Published : 20 Dec 2021 23:13 IST

Shyam Singha Roy: ఆ నమ్మకంతోనే 4 భాషల్లో ‘శ్యామ్‌ సింగరాయ్‌’: రాహుల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాలపై ఉన్న మక్కువతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేశాడు. లఘు చిత్రాలు తీసిన అనుభవంతో ‘ది ఎండ్‌’ని తెరకెక్కించాడు. అనుకున్నంత విజయం అందుకోకపోవడంతో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేయాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ‘ట్యాక్సీవాలా’ అనే కథకి ప్రాణం పోశాడు. దర్శకుడిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇప్పుడు ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో ప్రేక్షకులకి కొత్త అనుభూతి పంచేందుకు సిద్ధమయ్యాడు. ఆయనే రాహుల్‌ సాంకృత్యన్‌. నాని హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రమిది. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. ఈ చిత్రం డిసెంబరు 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా రాహుల్‌ మీడియాతో ముచ్చటించారు.

దర్శకుడిగా మీ కెరీర్‌ ఎప్పుడో ప్రారంభమైనా మూడు చిత్రాలే తెరకెక్కించారు. కారణమేంటి?

రాహుల్‌: సినిమాపై ఉన్న ఆసక్తితో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేసి 2014లో దర్శకుడిగా మారా. నాకున్న పరిజ్ఞానంతో నేను తీసిన తొలి చిత్రం ‘ది ఎండ్‌’. ఆ సినిమాని ఎలా అమ్మాలి? థియేటర్లు, పంపిణీదారు వ్యవస్థ ఎలా ఉంటుందో నాకు ఆ సమయంలో తెలియదు. దాంతో ఆ సినిమా విడుదలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఆ తర్వాత రాసుకున్న కథల్ని పలువురు నిర్మాతలకు వినిపిస్తే.. ‘ఇలాంటి వాటిని ఎవరు చూస్తారు?’ అంటూ హేళన చేశారు. అప్పుడేం చేయాలో నాకు అర్థంకాలేదు. ఒకానొక సందర్భంలో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేద్దామనుకున్నా. ఆ ప్రయత్నంలోనే ‘ట్యాక్సీవాలా’ చిత్ర కథ మదిలో మెదిలింది. కమర్షియల్‌ హంగులతో తెరకెక్కించిన ఆ సినిమా మంచి విజయం అందుకున్నా.. నా తదుపరి ప్రాజెక్టు ఓకే చేసేందుకు ఏ నిర్మాతా ముందుకు రాలేదు. కథలు సిద్ధంగా ఉన్నా పట్టాలెక్కించలేని పరిస్థితి కారణంగా నా కెరీర్‌లో గ్యాప్‌ కనిపించొచ్చు. సత్యదేవ్‌ జంగా వినిపించిన కోల్‌కతా నేపథ్యంలో సాగే పాయింట్ నాకు బాగా నచ్చింది. దానికి మెరుగులుదిద్ది ‘శ్యామ్‌ సింగరాయ్‌’గా మీ ముందుకు తీసుకొస్తున్నా.

ట్రైలర్‌ చూస్తుంటే కొన్ని పాత చిత్రాల్ని గుర్తుచేస్తోంది. అలానే ఉంటుందా?

రాహుల్‌: అవును ఫార్మాట్‌ అదే. కానీ, ఆయా చిత్రాలు ఛాయలు ఎక్కడా కనిపించవు. నేపథ్యం ఒకేలా ఉన్నా ఈ సినిమా కథనం చాలా కొత్తగా ఉంటుంది. కొన్ని అంశాలు మంచి థ్రిల్‌ని పంచుతాయి.

కథానాయకుడి పాత్రకోసం ఇంకా ఎవరినైనా అనుకున్నారా?

రాహుల్‌: పరిమిత బడ్జెట్‌, నటనకు ఎక్కువగా ప్రాధాన్యమున్న పాత్ర ఇది. ఈ కాంబినేషన్‌లో నాకు నాని తప్ప మరో హీరో కనిపించలేదు. ఆయన మాత్రమే న్యాయం చేయగలరనే నమ్మకంతో కథ పూర్తైన వెంటనే ఆయన్ను కలిశాను.

లుక్స్‌ పరంగా నాని చేసిన ప్రయోగాలు తక్కువ, పీరియాడికల్‌ నేపథ్యమూ ఆయనకు కొత్తే కదా!

రాహుల్‌: అదీ ఇదీ అని కాదు. నాని ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలరు. మనకున్న ప్రతిభావంతులైన నటుల్లో ఆయనొకరు. ఆయన నటించిన ‘జెర్సీ’ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. లుక్‌ విషయంలో నాకెంటి భయంలేదు. ఎందుకంటే ఈ పాత్రకు సిక్స్‌ప్యాక్‌ ఇతరత్రా హంగులు అవసరంలేదు.

తెలుగు మినహా ఇతర చిత్ర పరిశ్రమల్లో నానికి మార్కెట్‌ లేదు కదా. అన్ని భాషల్లో విడుదల చేయాలని ఎందుకు అనుకున్నారు?

రాహుల్‌: ‘బిచ్చగాడు’ సినిమా విడుదలప్పుడు విజయ్‌ ఆంటోనీకి ఇక్కడ మార్కెట్‌ లేదు. ఆ కథ తెలుగు వారికీ నచ్చడంతో ఘన విజయం అందుకుంది. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ విషయంలోనూ అంతే. కథ మీద మాకు నమ్మకం ఉంది. నాని, సాయి పల్లవి, మడోన్నా చాలామందికి తెలిసిన నటులే. కొత్తవారు కాదు కాబట్టి ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ ఎలాంటి సమస్య ఉండదనుకున్నాం.

హిందీలో విడుదల చేయకపోవడానికి కారణమేంటి?

రాహుల్‌: బాలీవుడ్‌లో విడుదల చేయాలంటే అక్కడా ప్రచారం చేయాలి. డిస్ట్రిబ్యూటర్లని సంప్రదించాలి. ఇదంతా చేయాలంటే కొంచెం కష్టమైన పని. అందుకే ముందు ‘పాన్‌సౌత్‌’గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనే విడుల చేస్తున్నాం. మరోవైపు, ఈ సినిమా హిందీలో రీమేక్‌ అవుతుందని అనుకుంటున్నాం.

నానితో మీ ప్రయాణం సాగింది?

రాహుల్‌: ‘శ్యామ్‌..’ కంటే ముందే నానికి వేరే కథ వినిపించా. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాజెక్టు గురించి చెప్పాక వెంటనే ఒకే చేశారు. పేపర్‌ మీద రాసుకున్న ఇలాంటి విభిన్న కథని తెరపైకి తీసుకెళ్లాలంటే మూడొంతులు కష్టపడాలన్నారు. మంచి టీమ్‌ ఉండాలని సూచించారు. ఆయన కథని చదివిన రోజు ఎంత నమ్మకంగా ఉన్నారో ఇప్పటికీ అంతే నమ్మకంతో ఉన్నారు. ఆయన సపోర్ట్‌ వల్లే ఇంత పెద్ద ప్రాజెక్టును డీల్‌ చేయగలిగా.

సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌ గురించి ఏమైనా చెబుతారా?

రాహుల్‌: నేను ఇంజనీరింగ్‌ చదివేరోజుల్లో ఆయన పాటలు వింటూ ఆనందించేవాడ్ని. అలాంటిది ఆయన నా సినిమాకు సంగీతం అందించడం మరిచిపోలేని అనుభూతినిచ్చింది. ఈ సినిమాకి ముందుగా ఏఆర్‌ రెహమాన్‌ని అనుకున్నాం. ఆయన బిజీగా ఉండటంతో మిక్కీని ఎంపిక చేశా.

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని