Republic: ఓటీటీలోకి సాయిధరమ్‌ తేజ్‌ ‘రిపబ్లిక్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

యువ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ కలెక్టర్‌గా నటించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

Updated : 30 Aug 2022 15:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ కలెక్టర్‌గా నటించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. అక్టోబరు 1న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమం వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో నవంబరు 26 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దేవ కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్‌, జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. 

ఇదీ కథ..

చిన్నప్పట్నుంచే తెలివైన విద్యార్థి పంజా అభిరామ్ (సాయిధ‌ర‌మ్ తేజ్‌). పెద్దయ్యాక వ్యవ‌స్థని ప్రశ్నించ‌డం మొద‌లుపెడ‌తాడు. విదేశాల‌కి వెళ్లాల‌ని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసినా.. కాద‌ని మ‌రీ ఐఏఎస్ అవ్వడానికి స‌న్నద్ధమ‌వుతాడు. ఇదే క్రమంలో త‌న చుట్టుప‌క్కల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు అత‌డిని క‌ల‌చివేస్తాయి. అనుకున్నట్టుగానే అభిరామ్ ఐఏఎస్ అవుతాడు. కొన్ని ప్రత్యేక అధికారాల‌తో ఏలూరు క‌లెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. వెంట‌నే తెల్లేరు స‌ర‌స్సు స‌మ‌స్యపై దృష్టిపెడ‌తాడు. కొన్నేళ్లుగా తెల్లేరుపై పెత్తనం చలాయిస్తూ అక్రమాల‌కు పాల్పడుతున్న రాజ‌కీయ నాయ‌కురాలు విశాఖ‌వాణి (ర‌మ్యకృష్ణ)తో అభిరామ్‌కి పోరాటం మొద‌ల‌వుతుంది. న్యాయ‌వ్యవ‌స్థను, అధికార వ్యవ‌స్థను కూడా త‌న గుప్పెట్లో పెట్టుకుని రాజ‌కీయం చేస్తున్న విశాఖ‌వాణి వ‌ల్ల ఎన్నారై మైరా (ఐశ్వర్యారాజేశ్‌)కి జ‌రిగిన అన్యాయం ఏమిటి? తెల్లేరు విష‌యంలో జ‌రిగిన పోరాటంలో గెలుపెవ‌రిది? వ్యవ‌స్థ మార‌డం కోసం అభిరామ్ చేసిన పోరాటం ఎలా సాగింది? త‌దిత‌ర విష‌యాల్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని