Gully Rowdy Review: రివ్యూ: గల్లీరౌడీ

Gully Rowdy: సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటించిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘గల్లీ రౌడీ’ ఎలా ఉందంటే?

Updated : 17 Sep 2021 19:55 IST

చిత్రం: గల్లీ రౌడీ; నటీనటులు: సందీప్‌ కిషన్‌, నేహాశెట్టి, బాబీ సింహా, హర్ష, వెన్నెల కిషోర్‌, రాజేంద్రప్రసాద్‌, పోసాని కృష్ణమురళి తదితరులు; సంగీతం: రామ్‌ మిర్యాల, సాయి కార్తిక్‌; సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ్‌; ఎడిటింగ్‌: చోటా కె.ప్రసాద్‌; రచన: నందు; నిర్మాత: కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ; బ్యానర్‌: కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమాస్‌; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి; విడుదల: 17-09-2021

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న యువ క‌థానాయ‌కుల్లో సందీప్‌కిష‌న్ ఒక‌రు. ఆయ‌న ‘తెనాలి రామ‌కృష్ణ బి.ఎ, బి.ఎల్‌’ త‌ర్వాత మ‌రోసారి జి.నాగేశ్వ‌ర్‌రెడ్డి కాంబినేషన్‌లో చేసిన చిత్రం ‘గల్లీరౌడీ’. దీని వెన‌క కోనవెంక‌ట్‌లాంటి సీనియ‌ర్ ర‌చ‌యిత కూడా ఉండ‌టంతో సినిమాపై ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి ఏర్ప‌డింది. ప్ర‌చార చిత్రాలు కూడా అంచ‌నాలు పెంచాయి. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టు సినిమా ఉందా? ‘గల్లీరౌడీ’గా సందీప్‌ చేసిన హంగామా ఏంటి?

క‌థేంటంటే: విశాఖ‌లో ఒక‌ప్పుడు పేరు మోసిన రౌడీ సింహాచ‌లం(నాగినీడు). త‌న వైభ‌వం కోల్పోయాక, త‌న కొడుకు మ‌ర‌ణించాక ఎలాగైనా త‌న మ‌న‌వ‌డు వాసు (సందీప్‌కిష‌న్‌)ని రౌడీని చేయాల‌ని నిర్ణ‌యిస్తాడు. త‌న శ‌త్రువుపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పెంచుతాడు. కానీ, వాసుకేమో రౌడీయిజం అంటే అస్స‌లు ఇష్టం ఉండ‌దు. సాహిత్య (నేహాశెట్టి)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. అదే స‌మ‌యంలో ఆమెకీ, ఆమె కుటుంబానికి ఓ స‌మ‌స్య వ‌స్తుంది. అందుకోసం ‘గ‌ల్లీరౌడీ’గా  చ‌లామ‌ణీ అవుతున్న వాసుని ఆశ్ర‌యిస్తుంది. ఇంత‌కీ సాహిత్య కుటుంబానికి వ‌చ్చిన స‌మ‌స్య ఏమిటి అందుకోసం వాసు ఏం చేశాడు? రౌడీ అయ్యి, శ‌త్రువుపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌న్న తాత కోరిక‌ని ఎలా నెర‌వేర్చాడన్న‌దే కథ.

ఎలా ఉందంటే: ఎలాంటి కొత్త‌ద‌నం లేని క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందిన చిత్ర‌మిది. న‌వ్వించ‌డమే ప్ర‌ధానంగా స‌న్నివేశాల అల్లిక క‌నిపిస్తుంది. న‌టీన‌టుల అనుభ‌వం, ర‌చ‌నా ప్ర‌భావం వ‌ల్ల ఆ ప్ర‌య‌త్నం కొంత‌మేర‌ నెర‌వేరిన‌ట్టు అనిపించినా, మిగిలిన విషయాల్లో సినిమా ఏమాత్రం ఆసక్తిని పంచలేదు.. లాజిక్ లేని స‌న్నివేశాలతో..  ఏ మాత్రం భావోద్వేగాలు పండించ‌ని డ్రామాతో సింహ భాగం సినిమా నీర‌సంగా సాగుతుంది. మేకింగ్ ప‌రంగా సినిమా తీయడంలో ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ, ఈ సినిమాని చూస్తే గ‌ల్లీరౌడీ స్కూల్‌కి వెళ్లే రోజుల్లో రావ‌ల్సిన చిత్రం అనిపిస్తుంది. ప్ర‌థ‌మార్ధంలో కిడ్నాప్ డ్రామా ఎపిసోడ్ ఆక‌ట్టుకుంటుంది. విరామ స‌న్నివేశాలు మెప్పిస్తాయి. ద్వితీయార్ధంలో ర‌వినాయ‌క్‌గా బాబీ సింహా ఎంట్రీ ఇచ్చాకైనా క‌థ‌లో సీరియ‌స్‌నెస్ క‌నిపిస్తుందేమో అనుకుంటే, ఆ పాత్ర‌ని కూడా డ‌మ్మీగా మార్చేశారు. అసలు ఆ పాత్ర‌ని పరిచయం చేసిన విధానం ఓ రేంజ్‌లో ఉంటుంది కానీ, ఆ ప్ర‌భావం ఆ త‌ర్వాత క‌నిపించ‌దు.  రాజేంద్ర‌ప్ర‌సాద్‌, వెన్నెల కిశోర్‌, ష‌క‌లక శంక‌ర్ త‌దిత‌రులు చేసే సంద‌డే అక్క‌డ‌క్క‌డా న‌వ్వించింది.  నాయ‌కానాయిక‌ల మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాల్లోనూ బ‌లం లేదు.  అటు న‌వ్వించ‌లేక‌, ఇటు ఆస‌క్తిని రేకెత్తించ‌లేక‌, భావోద్వేగాలూ పండ‌క సినిమా సో సో అనిపిస్తుంది.  కోన వెంక‌ట్, జి.నాగేశ్వ‌ర్‌రెడ్డి వంటి సీనియ‌ర్లు స్ర్కీన్‌ప్లే రాసినా అది సినిమాపై ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌లేదు.

ఎవ‌రెలా చేశారంటే: సందీప్‌కిష‌న్  త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటాడు. వాసు పాత్రలో సుల‌భంగా ఒదిగిపోయాడు. పోరాట ఘ‌ట్టాలపై చ‌క్క‌టి ప్ర‌భావం చూపించాడు. రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌ట‌న స్పెషల్‌. సినిమాలో కీల‌క పాత్ర పోషించిన ఆయ‌న త‌న‌దైన అనుభ‌వంతో మామూలు స‌న్నివేశాల్లోనూ న‌వ్వించారు. నేహాశెట్టి అందంగా క‌నిపించింది. వైవా హ‌ర్ష‌, వెన్నెల కిషోర్‌, ష‌క‌లక శంక‌ర్ త‌దిత‌రులు చేసిన సంద‌డి కూడా న‌వ్వించింది. మిమి గోపి ప్ర‌ధాన ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు. ద్వితీయార్ధంలో బాబీ సింహా పాత్రే కీల‌కం.  సాంకేతిక విభాగాల్లో సాయివెంక‌ట్, చౌర‌స్తా రామ్ సంగీతం మెప్పిస్తుంది. పాట‌లు, నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంది.  క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. అక్క‌డక్క‌డా మాట‌లు మెప్పిస్తాయి. ద‌ర్శ‌కుడు  జి.నాగేశ్వ‌ర్‌రెడ్డి పాత క‌థ‌ని, అదే ర‌క‌మైన పాత ప‌ద్ధ‌తుల్లో న‌డిపారు.

బ‌లాలు

+ కొన్ని హాస్య స‌న్నివేశాలు

+ విరామ స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

- క‌థ‌, క‌థ‌నం

- భావోద్వేగాలు లేక‌పోవ‌డం

- ద్వితీయార్ధంలో సాగ‌దీత‌

చివ‌రిగా: ఈ ‘రౌడీ’ ఇంకా అవే ‘గల్లీ’లు పట్టుకుని తిరుగుతూ ఉండిపోయాడు.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని