suresh babu: ప్రభుత్వాలు ఆదుకున్నది శూన్యం.. థియేటర్‌నే నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఏంటి?

  వెంకటేశ్‌ కథానాయకుడిగా జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దృశ్యం2’. సంపత్‌రాజ్‌, మీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు

Updated : 27 Nov 2021 20:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  వెంకటేశ్‌ కథానాయకుడిగా జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దృశ్యం2’. సంపత్‌రాజ్‌, మీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైన ఈ సినిమాకు మంచిస్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.సురేశ్‌బాబు విలేకరులతో మాట్లాడారు. ‘దృశ్యం 1’లాగే ‘దృశ్యం 2’కు కూడా ఆదరణ బాగుందని అన్నారు. వెంకటేశ్‌తో సహా ఇతరులు నటనతో ఆకట్టుకున్నారని, చెబుతూ ఆ సినిమా అనుభవాలతో సహా ఇతర విషయాలు పంచుకున్నారు.

‘దృశ్యం 2’ విజయాన్ని ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు? అదెలా మీ చేతికొచ్చింది?

సురేశ్‌బాబు: ఈ సినిమా నాకు ఒక మర్చిపోలేని అనుభవం. మలయాళ వెర్షన్‌ చూడకముందే జీతూ జోసెఫ్‌ గారిని స్క్రిప్ట్‌ పంపించమని అడిగాను. దాన్ని చదవగానే చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఇంత ఇంటలిజెంట్‌గా కూడా రాయొచ్చా అని ఆశ్చర్యపోయా. అప్పుడే ఆ సినిమా చేయాలనే నిర్ణయానికొచ్చా. తెలుగు నేటివిటికీ అనుగుణంగా కొన్ని మార్పులు చేశాం. హైదరాబాద్‌, కేరళల్లో ఏకధాటిగా షూటింగ్‌ చేశాం. అంతా స్మూత్‌గా వెళ్లింది. మేం ఇంత వేగంగా ఏ సినిమా చేయలేదు. ఇంకా కొవిడ్‌ భయం ఉండటంతో షూటింగ్‌కి పెద్దగా వెళ్లకపోయేవాణ్ని. షూటింగ్‌ పూర్తయ్యాక అందరం చాలా బాగా వచ్చింది అనుకున్నాం. ఓటీటీకి వెళ్లాలా, థియేటర్‌కా అని కొన్నాళ్లు సంశయించాక ఓటీటీకే మొగ్గు చూపాం. సినిమా రిలీజ్‌ అయ్యాక మంచి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. ఈ క్రెడిట్‌ అంతా జీతూ రైటింగ్‌కే దక్కుతుంది. వెంకటేశ్‌, మీనా, నదియా, నరేశ్‌, ఇద్దరు పిల్లలు.. అద్భుతంగా నటించారు. గతంలో మనం చేసిన సినిమా విడుదలైనప్పుడు ఎలా వస్తుందో అనే వణుకు, భయం ఉండేది. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పేవారు. ఇప్పుడంతా ఆన్‌లైన్‌నే కదా! ట్వీటర్‌, మీమ్స్‌.. క్షణాల్లో రివ్యూలు వచ్చేస్తున్నాయి. ఈ సినిమాతో అంతా హ్యాపీ. అమెజాన్‌ వాళ్లూ సంతోషంగా ఉన్నారు. 

మంచి సినిమా థియేటర్‌లో విడుదల చేయలేకపోయాం అని ఏమైనా ఫీలవుతున్నారా?

సురేశ్‌బాబు: అదేం లేదు. నేనూ థియేటర్ల వ్యాపారంలో ఉన్నా. సినిమా థియేటర్‌కి వెళ్లి చూస్తే కలిగే అనుభూతి ఏంటో తెలుసు. కొవిడ్‌ భయాలతో ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లకపోయేవాణ్ని. నా కుటుంబ సభ్యులు సైతం థియేటర్‌కి వెళ్లడానికి ఇష్టం లేదు. అలాంటప్పుడు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడండి అని చెప్పలేం కదా! అఫ్‌కోర్స్‌.. ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగుపడింది. పాటలు, ఫైట్స్‌, ఎఫెక్ట్స్‌ ఉన్న త్రిబుల్‌ ఆర్‌లాంటి సినిమాకైతే గొప్ప అనుభవం, అనుభూతి కావాలంటే తప్పకుండా థియేటర్‌కి వెళ్లి చూడాల్సిందే. కుటుంబ తరహావి, చిన్న సినిమాలైతే ఓటీటీలతో జనానికి దగ్గర కావొచ్చు.

ఏపీలో ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరల్ని నియంత్రించడంతో నిర్మాతలు ఓటీటీకి వెళ్తున్నారని మీరు భావిస్తున్నారా? ప్రభుత్వం ఇండస్ట్రీపై కన్నెర్రజేస్తుందని కొందరంటున్నారు. నిజమేనా?

టికెట్‌ ధరలు అనేది ఇక్కడ చిన్న విషయం. ఇదే కారణంతో నిర్మాతలు ఓటీటీలవైపు చూస్తున్నారనే విషయం నిజం కాదు. అయితే ఈరోజుల్లో కూడా బీ, సీ సెంటర్లలో టికెట్‌ ధరలు 20, 15 రూపాయలుగా ఉండాలనడం అన్‌ఫెయిర్‌. ఒక నిర్ణయం జరిగినప్పుడు ఇది తప్పు, ఇది ఒప్పు అని వెంటనే ఓ అభిప్రాయానికి రాలేం. టికెట్‌ ధరలు తగ్గిస్తే జనాల్లో మంచి పేరు వస్తుందని ప్రభుత్వం భావించి ఉండొచ్చు. భారీ ఖర్చుపెట్టి, అష్టకష్టాలకోర్చి తీసిన సినిమాకి తగ్గ ధర ప్రకటించుకుంటే తప్పేంటి అని నిర్మాతలు, హీరోలు భావించడమూ సమంజసమే. రెండువైపులా వాదన సబబుగానే ఉంటుంది. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టలేం. అయితే ఎగ్జిబిటర్లకు నష్టాలు వస్తాయనే కారణంతో సినిమాలు ఓటీటీలకు వెళ్తున్నాయనడం కరెక్ట్‌ కాదు.

భవిష్యత్తులో అగ్ర తారల సినిమాలు, చిన్న చిత్రాలు, థియేటర్లు, ఓటీటీలు అని వేర్వేరుగా ఉండబోతున్నాయంటారా?

సురేశ్‌బాబు: తప్పకుండా. చిన్న సినిమాలు థియేటర్లలో ఆడవు అని నా అభిప్రాయం కాదుగానీ.. అందులో జనాలను బలవంతంగా థియేటర్లకు రప్పించగలిగే అసాధారణ సరుకేదో ఉండాలి. అర్జున్‌రెడ్డి, జయం.. లాంటి చిన్న సినిమాలు సైతం పెద్ద విజయాలు అందుకోవడం అందుకు నిదర్శనం. చిన్న సినిమాకైనా, పెద్ద సినిమాకైనా టికెట్‌ ధర ఒక్కటే. అలాంటప్పుడు నేను అంత ధర చెల్లించి వినోదం అందించలేని వాటివైపు ఎందుకు వెళ్లాలి? ఓటీటీ ఉంది కదా అనే ఆలోచన ప్రేక్షకుడిలో కలుగుతుంది. దీనికి అనుగుణంగానే నిర్మాతలు ఏ ప్లాట్‌ఫాం ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి.

ఓటీటీలో విడుదలైన తర్వాత వాటిని థియేటర్లలో ప్రదర్శించే ట్రెండ్‌ ఏమైనా వస్తుందంటారా?

సురేశ్‌బాబు: ఓటీటీ నిర్వాహకులు అలాంటి అవకాశం ఇవ్వరు. నారప్ప తర్వాత కొందరు థియేటర్‌ యజమానులు కొద్ది షోలు వేయడానికైనా ఇవ్వమన్నారు. కానీ ఓటీటీ వాళ్లు ఒప్పుకోలేదు. భవిష్యత్తులో ఆలోచన కూడా ఉన్నట్టు లేదు. ఎందుకంటే టీవీ, సినిమాలు చూడటం మానేసి.. పుస్తకాలు చదవడం ఆపేసి జనం ఓటీటీకే అంకితమయ్యేలా చేయడమే వాళ్ల లక్ష్యం. అది మంచిదా? చెడ్డదా? అనే విషయం పక్కన పెడితే అది వాడి వ్యాపారం. వాళ్ల పోటీ సినిమాలు, టీవీలతో కాదు.. జనం నిద్రతో, జనం సమయంతో.

మీరూ థియేటర్లు తగ్గించుకుంటున్నట్టు బయట ప్రచారం జరుగుతోంది?

సురేశ్‌బాబు: తగ్గించడం లేదు.. అలాగని పెంచడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్‌ యాజమాన్యాలను చూస్తే జాలేేస్తోంది. గత 18 నెలలుగా మేం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో సహా మమ్మల్ని ఎవరూ పట్టించుకున్న నాథుడు లేడు. 15 నెలలు థియేటర్లు మూసేసినా మినిమం విద్యుత్తు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అది రద్దు చేయమని ప్రభుత్వాలను అర్థించాం. ఏపీ ప్రభుత్వం మూడునెలలు చేశారు. వీటినే నమ్ముకున్న వాళ్లకి ఉద్యోగాలు పోయాయి. నష్టాలపాలయ్యారు. నాలుగైదురకాల వ్యాపారాలు ఉన్నవాళ్లకైతే ఫర్వాలేదు. కేవలం థియేటర్‌నే నమ్ముకున్నవాళ్ల పరిస్థితి ఏంటి? సినిమా బాగోలేదా.. కరోనా భయమా.. ఓటీటీకి అలవాటయ్యారా.. కారణం ఏదైనా థియేటర్లు మళ్లీ తెరిచాక ఏ సినిమా హౌజ్‌ఫుల్‌ కావడం లేదు. అంత దారుణంగా ఉంది పరిస్థితి.

దృశ్యం 2 ఓటీటీని ఎంచుకున్నప్పుడు అదే ప్రేక్షకులు, అదే ప్లాట్‌ఫామ్‌కే వెళ్తున్నాం అనిపించిందా?

సురేశ్‌బాబు: అదేం లేదండీ. అమెజాన్‌ ప్లాట్‌ఫాంతో మాకు మంచి సంబంధాలున్నాయి. అదేవిధంగా ప్రతి సినిమాకు కొత్త ప్రేక్షకులను రప్పించడానికి వాళ్లు ప్రయత్నిస్తూనే ఉంటారు. వాళ్లకు రెండువందలకుపైగా దేశాల నుంచి వీక్షకులు ఉన్నారు. లాభాలు వస్తున్నాయా? లేదా? అని చెప్పలేంగానీ ముందు జనాల్లోకి చొచ్చుకొని వెళ్లడమే వాళ్ల లక్ష్యం. మొదటిరోజు నుంచే లాభాలు సంపాదించే వ్యాపారాలు కావవి.

సంక్రాంతికి నాలుగు భారీ బడ్జెట్‌ సినిమాలు వస్తున్నాయి. కలెక్షన్లు కూడా ఆ విధంగా ఉంటాయా? ఒకేసమయంలో ఈ సినిమాలన్నీ రావడం అవసరమా? మీ అనుభవంతో ఏం చెబుతారు?

సురేశ్‌బాబు: వసూళ్లు రావాలనే కోరుకుంటా. మా సినిమా వాళ్లకు పండగ పూటే జనం థియేటర్లకు తెగ వస్తారు అనే అభిప్రాయం ఉంటుంది. మూడు నాలుగురోజుల్లోనే వసూళ్లు రాబట్టుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే గతంలో పండక్కి నాలుగు సినిమాలు విడుదలైతే నాలుగు వందల చొప్పున థియేటర్లు పంచుకునేవాళ్లు. ఇప్పుడు ఒక్క చిత్రమే 1,600 థియేటర్లలో వేసేంత కెపాసిటీకి ఎదిగింది. అక్కడే గొడవ మొదలవుతోంది.

విరాటపర్వం కూడా ఓటీటీలోనే వస్తుందా? రాబోయే సినిమాల వివరాలు..

సురేశ్‌బాబు: నేనొక్కడినే నిర్మాతను కాదుగా. ఇతరుల అభిప్రాయమూ తీసుకోవాలి. నిజానికి అది థియేటర్‌లో వచ్చిన తర్వాత ఓటీటీకి ఇవ్వబోయేలా నిర్ణయం తీసుకున్నాం. ఇంకా నాలుగైదు రోజలు షూటింగ్‌ చేయాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ నిర్ణయమూ మా చేతుల్లో లేకుండా పోతోంది. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో శాఖినీ-డాఖినీ, కీరవాణి అబ్బాయితో తీసిన దొంగలున్నారు జాగ్రత్త సినిమాలు పూర్తయ్యాయి. అల్లరి నరేశ్‌తో డ్యాన్సింగ్‌ క్వీన్‌ అవుతోంది. మరో మూడు పట్టాలకెక్కబోతున్నాయి.

ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి మీరూ వస్తున్నారా?

సురేశ్‌బాబు: చెప్పలేనండీ. ఇప్పటికే పెద్దపెద్ద ప్లేయర్స్‌ ఉన్నారు. వాళ్లతో పోటీ పడటం తేలికైన విషయమేం కాదు. ఏదో యూనిక్‌ ఐడియా ఉంటే తప్ప మనం అందులో అడుగు పెట్టలేం. ప్లాట్‌ఫాం పెట్టుకొని కూర్చుంటే ఏం లాభం? జనం మనవైపు చూడాలంటే మన దగ్గర ఏదో మసాలా ఉండాలి కదా? ఇంకా నేను ఒక్క వెబ్‌సిరీస్‌ కూడా బాగా తీయలేదు. వచ్చేస్తున్నారు.. వచ్చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. మేం గొప్పగా తీయకపోయినా పర్‌ఫెక్ట్‌గా తీస్తాం.  

ఏపీ మంత్రి సినిమావాళ్లు జనాలను దోచుకుంటున్నారు అంటున్నారు. మీరేమంటారు?

సురేశ్‌బాబు: బ్లాక్‌మార్కెట్‌ అనేది ఇప్పుడు కాదు.. ముప్ఫై సంవత్సరాల నుంచి కూడా ఉంది. అక్కడ కచ్చితంగా మేం చెప్పిన ధరకే టికెట్‌ కొనాల్సిందే అని ఎవరూ బలవంతం చేయరుగా! మొదటిరోజు.. మొదటి షోనే చూడాలి అనుకునేవాళ్లు బ్లాక్‌లో కొనుక్కుంటారు. బ్లాక్‌ మార్కెట్‌ తప్పే. ఎవరో కొద్దిమంది చేస్తుంటారు. ఇది కూడా రెండు, మూడురోజులు మాత్రమే ఉంటుంది. దీన్ని పెద్దది చేసి చూడాల్సిన అవసరం లేదు. అయినా బ్లాక్‌మార్కెట్‌ లేనిదెక్కడ? వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లకు బ్లాక్‌ మార్కెట్‌లో కొనుక్కోలేదా? ట్రెయిన్‌ టికెట్‌లో చేస్తున్నారుగా. ఈ సమాజమే అలాంటిది. కొద్ది సంఘటనలను సాకుగా చూసి మొత్తం అలాగే ఉంటుందని చెప్పలేం.

* ఇంతకుముందు సినిమా అంటే కేవలం థియేటర్‌కే వెళ్లి చూడాల్సిన పరిస్థితి ఉండేది. తర్వాత టీవీలు వచ్చాయి. జనాలు మెల్లగా వాటివైపు చూడటం మొదలుపెట్టారు. అమ్మోరు లాంటి సినిమాలకు జనం పోటెత్తేవారు. ఫ్యామిలీ డ్రామా సీరియళ్లతో ఇంటిలోనే కూర్చోబెడుతున్నారు. ఇక స్మార్ట్‌ఫోన్లు, ఓటీటీల రాకతో జనం అభిరుచే మారిపోయింది. కాలం గడిచేకొద్దీ రెస్టరెంట్లు, బార్బర్‌ షాపులు, లాండ్రీ షాప్‌లు, మాల్స్‌.. అన్నీ పెరుగుతున్నాయి. కానీ థియేటర్లు మాత్రం తగ్గిపోతున్నాయి. భారీతనం, పెద్ద శబ్దం, పోరాటాలు, సాంగ్స్‌.. ఉన్నవాటికే థియేటర్‌కి వెళ్లాలి. ఇతర కంటెంట్‌కి ఓటీటీ, యూట్యూబ్‌.. ఉన్నాయిగా అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు ప్రేక్షకులు. అలాగని పెద్ద సినిమాల పరిధి తగ్గిపోతోంది అనుకోవడానికి లేదు. బాహుబలి, కేజీఎఫ్‌లాంటి సినిమాలు ఒక్క భాషకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోకి దూసుకెళ్తున్నాయి. పాన్‌ఇండియా సినిమాలుగా తయారవుతున్నాయి.

* మాకు థియేటర్‌ వ్యాపారం, సినిమా నిర్మాణం, స్టూడియో బిజినెస్‌.. ఉన్నాయి. రకరకాల పరిస్థితులతో థియేటర్‌ వ్యాపారం దెబ్బతింది. సినిమా నిర్మాణం కూడా నష్టాల పాలైతే మనుగడ ఎలా? రేప్పొద్దున థియేటర్లను ఆధునికీకరించాలన్నా, కొత్త సినిమాలు తీయాలన్నా ఏదో ఒకదాంట్లో అయినా సక్సెస్‌ కావాలి కదా! మాది 56ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థ. ఎవరో ఏదో అన్నారని నేను హడావుడిగా ముందుకెళ్లను. నా లెక్కలు నాకుంటాయి. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా సినిమా పరిశ్రమ పట్ల నేను బాధ్యతగానే ఉంటాను. అందరికన్నా ఎక్కువగానే కేర్‌ తీసుకుంటాను. మేం ఇక్కడే పుట్టాం. భవిష్యత్తు ఇక్కడే ఉంది. డబ్బులొస్తాయనే ఆశతో నేను ఫిల్మ్‌ స్కూల్‌ నడపడం లేదు. ఆసక్తి, ప్రతిభ ఉన్నవాళ్లను వెలికితీయాలి. మంచి డైరెక్టరో, మంచి మ్యూజిక్‌ డైరెక్టరో, మంచి రైటరో, మంచి యాక్టరో వస్తే.. మాలాంటి నిర్మాతలతో కలిసి సినిమాలు చేస్తే మేం స్టూడియోలు నిర్మిస్తాం. పరిశ్రమ బాగుపడేలా చేస్తాం. మేం ఈరోజు ఇలా ఉన్నామంటే కారణం ప్రతిభ ఉన్నవాళ్లే. చివరికి ఏంటంటే.. మేం కథలు చెప్పేవాళ్లం మాత్రమే. ఇక్కడ ప్రతిభ ఉంటే ఎవరైనా స్టార్‌ అయిపోవచ్చు. ప్రతి ఒక్కరికీ అవకాశాలుంటాయి.

* మేం సినిమా పరిశ్రమ ఆదుకుంటాం, సాయం చేస్తాం అని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు గొప్పగా చెప్పాయి. కానీ ఆవైపు అడుగులు పడింది శూన్యం. కర్ణాటకలో అక్కడి సినిమావాళ్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యుత్తు ఛార్జీలు, ప్రాపర్టీ టాక్స్‌ రద్దు చేయించుకోగలిగారు. ఇక్కడ మేం గట్టిగా ఒత్తిడి తేలేకపోతున్నామా? లేక ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదా? తెలియడం లేదు. సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చేటప్పుడు అప్పటి సీఎం చెన్నారెడ్డిగారు ఒక మీటింగ్‌లో భారీగా పన్నులు తగ్గిస్తాం అన్నారు. అప్పుడు ఒక అధికారి అలా చేస్తే చాలా నష్టం వస్తుందని సర్‌ అన్నారు. సినిమా పరిశ్రమను డబ్బుతో పోల్చవద్దు. హైదరాబాద్‌లో ఇండస్ట్రీ ఉండటం గర్వకారణం, అనుబంధంగా చాలా ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతుంది అని చెప్పారాయన. ఇప్పుడు అలా ఆలోచించేదెవరు? తెలంగాణ ప్రభుత్వం తెలివిగా ఆలోచిస్తే హైదరాబాద్‌ని క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీగా తీర్చిదిద్దొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని