RGV: రామ్‌గోపాల్‌ వర్మ X పేర్నినాని.. ట్విటర్‌వార్‌

ఆంధ్రప్రదేశ్‌ సినిమా టికెట్‌ ధరల తగ్గింపు వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మధ్య ట్వీట్‌ వార్‌ జరుగుతోంది. సినిమా టికెట్‌ ధరల విషయంలో గడిచిన రెండు...

Published : 06 Jan 2022 01:30 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరల (Movie Ticket rates) తగ్గింపు వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma), ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని (Perni Nani) మధ్య ట్విటర్‌ వార్‌ జరుగుతోంది. సినిమా టికెట్‌ ధరల విషయంలో ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ.. రెండ్రోజుల నుంచి వర్మ వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో వర్మ అడిగిన ప్రశ్నలకు బుధవారం ఉదయం మంత్రి నాని సమాధానమిచ్చారు. ‘రూ.100 టికెట్‌ను రూ.1000, రూ.2000కు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్‌ మెకానిజం అంటారు? డిమాండ్‌, సప్లయ్‌ అంటారా? లేక బ్లాక్‌ మార్కెటింగ్‌ అంటారా?’ అంటూ నాని ప్రశ్నల వర్షం కురిపించారు.

కాగా, తాజాగా మంత్రి వ్యాఖ్యలపై రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. ‘‘రాజకీయ నాయకుడిగా కాకుండా గౌరవప్రదంగా సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు నానీ గారూ. రూ.100 టికెట్‌ని వెయ్యికి అమ్ముకోవచ్చా అనేది అసలు ప్రశ్నే కాదండి. ఎందుకంటే అది అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరంపై ఆధారపడి ఉంటుంది. ముడి పదార్థం రూ.500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్‌ని కొనేవాడుంటే రూ.5 కోట్లకి అమ్ముతారు. ముడి పదార్థానికే విలువ ఇస్తే దాని బ్రాండ్‌కి ఎలా వెల కడతారు? క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ అనేది ఉన్నదానికంటే బెటర్‌గా ఉండేలా ప్రయత్నించాలి. ఇక అది బెటరా? కాదా? అనేది కొనుగోలుదారుడే నిర్ణయిస్తాడు. కొనేవాడికి, అమ్మేవాడికి మధ్య లావాదేవీలు ఎంత జరిగాయనే పారదర్శకత మాత్రమే ప్రభుత్వానికి అవసరం. ఎందుకంటే వాళ్లకు పన్ను రావాలి. బ్లాక్‌ మార్కెటింగ్‌ అనేది ప్రభుత్వానికి తెలియకుండా చేసే క్రైమ్‌. ఓపెన్‌గా ఎంతకి అమ్ముతున్నారో చెప్పి అమ్మితే అది తప్పేలా అవుతుంది?’’ అని ఆర్జీవీ ప్రశ్నించారు.

సామాన్యుడి అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి ఉండకూడదనే ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుందని నానీ చెప్పిన సమాధానంపై ఆర్జీవీ స్పందిస్తూ.. ‘‘క్షమించండి నాని గారూ.. దీన్ని లూటీ అనరు. ఎందుకంటే.. అమ్మేవాడు, కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునే దాన్ని లావాదేవీలు అంటారు. అవి చట్టపరంగా జరిగినప్పుడు ప్రభుత్వ వాటా పన్ను రూపంలో వస్తుంది. థియేటర్లనేవి ప్రజాకోణంలో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగంలో గానీ సినిమాటోగ్రఫీ యాక్ట్‌లో గానీ ఈ డెఫినిషన్ ఉందా? మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికే ఆ డెఫినిషన్ను మీకు మీరు ఇచ్చుకుంటున్నారు’’ అని అన్నారు.

‘‘జూన్ 19, 1905న మొట్టమొదటి థియేటర్ అమెరికాలో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన సంస్థలు. అంతేకానీ, ప్రజాసేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు. కావాలంటే మీ ప్రభుత్వంలో ఉన్న థియేటర్ యజమానుల్ని అడగండి’’

‘‘ధరలు తగ్గిస్తున్నది పేదవాడికి అందుబాటులో ఉండాలని, సినిమాని నిత్యావసర వస్తువుగా పరిగణిస్తున్నామని చెప్పింది మీ నాయకులే. అది కానప్పుడు అసలు ఈ చర్చ ఎందుకు? పేదల కోసం చెయ్యడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు. కానీ దానికోసం పేదల్ని ధనికుల్ని చెయ్యటానికి మీ ప్రభుత్వం పని చేయాలి. కానీ.. ఉన్న ధనికుల్ని పేదల్ని చెయ్యకూడదు.. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోకెల్లా పేద రాష్ట్రంగా అయ్యే ప్రమాదముంది’’

‘‘చివరిగా.. నేను సాధారణ ఇంజినీరింగ్ స్టూడెంట్‌ని, ఆర్థికశాస్త్రం గురించి నాకు ఏమీ తెలియదు. కానీ, అనుమతిస్తే మీ ప్రభుత్వంలో టాప్ ఎకనామిక్స్ అనుభవజ్ఞుడితో చర్చకు సిద్ధం. మా సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ సమస్యలను తొలగించడానికి చర్చ అవసరం’’అని రామ్‌గోపాల్‌ వర్మ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని