RRR: మరోసారి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ వాయిదా

ఎప్పుడెప్పుడా అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మరోసారి వాయిదా పడింది. ఒమిక్రాన్‌, కరోనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడటం, పరిమితులు విధించడంతో సినిమా విడుదలని వాయిదా వేయాలని నిర్ణయించింది చిత్రబృందం

Updated : 02 Jan 2022 07:02 IST

సినీ అభిమానుల్లో నిరాశ

ఎప్పుడెప్పుడా అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మరోసారి వాయిదా పడింది. ఒమిక్రాన్‌, కరోనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడటం, పరిమితులు విధించడంతో సినిమా విడుదలని వాయిదా వేయాలని నిర్ణయించింది చిత్రబృందం. ఆ మేరకు అధికారికంగా సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది. తదుపరి ఎప్పుడు విడుదల చేస్తారనేది ప్రకటించలేదు. ఇదివరకూ కరోనా వల్లే పలు మార్లు వాయిదా పడిందీ చిత్రం. జనవరి 7న విడుదల చేయాలని దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించారు. ఇంకో ఆరు రోజుల్లో  సినిమాని చూస్తామనే ఆశతో ఎదురు చూస్తున్న అభిమానులకి నిరాశే మిగిలింది. కొత్త ఏడాది తొలి రోజే తప్పని పరిస్థితుల్లో సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. ‘బాహుబలి’ సినిమాల తర్వాత అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్‌, అలియాభట్‌ ముఖ్య పాత్రలు పోషించారు. వేసవి సందర్భంగా సినిమాని విడుదల చేస్తారా? పరిస్థితులు అనుకూలిస్తే అంతకుముందే విడుదల చేస్తారా? అనేది చూడాలి. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ వాయిదాతో సంక్రాంతి బరిలోకి కొత్త సినిమాలు దిగుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని