిపోయిన మ‌న వ్యవ‌స్థని ఎండ‌గ‌ట్టే ప్రయ‌త్నం చేశారు. ఓటు రిగ్ అయ్యిందంటూ సాధార‌ణ  యువ‌కుడిగా క‌థానాయ‌కుడు పోలింగ్ బూత్ ద‌గ్గర ప్రశ్నించ‌డం ద‌గ్గర్నుంచి క‌థ మొద‌ల‌వుతుంది.  ఆరంభ స‌న్నివేశాలు కాస్త నిదానంగా సాగిన‌ట్టు అనిపించినా, క‌థానాయ‌కుడు ఐఏఎస్ అధికారి కావ‌డం నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. తెల్లేరు కుళ్లు వెన‌క సంగ‌తి, మైరా సోద‌రుడి హ‌త్య కేసు, తెల్లేరు విష‌యంలో రైతుల ప‌క్షాన ఉంటూ అభిరామ్ పోరాటం చేసే తీరు ఆక‌ట్టుకుంటుంది. ద్వితీయార్ధం నుంచే అస‌లు డ్రామా మొద‌ల‌వుతుంది. వ్యవ‌స్థల‌న్నింటినీ త‌న చెప్పు చేతల్లో పెట్టుకున్న విశాఖ‌వాణికీ, అభిరామ్‌కీ మ‌ధ్య డ్రామా ఆక‌ట్టుకుంటుంది. న్యాయ వ్యవ‌స్థని కూడా ప్రభావితం చేసే ప్రయ‌త్నంలో ఉన్నప్పుడు అభిరామ్ వినిపించిన గ‌ళం, ఆ త‌ర్వాత జ‌రిగే ప‌రిణామం ప‌తాక స‌న్నివేశాల్లో హైలైట్‌. ఎన్‌కౌంట‌ర్ల విష‌యాన్ని కూడా ఈ క‌థ‌లో ప‌లుమార్లు ప్రస్తావించారు. ద‌ర్శకుడు నిజాయ‌తీగా క‌థ‌ని చెప్పే ప్రయ‌త్నం చేశారు కానీ.. డ్రామా, క‌థ‌నం స‌గ‌టు సినీ ప్రేక్షకుడికి త‌గినంత అనుభూతిని పంచవు. తెలుగు తెర‌పై ద‌ర్శకుడు చేసిన ఓ కొత్త ప్రయ‌త్నంగా మాత్రం ఈ చిత్రం గుర్తింపు పొందుతుంది.

ఎవ‌రెలా చేశారంటే: సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ క‌థ‌ని న‌మ్మి భుజానికెత్తుకోవ‌డం అభినందించ‌గ‌ద‌గ్గ విష‌యం. ఆయ‌న యువ ఐఏఎస్ అధికారిగా చ‌క్కగా ఒదిగిపోయారు. ప‌రిణ‌తితో కూడిన న‌ట‌న‌ని ప్రద‌ర్శించాడు. జ‌గ‌ప‌తిబాబు పాత్ర ఆక‌ట్టుకుంటుంది. ఐశ్వర్య రాజేశ్ ఓ ఎన్నారై యువ‌తిగా క‌నిపిస్తుంది. ర‌మ్యకృష్ణది బ‌ల‌మైన పాత్రే కానీ.. ఆ పాత్రని స‌రైన కోణంలో ఆవిష్కరించ‌లేక‌పోయారు ద‌ర్శకుడు. శ్రీకాంత్ అయ్యర్‌‌, రాహుల్ రామ‌కృష్ణ‌, సుబ్బరాజు త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. మ‌ణిశ‌ర్మ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. సుకుమార్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. ద‌ర్శకుడు సంభాష‌ణ‌లు, క‌థ, మేకింగ్ ప‌రంగా మెప్పించాడు. క‌థ‌నం విష‌యంలో చేసిన క‌స‌ర‌త్తులే స‌రిపోలేదనిపిస్తుంది.

బ‌లాలు

+ క‌థ‌

+ సాయిధ‌ర‌మ్ తేజ్ న‌ట‌న‌

+ సంభాష‌ణ‌లు

+ ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

- నిదానంగా సాగే స‌న్నివేశాలు

- క‌థ‌నం

చివ‌రిగా: వ్యవ‌స్థల‌పై ఎక్కుపెట్టిన ‘రిప‌బ్లిక్‌’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని