
Acharya: సదా సిద్ధం
ధర్మస్థలిని రక్షించడానికి సదా సిద్ధం అంటున్నారు సిద్ధ. మరి అతని కథేమిటో తెలియాలంటే ‘ఆచార్య’ చూడాల్సిందే. చిరంజీవి, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది. కాజల్, పూజాహెగ్డే నాయికలు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆదివారం సిద్ధ పాత్రకి సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు. విజువల్స్, రామ్‌చరణ్ లుక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ధర్మస్థలికి ఆపదొస్తే... అది జయించడానికి అమ్మోరుతల్లి మాలో ఆవహించి ముందుకు పంపుద్ది’ అంటూ రామ్‌చరణ్ చెప్పిన సంభాషణ, ఆయన చేసిన పోరాట సన్నివేశాలు, చివర్లో చిరుత పులుల తరహాలోనే, ఆ పక్కనే చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి కనిపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. నిర్మాతలు నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘చిరంజీవి, రామ్‌చరణ్ పాత్రల్ని ఎంత గాఢతతో డిజైన్ చేశారో టీజర్‌ని చూస్తే అర్థమవుతుంది. ప్రేక్షకుల నుంచి టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. ప్రసుతతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయ’’న్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.