Chitra: ‘చనిపోయేలోపు వినాల్సిన 1000 పాటలు’ జాబితాలో చిత్ర పాట

ఆమె స్వరం ‘ప్రేమ’ని పంచుతుంది. ప్రశాంతత అందిస్తుంది. ఆమె.. పనిలో ఎంత రౌద్రం చూపిస్తారో ఇతరులతో మాట్లాడేటప్పుడు అంత హాస్యం పండిస్తారు. కరుణ, భయానకం, వీరత్వం, శృంగారం.. ఇలా సన్నివేశం ఏదైనా దానికి ఆమె గళం తోడైతే బీభత్సం, అద్భుతం అనాల్సిందే.

Published : 27 Jul 2021 09:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆమె స్వరం ‘ప్రేమ’ని పంచుతుంది. ప్రశాంతత అందిస్తుంది. ఆమె.. పనిలో ఎంత రౌద్రం చూపిస్తారో ఇతరులతో మాట్లాడేటప్పుడు అంత హాస్యం పండిస్తారు. కరుణ, భయానకం, వీరత్వం, శృంగారం.. ఇలా సన్నివేశం ఏదైనా దానికి ఆమె గళం తోడైతే అద్భుతం అనాల్సిందే. సంగీతానికి భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం అంటూ భారతీయ చలన చిత్ర పరిశ్రమకి తన గాత్రంతో నవరసాల్ని పరిచయం చేశారు గాయని చిత్ర. ‘పాడలేను పల్లవైనా భాషరాని దానను’ (సింధుభైరవి చిత్రంలోని గీతం) అంటూనే తన మాతృభాష మలయాళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ పాటలు పాడారు. తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, తుళు భాషల్లోనూ ఆమె ఆలపించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అందుకున్నారు. నేడు చిత్ర పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

ఆ పాటే మలుపు తిప్పింది

చిత్ర గురువు ఓమనకుట్టి అన్నయ్య ఎంజీ రాధాకృష్ణన్‌ 1979లో ఓ సినిమాకి ఆమెతో పాడించారు. కానీ, ఆ చిత్రం విడుదల కాలేదు. 1982లో మరోసారి అవకాశం ఇచ్చారు. అదో డ్యూయెట్‌. మేల్‌ వెర్షన్‌ ఎంజీ శ్రీకుమర్‌ పాడినా.. ఎందుకో మళ్లీ ఏసుదాసుతో పాడించారు. అలా ఏసుదాసుతో పాడిన పాట విడుదలైంది. అంతా విన్నారు..  ‘ఏసుదాసుతో ఎవరో చిన్న పిల్ల పాడిందట!’ అనే మాటలు గుప్పించారు. దాంతో ‘పెద్దవాళ్లకి ఈ గొంతు పనికిరాదు!’ అనే ముద్ర పడింది చిత్రపై. ఆ విమర్శల్ని కొట్టిపారేసి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా చిత్రకి తన సినిమాల్లో పాడే సదావకాశం ఇచ్చారు. అలా వచ్చిన డబ్బింగ్‌ చిత్రం ‘సింధుభైరవి’లో ‘పాడలేను’ అనే పాటతో తెలుగు వారికి పరిచయమయ్యారామె.

ఎ.ఆర్‌. రెహమాన్‌తో..

‘రోజా’ చిత్రంలోని ‘నాగమణీ.. నాగమణీ’ గీతంతో ఈ కాంబినేషన్‌ సెట్‌ అయింది. ఈ కలయికలో వచ్చిన ప్రతి పాటా సూపర్‌ హిట్టే. ‘బొంబాయి’ హిందీ వెర్షన్‌ కోసం చిత్ర పాడిన ‘కెహనాహి క్యా’ (కన్నానులే కలయికలు..) పాటని ప్రసిద్ధ గార్డియన్‌ ఆంగ్ల పత్రిక ‘చనిపోయేలోపు వినాల్సిన 1000 పాటలు’ జాబితాలో చేర్చింది. ‘ఇదే మా కాంబినేషన్‌కి దక్కిన అతి పెద్ద గౌరవం’ అని చెప్తుంటారు చిత్ర. ఇళయ రాజా నుంచి మణిశర్మ, దేవి శ్రీ ప్రసాద్‌, తమన్‌ తదితర సంగీత దర్శకుల సారథ్యంలో ఎన్నో సుమధుర గీతాలు అందించారు చిత్ర. ఏ నాయికకి ఎలా పాడాలో ఆమెకి బాగా తెలుసు. మరి చిత్ర పాడిన కొన్ని పాటల్ని వినేద్దామా...










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని