Salmankhan: పాము నన్ను మూడుసార్లు కరిచింది: సల్మాన్‌ఖాన్‌

పాన్వేల్‌ ఫాంహౌస్‌లో తనని పాము కాటు వేయడంపై బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ స్పందించారు. పుట్టినరోజు సంద్భంగా సోమవారం ఉదయం ఆయన మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు....

Updated : 27 Dec 2021 15:10 IST

ముంబయి: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. నిన్న తాను పాము కాటుకు గురైన విషయంపై కూడా స్పందించారు. ‘‘పాన్వేల్‌లోని నా ఫౌంహౌస్‌ చుట్టూ అటవీ ప్రాంతమే. దాంతో ఇక్కడ తరచూ పాములు తిరుగుతుంటాయి. నా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులు, స్నేహితులు శనివారం రాత్రి ఫాంహౌస్‌కు వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున ఓ గదిలో పాము కనిపించింది. దాంతో అక్కడున్న వారందరూ ‘పాము పాము’ అని కేకలు వేశారు. తిరిగి అడవుల్లో వదిలేద్దామని దానిని పట్టుకుని బయటకు తీసుకువస్తుండగా.. అది నా చేతిపై మూడుసార్లు కరిచింది. వెంటనే నా కుటుంబసభ్యులు, వ్యక్తిగత సిబ్బంది నన్ను ఆస్పత్రికి తరలించారు. ఆరుగంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తర్వాత నన్ను డిశ్ఛార్జ్‌ చేశారు. ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ పాము మళ్లీ కనిపించింది. దాంతో ఫొటో కూడా దిగాను. దాన్ని కూడా నా ఫ్రెండ్‌గానే భావిస్తున్నా’’ అని సల్మాన్‌ వివరించారు.

అనంతరం తన తదుపరి చిత్రాలపై సల్మాన్‌ మాట్లాడుతూ.. ‘‘రాజమౌళి గొప్ప దర్శకుడు. ఆయన దర్శకత్వంలో నేను సినిమా చేస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఒకవేళ ఆయనతో సినిమా చేసే ఛాన్స్‌ వస్తే నేనెంతో సంతోషిస్తా. ప్రస్తుతం ‘టైగర్‌-3’, ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’ షూటింగ్స్‌లో ఉన్నా. అవి పూర్తైన వెంటనే ‘భజరంగీ భాయిజాన్‌’ సీక్వెల్‌ పట్టాలెక్కించాలనుకుంటున్నా. ఆ సినిమా టైటిల్‌ ‘పవన్‌పుత్ర భాయిజాన్‌’. దీనికి కూడా రాజమౌళి తండ్రి కె.విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ‘నో ఎంట్రీ’ సీక్వెల్‌ కూడా వచ్చే అవకాశం ఉంది’’ అని వెల్లడించారు.

Read latest Cinema News and Telugu News

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని