
Sonusood: అర్ధరాత్రి ఫోన్లు.. నాకు ఇబ్బంది లేదు: సోనూసూద్
ముంబయి: కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందించి రియల్‌హీరో అనిపించుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. గతేడాది నుంచి ఇప్పటివరకూ ఆయన ఎన్నో వందల మందికి ఆపన్న హస్తం అందించారు. ఈ క్రమంలో సాయం కోరుతూ ఎంతోమంది సోనూకి ఫోన్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ‘‘సాయం కోరుతూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అర్ధరాత్రి ఫోన్లు రావడం పట్ల నాకెలాంటి ఇబ్బందిలేదు. కానీ, వాళ్లకు చేయూతనందించేవాళ్లు లేరా? అని బాధగా అనిపిస్తోంది. ఒకరిపై ఒకరు నిందలేసుకోవడం మానేసి... ఉద్యోగాలు కల్పించడం, పేదల ఆకలి తీర్చడం, ఉచిత విద్య అందించడం ద్వారా ఈ సమస్యలు పరిష్కరించవచ్చు’’ అని సోనూసూద్ పేర్కొన్నారు.
గతేడాది కరోనా సమయంలో వలస కార్మికుల కోసం సోనూ నిరంతరాయంగా శ్రమించారు. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకునేలా చేశారు. ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఆచార్యలో నటిస్తున్నారు. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో సోనూ కీలకపాత్రలో కనిపించనున్నారు.