Jai Bhim Review: జై భీమ్‌ రివ్యూ

Jai Bhim Review సూర్య కీలక పాత్రలో నటించిన ‘జై భీమ్‌’ సినిమా ఎలా ఉందంటే?

Updated : 30 Aug 2022 15:33 IST

చిత్రం: జై భీమ్‌; నటీనటులు: సూర్య, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌, రాజిష విజయన్‌, లిజోమోల్‌ జోసీ, మణికంఠన్‌ తదితరులు; సంగీతం: షాన్‌ రొనాల్డ్‌; ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌; సినిమాటోగ్రఫీ: ఎస్‌.ఆర్‌.కాదిర్‌; నిర్మాత: సూర్య, జ్యోతిక; రచన, దర్శకత్వం: త.శె.జ్ఞానవేల్‌; విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న నటుడు సూర్య. ఆయన నటించిన ప్రతి చిత్రమూ తెలుగులోనూ విడుదలవుతుంది. ఇక్కడి ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన కథలను ఎంచుకుంటారు. ఇక మాస్‌ కమర్షియల్‌ సినిమాలతో పాటు అప్పుడప్పుడు ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పిస్తుంటారు. అలా ఆయన నిర్మాతగా త.శె.జ్ఞాన్‌వేల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైభీమ్’. కోర్టు రూమ్‌ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైంది. ఇందులో లాయర్‌గా సూర్య ఎలా నటించాడు? ఆయన దేని కోసం పోరాటం చేశాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

కథేంటంటే: రాజన్న(మణికందన్‌) గిరిజనుడు. నిజాయతీపరుడు. కష్టపడి పనిచేస్తాడు. స్థానిక రాజకీయ నాయకుడి ఇంట్లోకి పాము రావడంతో దాన్ని పట్టుకునేందుకు వెళ్తాడు. ఆ తర్వాత అదే ఇంట్లో చోరీ జరుగుతుంది. దీంతో పామును పట్టే సందర్భంలో అన్నీ గమనించిన రాజన్ననే ఆ దొంగతనం చేశాడని పోలీసులు అతడిపై కేసు నమోదు చేస్తారు. నేరం ఒప్పుకోమని తీవ్రంగా హింసిస్తారు. దోచిన సొత్తు ఎక్కడ దాచారంటూ రాజన్నతో పాటు అతడి కుటుంబ సభ్యులను సైతం విచారణ పేరుతో వేధిస్తారు. రాజన్న జైలు నుంచి తప్పించుకున్నాడని అతడి భార్య చిన్నతల్లి(లిజో మోల్‌ జోసే)కు చెబుతారు. దీంతో తన భర్త ఏమయ్యాడో తెలియక ఆమె బాధపడుతుంటుంది. కోర్టులో కేసు వేస్తే పోలీసులే అతడిని వెతికి తీసుకొచ్చి ఇస్తారని, అందుకు అడ్వొకేట్‌ చంద్రు(సూర్య) సాయం చేస్తాడని తెలుస్తుంది. దీంతో చిన్నతల్లి లాయర్‌ చంద్రును ఆశ్రయించడంతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేసు వాదించటానికి ముందుకు వస్తాడు. కేసు టేకప్‌ చేసిన చంద్రుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని అధిగమించడానికి ఏం చేశాడు? చివరకు చంద్రు విజయం సాధించాడా?రాజన్న ఏమయ్యాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఇదొక కోర్టు రూమ్‌ డ్రామా. ఇటీవల కాలంలో ఈ తరహా కథలు వెండితెరపై సందడి చేస్తున్నాయి. ‘నాంది’, ‘వకీల్‌సాబ్‌’, ‘తిమ్మరుసు’ ఆ కోవకు చెందినవే. లాయర్‌ అయిన కథానాయకుడు క్లిష్టమైన ఓ కేసును టేకప్‌ చేయడం. దాన్ని పరిష్కరించేందుకు అవసరమైన ఆధారాలు సేకరించడం, ఈ క్రమంలో ప్రత్యర్థులు వేసే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగడం. చివరకు కోర్టులో ఆధారాలతో నిరూపించి అమాయకులైన వారిని కాపాడటం. ఈ కథలన్నీ ఇలాగే సాగుతాయి. దర్శకుడు త.శె. జ్ఞాన్‌వేల్‌ అలాంటి పాయింట్‌నే ఎంచుకుని ఉత్కంఠ భరితంగా ‘జై భీమ్‌’ను తెరకెక్కించడంతో ఘన విజయం సాధించారు. అమాయకులైన గిరిజనులపై కొందరు పోలీసులు అక్రమ కేసులు బనాయించి, వారు నేరం ఒప్పుకొనేందుకు ఎలాంటి చర్యలకు దిగుతారన్న విషయాలను చూపించే ప్రయత్నం చేశారు. రాజన్న, చిన్నతల్లి గిరిజన జీవితాలను పరిచయం చేస్తూ కథ మొదలు పెట్టిన దర్శకుడు, రాజన్నపై దొంగతనం కేసు నమోదవడంతో నేరుగా అసలు పాయింట్‌కు వచ్చేశాడు. నేరం ఒప్పించేందుకు రాజన్నతో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు వేధించే సన్నివేశాలు కర్కశంగా ఉంటాయి. పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించేవారా? అన్న భయం చూసే ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఆ సన్నివేశాలు కూడా సుదీర్ఘంగా సాగుతాయి. 

జైలులో ఉన్న రాజన్న కనపడకపోవడంతో కథలో ఉత్కంఠ మొదలవుతుంది. పోలీసులు అతడిని ఏం చేశారు? అసలు బతికే ఉన్నాడా? అన్న ప్రశ్నలు మొదలవుతాయి. ఎప్పుడైతే చంద్రు కేసు టేకప్‌ చేశాడో అప్పుడే కథ కీలక మలుపు తీసుకుంటుంది. దొంగతనం కేసు కాస్తా పెరిగి వార్తల్లోకి ఎక్కుతుంది. ఒక్కో వాయిదాలోనూ పోలీసులపై చంద్రు విజయం సాధిస్తూ ఉంటాడు. ఈ కేసు ఎలాగైనా కేసు గెలవాలని మరోవైపు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతుందrి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు చంద్రు ఆధారాలు సేకరించడం, కేసు వాయిదాల సమయంలో కోర్టులో వాదనలు వినిపించడం తదితర సన్నివేశాలు అలరించేలా సాగుతాయి. రాజన్న ఏమయ్యాడా? అన్న పాయింట్ ప్రేక్షకుడిని తొలిచేస్తుంటుంది. చివరకు అసలు విషయం తెలిసిన తర్వాత సినిమా చూస్తున్న ప్రేక్షకుడి గుండె బరువెక్కుతుంది. కోర్టులో వచ్చే పతాక సన్నివేశాలు కళ్లు చెమర్చేలా చేస్తాయి. కేవలం ఒక కోర్టు రూమ్‌ డ్రామా మాత్రమే కాదు, అంతకుమించిన థ్రిల్లర్‌ను చూసిన అనుభూతి ‘జై భీమ్‌’ ఇస్తుంది. దర్శకుడు జ్ఞానవేల్‌ కథా, కథనాలను నడిపించిన తీరు కట్టిపడేస్తుంది.

ఎవరెలా చేశారంటే: ఇప్పటివరకూ మాస్‌ హీరోగా అదరగొట్టిన సూర్య లాయర్‌గా తన నటనలోని మరో కోణాన్ని చూపించారు. చంద్రు పాత్రలో ఆయన నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో ఆయన పలికిన హావభావాలు మరోస్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. ఆ పాత్రలో సూర్యను తప్ప మరొకరిని ఊహించుకోలేం. చాలా సెటిల్డ్‌గా నటించారు. వాదనలు వినిపించే సమయంలో కోర్టులో హుందాగా కనిపించారు.  ఇక గిరిజన దంపతులుగా నటించిన మణికందన్‌, లిజో మోల్‌ జోసేలు ఈ కథకు ఆయువు పట్టు. వారి పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ముఖ్యంగా లిజోకు ఎక్కువ మార్కులు పడతాయి. డీజీపీ దగ్గర ఆమె చెప్పే సంభాషణలు ఉద్విగ్నంగా ఉంటాయి. విచారణాధికారిగా ప్రకాశ్‌రాజ్‌, రాజిషా విజయన్‌, రావు రమేశ్‌ తదితరులు తమ పాత్రల్లో చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. తక్కువ బడ్జెట్‌లో కథను నమ్మి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా 90వ దశకం నాటి వాతావరణ పరిస్థితులను ప్రతిబింబించేందుకు ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం ప్రతి సన్నివేశంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్‌.ఆర్‌. కాదిర్‌ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. కోర్టు సన్నివేశాలు కళ్లకు కట్టారు. విచారణ పేరుతో రాజన్నను హింసించే సన్నివేశాలు సున్నిత మనస్కుల్ని కాస్త ఇబ్బందిపెడతాయి. ఫిలోమిన్‌ రాజ్‌ ఎడిటింగ్‌ ఓకే. అక్కడక్కడా తన కత్తెరకు పని చెప్పి ఉంటే బాగుండేది. షాన్‌ రొనాల్డ్‌ సంగీతం బాగుంది. కోర్టు సన్నివేశాలు ఎలివేట్‌ అయ్యేలా ఇచ్చిన నేపథ్య సంగీతం సూపర్‌. దర్శకుడు జ్ఞాన్‌వేల్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తదేమీ కాదు. అయితే, బలమైన సన్నివేశాలు, సంభాషణలు సినిమాను నిలబెట్టాయి.

బలాలు

+ సూర్య

+ కథ, దర్శకత్వం

+ సాంకేతిక వర్గం పనితీరు

బలహీనతలు

- అక్కడక్కడా నెమ్మదించిన కథాగమనం

చివరిగా: జై భీమ్‌.. ఉత్కంఠతో కేసు మాత్రమే కాదు, ప్రేక్షకులనూ గెలిచాడు.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని