Biggboss Season5: బిగ్‌బాస్‌ హౌస్‌లో కొత్త కెప్టెన్‌గా శ్రీరామచంద్ర

ఎంతో ఉత్కంఠ సాగిన బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ ‘నెగ్గాలంటే తగ్గాల్సిందే’లో విజయం సాధించి సన్నీ-మానస్‌, శ్రీరామచంద్ర-హమీద, శ్వేతావర్మ-అనీమాస్టర్‌ జోడీలు కెప్టెన్‌ పోటీదారులుగా అర్హత సాధించారు...

Updated : 01 Oct 2021 09:26 IST

హైదరాబాద్‌: ఎంతో ఉత్కంఠగా సాగిన బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ ‘నెగ్గాలంటే తగ్గాల్సిందే’లో విజయం సాధించి సన్నీ-మానస్‌, శ్రీరామచంద్ర-హమీద, శ్వేతావర్మ-అనీమాస్టర్‌ జోడీలు కెప్టెన్‌ పోటీదారులుగా అర్హత సాధించారు. ఈ టాస్క్‌లో సన్నీ-మానస్‌ల జోడీ అత్యధికంగా బరువు తగ్గింది. వీళ్లిద్దరూ ఏకంగా 10 కిలోల తగ్గారు. మానస్‌ ఒక్కడే ఆరు కిలోల బరువు తగ్గడం విశేషం. అర్హత సాధించిన జోడీలో ఒకరు కెప్టెన్‌ పోటీదారులుగా బరిలో నిలబడాల్సి ఉంటుందని.. వాళ్లెవరో తేల్చుకుని సంచాలకురాలు కాజల్‌కు చెప్పాలని బిగ్‌బాస్ సూచించాడు. కెప్టెన్‌ పోటీలో ఎవరు నిలబడాలన్న అంశంపై మూడు జోడీల మధ్య చర్చ బాగానే నడిచింది. మానస్ సన్నీకి మద్దతు ఇవ్వగా.. అనీ మాస్టర్‌ శ్వేతావర్మలు ‘కుషన్‌ టాస్‌’ రూపంలో కెప్టెన్‌ పోటీదారులను ఎంచుకుని సింపుల్‌గా తేల్చేశారు. తన తెలివితేటలతో హమీదాను ఒప్పించి శ్రీరామ కెప్టెన్‌ పోటీదారుడిగా రంగంలోకి దిగారు.

దీంతో శ్రీరామ్‌, శ్వేతావర్మ, సన్నీల మధ్య కెప్టెన్సీ పోటీ నెలకొంది. తమకు ఇష్టంలేని, కెప్టెన్‌ అయ్యేందుకు అర్హత లేని వ్యక్తిని ఎంచుకుని.. అతని నడుముకు కట్టిన బెల్ట్‌లో కత్తిని గుచ్చాలని బిగ్‌బాస్‌ సూచించాడు. సన్నీకి అత్యధికంగా కత్తిపోట్లు దిగాయి. నీకు కత్తి గుచ్చాలని లేదని ఒకరు.. నీకు ఇప్పుడే కెప్టెన్‌ అయ్యే అర్హత లేదని మరొకరు.. కెప్టెన్‌ అంటే కమాండర్‌లా ఉండాలని ఇంకొకరు సన్నీకి కత్తులు దింపారు. ఎక్కువమంది కత్తులు దింపడంతో సన్నీ బాధపడ్డాడు. ‘నాకేం రీజన్‌ లేదు..’ అంటూ సైలెంట్‌గా లోబో దింపిన కత్తికి సన్నీ విచారం వ్యక్తం చేశాడు. శ్వేతావర్మ బెల్ట్‌కు హమీదా, కాజల్‌, మానస్‌లు కత్తులు గుచ్చారు. శ్రీరామచంద్రకు అనీమాస్టర్‌ ఒక్కరే కత్తిపోటు గుచ్చారు. దీంతో శ్రీరామచంద్ర కొత్త కెప్టెన్‌ అయ్యాడు.

హౌస్‌లో ఎవరు బెస్ట్‌.. ఎవరు వరస్ట్‌ పెర్ఫార్మరో చెప్పాలని ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ సూచించాడు. మరి ఇంట్లో బెస్ట్‌ ఎవరో, వరస్ట్‌ పెర్ఫార్మర్‌ ఎవరో తెలియాలంటే శుక్రవారం జరగబోయే ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని