Roja: సంపాదించిందంతా అప్పులు తీర్చడానికే.. కన్నీళ్లు పెట్టుకున్న నటి రోజా

‘సమరం’ సినిమా వల్ల తాను ఒకానొక సమయంలో అప్పుల ఊబిలో కూరుకుపోయానని నటి రోజా అన్నారు. అప్పులు తీర్చడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డానంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు....

Published : 12 Sep 2021 01:13 IST

హైదరాబాద్‌: ‘సమరం’ సినిమా వల్ల తాను ఒకానొక సమయంలో అప్పుల ఊబిలో కూరుకుపోయానని నటి రోజా అన్నారు. అప్పులు తీర్చడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డానంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అది ఒక్కటి మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ ఆమె ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని.. ‘ఊరిలో వినాయకుడు’ ఈవెంట్‌లో కన్నీటి పర్యంతమయ్యారు. సుధీర్‌-రష్మి వ్యాఖ్యాతలుగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈటీవీలో ప్రసారమైన కార్యక్రమం ‘ఊరిలో వినాయకుడు’. ఇంద్రజ, రోజా టీమ్‌ లీడర్లుగా వ్యవహరించారు. ఈవెంట్‌లో భాగంగా రోజా రియల్‌ లైఫ్‌ స్టోరీపై యోధ స్పెషల్‌ డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేసింది.

యోధ డ్యాన్స్‌తో ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్న రోజా.. ‘నాకు తెలిసినంతవరకూ చిన్నప్పటి నుంచి డబ్బు, భోజనం విషయంలో మాకు ఎలాంటి ఇబ్బందుల్లేవు. మా నాన్నకు సినిమా అంటే ఎంతో ఇష్టం. నిర్మాతగా మారి ఆయన ఎంతో నష్టపోయారు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ఓ సినిమాతో నన్ను హీరోయిన్‌గా పరిచయం చేశారు. డైలాగ్స్‌, డ్యాన్స్ రాదని అందరూ నన్ను ఏడిపించేవాళ్లు. బాగా బాధపడ్డాను. ఆ సినిమా తర్వాత పరిశ్రమ నుంచి వెళ్లిపోవాలనుకున్నా. కానీ, అందరూ నన్ను కామెంట్లు చేస్తుంటే తట్టుకోలేక నాన్న, అన్నయ్యలతో కలిసి ఫొటోషూట్‌ కోసం చెన్నై వెళ్లా. అక్కడే నాకు సెల్వమణి తెరకెక్కించిన ‘చామంతి’లో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. నా అదృష్టం కొద్ది ఆ తర్వాత మరలా వెనక్కి తిరిగి చూసుకోలేదు’

‘సెల్వమణితో పెళ్లి ఓకే అనుకున్నాక.. మా అన్నయ్య వాళ్లని సెటిల్‌ చేద్దామని ‘సమరం’ సినిమా చేశాను. మా జీవితాలు కూడా ఆ టైటిల్‌లాగే అయిపోయాయి. బాగా అప్పులైపోయాం. 2002 వరకూ కష్టపడిందంతా అప్పులు కడుతూనే ఉన్నాను. ఆ తర్వాత సెల్వతో నా వివాహం జరిగింది. పెళ్లికి ముందే నాకు పిల్లలు పుట్టరు అని చెప్పేశారు. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని బాగా ఏడ్చాను. కానీ, కొంతకాలానికి పాప పుట్టింది. మా అమ్మాయిని దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తాను. అదంటే నాకెంతో ఇష్టం’ అని చెప్పి రోజా కన్నీరు పెట్టుకున్నారు. రోజా స్టోరీ విని స్టేజ్‌పై ఉన్న ప్రతిఒక్కరూ ఎమోషనల్‌ అయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని