
Gamanam: సుడులు తిరుగు నడి కడలిన..
శ్రియ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘గమనం’. సుజనారావు తెరకెక్కించారు. రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా నిర్మించారు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మేనన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ‘సాంగ్ ఆఫ్ లైఫ్’ పేరుతో ఓ లిరికల్ గీతాన్ని హీరో నాగచైతన్య విడుదల చేశారు. ‘‘సుడులు తిరుగు నడి కడలిన.. పడవ నడపమని అడగాలా. పిడుగు పడిన ప్రతి క్షణమున.. అడుగు నిలపమని అడగాలా’’ అంటూ మనసులను హత్తుకునేలా సాగుతున్న ఈ మెలోడీ గీతానికి ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. కృష్ణకాంత్ సాహిత్యమందించారు. కైలాష్ ఖేర్ ఆలపించారు. భావోద్వేగభరితమైన మూడు కథలతో రూపొందిన చిత్రమిది. ఇందులో శ్రియ దివ్యాంగురాలి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఛాయాగ్రహణం: జ్ఞాన శేఖర్ వి.ఎస్.