Sunitha: డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానన్నారు.. ఆమె మాటతో బాగా ఏడ్చాను

తన మధురమైన స్వరంతో గాయకురాలిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తెలుగువారికి చేరువైన తెలుగింటి ముద్దుగుమ్మ సునీత. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సునీత.. కష్టాల్నే పునాదులుగా మలచుకుని కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. ఇటీవల రామ్‌తో ఏడడుగుల బంధంలోకి...

Updated : 11 Aug 2021 15:44 IST

హైదరాబాద్‌: తన మధురమైన స్వరంతో గాయకురాలిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తెలుగువారికి చేరువైన తెలుగింటి గాయని సునీత. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సునీత.. కష్టాల్నే పునాదులుగా మలచుకుని కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. ఇటీవల రామ్‌తో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

‘‘టీనేజీలో ఉన్నప్పుడు ప్రతి అమ్మాయి.. తన జీవితం ఓ అందమైన నవలలా ఉండాలని కలలుకంటుంది. తన కథలో తనే కథానాయిక కావాలని ఆశిస్తుంది. జీవిత భాగస్వామి తనని బాగా చూసుకోవాలని.. ప్రేమించాలని.. లాలించాలని.. ఊహల లోకంలో విహరిస్తుంటుంది. నా కెరీర్‌ ప్రారంభమైన కొత్తలో నేను కూడా అలాంటి ప్రపంచంలోనే ఉన్నాను. కానీ, మొదటి పెళ్లి తర్వాత నాకెన్నో విషయాలు తెలిసొచ్చాయి. అసలు జీవితమంటే ఏమిటో తెలిసింది. మొదటి పెళ్లి, బ్రేకప్‌ తర్వాత రామ్‌తో పెళ్లి జరిగే వరకూ సుమారు 15 సంవత్సరాలపాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ఇంకెన్నో సమస్యలు చూశాను. నాకు తగిలిన దెబ్బలకు మనుషుల్ని నమ్మడం కూడా మానేశాను’’

‘‘రామ్‌ చాలా మంచి వ్యక్తి. పెళ్లి ప్రపోజల్‌తో నా వద్దకు వచ్చినప్పడు ‘నువ్వు నా ప్రపోజల్‌ ఒప్పుకుంటే నా జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే బాధపడతాను.. కానీ నా లైఫ్‌ మాత్రం ఎక్కడ ఆగదు’ అని చెప్పాడు. ఆయనలోని నిజాయతీ నాకు బాగా నచ్చింది’’

‘‘చాలా మంది ఆడవాళ్లు నా గురించే తప్పుగా మాట్లాడుకున్నారు. నా బాధ్యతలన్ని ఎవరో వ్యక్తి చూసుకుంటున్నారని కామెంట్లు కూడా చేశారు. డబ్బు కోసమే రామ్‌ని పెళ్లి చేసుకున్నానన్నారు. ఆయనకు ఎంత ఆస్తి ఉందనే విషయం నాకు ఇప్పటికీ తెలియదు. ఆయన కంపెనీ టర్నోవర్‌ ఎంతో ఐడియా లేదు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఒకరిపై ఒకరికి పరస్పరం గౌరవం ఉంది’’

‘‘నేను 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక మ్యూజిక్‌ ప్రోగ్రామ్‌కి వెళ్లాను. ప్రోగ్రామ్‌లో భాగంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇచ్చిన మైక్‌ని చేతితో అందుకున్నాను. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత.. ఆయన సతీమణి నా వద్దకు వచ్చి.. ‘నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా?’ అని ప్రశ్నించింది. నేను షాకై.. ‘ఏమైంది ఆంటీ’ అని అడగ్గా.. ‘ఇందాక నువ్వు మైక్‌ తీసుకుంటూ ఆయన చేతిని తాకావు. ఆయనపై నీకున్న ఆలోచన ఏమిటి?’ అని అన్నారు. ఆ మాటకు బాగా ఏడ్చాను. ఇది ఒక్కటి మాత్రమే కాదు.. ఇలా ఎన్నో సందర్భాల్లో ఎన్నో కామెంట్లు చూశాను. ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశా’ అని సునీత వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని