
Republic: ‘రిపబ్లిక్’ నుంచి రెండో పాట వచ్చేసింది..!
హైదరాబాద్: సాయిధరమ్ తేజ్ కలెక్టర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘సూడబోదమా.. ఆడబోదమా’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. హుషారెత్తించేలా ఉన్న ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సాకీ శ్రీనివాస్ ఆలపించారు. ఈ పాటకు స్క్రీన్‌పై సాయిధరమ్ తేజ్ ఫుల్ మాస్ స్టెప్పులతో ఆకట్టుకోనున్నారు.
‘సోలో బ్రతుకే సో బెటర్’ తర్వాత సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయికి జోడీగా ఐశ్వర్యా రాజేశ్ సందడి చేయనున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భగవాన్, పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.