RRR: నెట్టింట చరణ్‌, ఎన్టీఆర్‌ల రికార్డు చూడు.. ‘నాటు నాటు వీర నాటు’ 

‘నా పాట చూడు.. నా పాట చూడు.. నాటు నాటు నాటు వీర నాటు’ అంటూ రామ్‌ చరణ్‌(Ram Charan), ఎన్టీఆర్‌ (Jr NTR) యావత్‌ సినీ అభిమానుల్ని ఉర్రూతలూగించారు.

Updated : 13 Nov 2021 07:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నా పాట చూడు.. నా పాట చూడు.. నాటు నాటు వీర నాటు’ అంటూ రామ్‌ చరణ్‌ (Ram Charan), జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) యావత్‌ సినీ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నారు. సంక్రాంతి పండగ వాతావరణాన్ని రెండు నెలల ముందుగానే తీసుకొచ్చారు. కేవలం లిరికల్‌ వీడియోతోనే రికార్డు సృష్టించారు. ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (RRR). పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2022 జనవరి 7న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నవంబరు 10న ‘ఆర్‌ఆర్‌ఆర్‌ మాస్‌ ఆంథమ్‌’ (RRR Mass Anthem) పేరుతో ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటను విడుదల చేశారు. ఈ హుషారైన గీతం విడుదలైన అనతి కాలంలోనే (సుమారు 48 గంటలు) 20 మిలియన్ల (2 కోట్లు) వీక్షణలు (అన్ని భాషల్లో కలిపి) సొంతం చేసుకుని యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం తెలుగు పాటకే ఇప్పటి వరకు సుమారు కోటికిపైగా వ్యూస్‌ దక్కాయి. చంద్రబోస్‌ రచించిన ఈ గీతానికి కీరవాణి స్వరాలు సమకూర్చారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఆలపించారు. ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ చేశారు.

0.5x లోనూ వేగమే..

సగటు ప్రేక్షకుడి నుంచి సెలబ్రిటీల వరకూ అంతా చరణ్‌, తారక్‌ డ్యాన్స్‌ వేగానికి ఫిదా అయిపోయారు. యూట్యూబ్‌ ఇండియా (Youtube India) సైతం ఈ ఇద్దరి హీరోల డ్యాన్స్‌ వేగం గురించి తన అభిప్రాయం తెలియజేసింది. ‘నిజం చెప్పాలంటే.. చరణ్‌, ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ను 0.5x స్పీడ్‌తో చూసినా ఫాస్ట్‌గానే కనిపిస్తుంది’ అని ట్వీట్‌ చేసింది. దీనిపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్పందించింది. ‘మేం 2x స్పీడ్‌తో ఎడిట్ చేద్దామనుకున్నాం. కానీ.. మా డ్యాన్సింగ్‌ డైనమైట్స్‌ (తారక్‌, చరణ్‌) ఇద్దరూ ఆ అవసరం లేకుండా అదే లైటెనింగ్‌ స్పీడ్‌తో డ్యాన్స్‌ చేసి అందరనీ ఆశ్చర్యపరిచారు’ అని బదులిచ్చింది. వెండితెరపై ఈ జాతరను చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని