Updated : 24 Dec 2021 09:01 IST

Shyam Singha Roy: వాటిని దాటే సినిమా చేశాం

- నాని

‘‘ప్రతిసారీ సినిమా విడుదల ముందు రోజు చాలా టెన్షన్‌ ఉంటుంది. కానీ, ఈసారి మాత్రం ఓ మంచి సినిమా తీశామనే ఫీలింగ్‌ ఉంద’’న్నారు నాని. ఆయన కథానాయకుడిగా రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. ఈ సినిమా శుక్రవారం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రమిది. అందుకే అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం కోసం చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేశారు. సినిమాలో చాలా కొత్త విషయాలున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి చిత్రమే రాలేదన్న స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. తొలిసారి కథ విన్నప్పుడు నాకలాంటి ఫీలింగే కలిగింది. ఇందులో అన్ని రకాల జానర్లు ఉన్నాయి. ఎమోషనల్‌గా చాలా ప్రభావం చూపిస్తుంది. నేనిందులో వాసు, శ్యామ్‌ సింగరాయ్‌గా రెండు పాత్రల్లో కనిపిస్తా. శ్యామ్‌ ప్రపంచం చాలా కొత్తగా ఉంటుంది. సినిమా హిట్టని అందరూ చెబుతారు. కానీ, నేనదే మాట చాలా నమ్మకంగా చెబుతున్నా. ప్రేక్షకులు ఎన్ని అంచనాలు పెట్టుకుని వచ్చినా సరే.. వాటిని దాటే సినిమా చేశామని గర్వంగా చెబుతున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో మా ప్రయాణం పూర్తయింది. ఇకపై అంతా ప్రేక్షకుల మీదే ఆధారపడి ఉంది. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. మంచి విజువల్‌ వండర్‌లా ఉంటుంది. నాని వల్లే నేను రాసుకున్న కథకు మరింత బలం చేకూరింది. అలాగే తెరపై అద్భుతంగా వచ్చింది. మాకైతే మంచి చిత్రం తీశామన్న నమ్మకం ఉంది. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌. సాయిపల్లవి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో నటిగా నేనింకా ఎదిగాననిపిస్తోంది. నేను, నాని కామ్రేడ్‌ లాంటి వాళ్లం. మా ఇద్దరికీ నటనంటే పిచ్చి. మేమెప్పుడూ దర్శకులను ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంటాం. నమ్మకంగా చెబుతున్నా.. అందరి అంచనాలను అందుకునేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పింది. ‘‘ఈ చిత్రంతో కొత్త అనుభూతిని పంచిస్తామనే నమ్మకం మాకుంది. కథపై నమ్మకంతోనే ఈ సినిమాని నాలుగు భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాం. ఇలాంటి చిత్రం తీసినందుకు నిర్మాతగా నేనెంతో గర్విస్తున్నా’’ అన్నారు నిర్మాత వెంకట్‌.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని