Published : 19/08/2021 09:45 IST

Raja Raja Chora Review: రివ్యూ: రాజ రాజ చోర

చిత్రం: రాజ రాజ చోర; నటీనటులు: శ్రీవిష్ణు, మేఘా ఆకాష్‌, సునయన, రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, అజయ్‌ ఘోష్‌ తదితరులు; సంగీతం: వివేక్‌ సాగర్‌; సినిమాటోగ్రఫీ: వేద రమణ్‌ శంకరన్‌; ఎడిటింగ్‌: విప్లవ్‌; నిర్మాత: అభిషేక్‌ అగర్వాల్‌, టీజీ విశ్వ ప్రసాద్‌; దర్శకత్వం: హసిత్‌ గోలి; విడుదల: 19-08-2021

శ్రీవిష్ణు సినిమా అంటే అందులో క‌చ్చితంగా ఓ కొత్త క‌థ ఉంటుంద‌ని నమ్మేంత‌గా ప్రేక్ష‌కుల‌పై ఆయ‌న ప్ర‌భావం చూపించారు. అందుకే జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా శ్రీవిష్ణు  సినిమా వ‌స్తోందంటే ప్ర‌తిసారీ ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి క‌నిపిస్తుంటుంది. క‌రోనా రెండో ద‌శ త‌ర్వాత విడుదలైన ‘రాజ రాజ చోర‌’పై కూడా ప్ర‌త్యేక‌మైన అంచ‌నాలే  ఏర్ప‌డ్డాయి. వెంక‌టేష్ సినిమాల్ని గుర్తు చేస్తుందంటూ  శ్రీవిష్ణు ఆ అంచ‌నాల్ని రెట్టింపు చేశారు. మ‌రి  సినిమా ఎలా ఉంది?ఈ చోరుడు కథేంటి?

క‌థేంటంటే: స్టేష‌న‌రీ షాప్‌లో ప‌నిచేస్తుంటాడు భాస్క‌ర్ (శ్రీవిష్ణు).  కానీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటూ సంజ‌న (మేఘ ఆకాష్‌)తో  ప్రేమాయ‌ణం సాగిస్తుంటాడు.  అవ‌స‌రాలు అత‌న్ని ఓ దొంగలా మార్చేస్తాయి. అనూహ్య ప‌రిణామాల త‌ర్వాత  భాస్క‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాద‌నీ... అత‌నికి విద్య (సునయన) అనే మ‌రో అమ్మాయితో పెళ్ల‌య్యింద‌ని, వాళ్లిద్ద‌రికీ ఓ అబ్బాయి కూడా ఉన్నాడ‌నే విష‌యం సంజ‌న‌కి తెలుస్తుంది. మ‌రి నిజంగానే భాస్క‌ర్‌కి పెళ్ల‌యిందా? దొంగగా ప‌ట్టుబ‌డి పోలీసులకి చిక్కిన భాస్క‌ర్ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగిందనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: దొంగ వాల్మీకి ఎలా అయ్యాడో... అలా ఓ దొంగ త‌న జీవితంలో చెందిన ప‌రివ‌ర్త‌నమే ఈ చిత్రం. మ‌న‌సు ఒక‌టి చెబుతున్నా‌... డ‌బ్బు కోసం మ‌రొక‌టి  చేయ‌డం కూడా  త‌ప్పే అనే సందేశాన్ని సునిశిత‌మైన హాస్యం, భావోద్వేగాలు, డ్రామాని మేళ‌వించి చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది.  మంచి క‌థ‌, క‌థ‌నం, పాత్రలతో ద‌ర్శ‌కుడు చిత్రాన్ని తీర్చిదిద్దాడు.  అయితే చాలా స‌న్నివేశాలు నెమ్మ‌దిగా సాగ‌డం ఇబ్బంది పెడుతుంది. పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేయ‌డానికి బాగా స‌మ‌యం తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు.  భాస్క‌ర్ - విద్యల నేప‌థ్యంలో స‌న్నివేశాలు మొద‌ల‌య్యాకే  క‌థ‌లో వేగం పెరుగుతుంది. విరామ స‌న్నివేశాల‌కి ముందు భాస్క‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాద‌నే విష‌యం తెలిసిన‌ప్పుడూ... రాజు దొంగ‌గా శ్రీవిష్ణు ప‌ట్టుబ‌డిన‌ప్పుడు వ‌చ్చే స‌న్నివేశాలు క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. ఆ మ‌లుపులు క‌థ‌ని  కూడా మ‌రింతగా ర‌క్తిక‌ట్టిస్తాయి.

ద్వితీయార్ధం కోసం ఆస‌క్తిగా ఎదురు చూసేందుకు కార‌ణ‌మ‌వుతాయి. కానీ, ప్రథమార్ధం త‌ర‌హాలో ద్వితీయార్ధంలోనూ చాలా స‌న్నివేశాలు నెమ్మ‌దించ‌డం సినిమాకి కాస్త మైన‌స్‌. డ్రామాపైనే ఎక్కువ‌గా దృష్టిపెట్టిన ద‌ర్శ‌కుడు విరామం త‌ర్వాత భావోద్వేగాలు పండించ‌డంలో తడబడ్డాడు. అయితే, తనికెళ్ల భ‌ర‌ణి చెప్పే ప్ర‌వ‌చ‌నాల‌తో ముడిపెడుతూ క‌థ‌ని న‌డిపించిన విధానం కూడా ఆక‌ట్టుకుంటుంది. ప్రతీ పాత్ర వెన‌క రెండో కోణాన్ని ఆవిష్క‌రించిన తీరు, ప‌తాక స‌న్నివేశాల్లో అజ‌య్ ఘోష్ చెప్పే సంభాష‌ణ‌లు చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి.  సునిశిత‌మైన హాస్యాన్ని, డ్రామాని ఇష్ట‌ప‌డే  ప్రేక్ష‌కుల‌కి నచ్చుతుందీ చిత్రం.

ఎవ‌రెలా చేశారంటే: శ్రీవిష్ణు మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటారు.  దొంగ‌గా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా రెండు కోణాల్లో  క‌నిపించిన తీరు, హాస్యం... భావోద్వేగాల్ని పండించిన విధానం చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. మేఘ ఆకాష్, సునయన పాత్ర‌లు కూడా క‌థ‌లో కీల‌కం. మేఘ అందంగా క‌నిపించ‌మే కాదు,  ఆమె అభిన‌యం కూడా ఆక‌ట్టుకుంటుంది. గృహిణి పాత్ర‌లో సునయన, పోలీస్ అధికారి అధికారిగా ర‌విబాబు  ఒదిగిపోయిన తీరు బాగుంది.  బ‌లం ఉంటే.. చిన్న పాత్ర‌లైనా బాగా పండుతాయ‌న‌డానికి ఈ సినిమా ఓ నిద‌ర్శ‌నం.  గంగ‌వ్వ,  శ్రీకాంత్ అయ్యంగ‌ర్‌,  అజ‌య్ ఘోష్, త‌నికెళ్ల భ‌ర‌ణి  త‌దిత‌రులు పోషించిన చిన్న పాత్ర‌లు, వాళ్ల న‌ట‌న కూడా ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోతాయి. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. వివేక్ సాగ‌ర్ పాటలు, నేప‌థ్య సంగీతం క‌థ‌కి ప్రాణం పోసింది.  వేద రామ‌న్ కెమెరా ప‌నిత‌నం, విప్ల‌వ్ కూర్పుతో పాటు ఇత‌ర విభాగాలు కూడా   చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. ద‌ర్శ‌కుడిగా కంటే కూడా హ‌సిత్ గోలి త‌న  ర‌చ‌నతో  ప్రేక్ష‌కుల‌పై ప్ర‌త్యేక‌మైన ముద్ర వేస్తాడు. కానీ కొన్ని స‌న్నివేశాలు సామాన్య ప్రేక్ష‌కుడికి అంద‌నంత స్థాయిలో ఉండ‌టం ఇబ్బంది పెడుతుంది.  నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

బ‌లాలు

+ క‌థ‌.. క‌థ‌నం

+ హాస్యం... సందేశం

+ శ్రీవిష్ణు న‌ట‌న

బ‌ల‌హీన‌త‌లు

- అక్కడక్కడా నెమ్మదిగా సాగే సన్నివేశాలు

- ద్వితీయార్ధం

చివ‌రిగా: రాజ రాజ చోర‌... ఈ చోరుడు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేస్తాడు!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని