RGV: కొడాలి నాని ఎవరో నాకు తెలీదు: ఆర్జీవీ

ఆంధ్రప్రదేశ్‌ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఎవరు తనకు తెలియదని.. కేవలం సినిమా హీరో నాని మాత్రమే తనకు తెలుసని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. ఏపీలో సినిమా టికెట్‌ ధరల....

Updated : 05 Jan 2022 16:39 IST

మంత్రి వ్యాఖ్యలపై దర్శకుడు వ్యంగ్యాస్త్రాలు


 

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఎవరు తనకు తెలియదని.. కేవలం సినిమా హీరో నాని మాత్రమే తనకు తెలుసని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. ఏపీలో సినిమా టికెట్‌ ధరలపై రామ్‌గోపాల్‌ వర్మ చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేసిన క్రమంలో వర్మ స్పందించారు. పక్క రాష్ట్రంలో నివాసం ఉంటూ అక్కడ సినిమాలు తీసుకునేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆర్జీవీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల విషయంపై నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్‌కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని సినిమా హీరో నేచురల్‌ స్టార్‌ నాని ఒక్కడే. వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు’’ అని ఆర్జీవీ అన్నారు.

ఇక, ఏపీలో ఉన్న సినిమా టికెట్‌ ధరలపై రాంగోపాల్‌ వర్మ స్పందిస్తూ.. టికెట్‌ ధరలు నియంత్రించడానికి ప్రభుత్వానికి ఏం అధికారం ఉంది? అని మంగళవారం ప్రశ్నించారు. దానిపై కొడాలి నాని స్పందిస్తూ..  ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం మా పార్టీ అధికారంలో ఉంది. ప్రజలే మాకు ఈ అధికారాన్ని అప్పగించారు. పక్క రాష్ట్రంలో కూర్చొని, అక్కడ సినిమాలు తీసుకుంటున్న వ్యక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకే మేము జవాబుదారీతనంగా ఉంటాం. రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమా టికెట్‌ ధరల్లో ప్రభుత్వానికి సంబంధం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు కదా.. మరి, వాళ్లనే అమ్ముకోమని చెప్పండి. చూద్దాం’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే ఆయన వ్యాఖ్యలపై తాజాగా వర్మ స్పందించారు.

మరోవైపు ‘శ్యామ్‌సింగరాయ్‌’ సినిమా రిలీజ్‌ సమయంలో టికెట్‌ ధరలపై హీరో నాని చేసిన వ్యాఖ్యలు అంతటా వైరల్‌ అయ్యాయి. దానిపై స్పందించిన ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌.. ‘‘నాకు కొడాలి నాని ఒక్కరే తెలుసు. ఈ నాని ఎవరో నాకు తెలీదు’’ అన్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ఆర్జీవీ కౌంటర్‌ ఇవ్వడంతో అంతటా చర్చనీయాంశంగా మారింది.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని