Published : 30 Oct 2021 01:02 IST

Puneeth Rajkumar: 7.33 AM.. పునీత్‌ చేసిన ఆఖరి ట్వీట్‌ ఇదే..!

సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన జిమ్‌ వీడియోలు

ఇంటర్నెట్‌డెస్క్‌: కన్నడ అగ్రకథానాయకుడు రాజ్‌కుమార్‌ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసి.. స్టార్‌హీరోగా దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న పునీత్ మరణంతో చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రియులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పునీత్‌ జ్ఞాపకాలను సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేస్తున్నారు. దీంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విశేషాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో పునీత్‌ చేసిన ఆఖరి ట్వీట్‌.. ఆయన సోషల్‌మీడియా ఖాతాల గురించి తెలుసుకుందాం.!

ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం..!

పునీత్‌కు కుటుంబమంటే అమితమైన ఇష్టం. షూటింగ్స్‌ నుంచి ఏ కాస్త విరామం దొరికినా సరే, కుటుంబసభ్యులతోనే ఎక్కువగా సమయాన్ని గడిపేవారు. వారితో సరదాగా గడిపిన క్షణాలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకునేవారు. తండ్రి రాజ్‌కుమార్‌, అన్నయ్య శివన్న అంటే పునీత్‌కు అమితమైన ప్రేమ, గౌరవం. తండ్రితో దిగిన పలు మధుర జ్ఞాపకాలను సైతం అప్పుడప్పుడూ నెట్టింట్లో షేర్‌ చేసుకునేవారు. సెప్టెంబర్‌ 24న ఆయన షేర్‌ చేసిన ఓ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘‘అప్పాజీ (నాన్న)తో కలిసి నయాగరా జలపాతం వద్ద గడిపిన ఆ క్షణాలు ఇప్పటికీ మధుర జ్ఞాపకాలే’’ అని ఆయన రాసుకొచ్చారు. మరోవైపు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ అమ్మే తనకు స్ఫూర్తి అని పునీత్‌ ఎన్నో సందర్భాల్లో చెప్పారు.

సేవ చేయడంలో ముందు..!

తండ్రి రాజ్‌కుమార్‌ పేరుతో ఆయన ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టారు. చదువుకోవాలని ఆశించే పేద విద్యార్థులకు, అనాథలకు, వృద్ధులకు అండగా నిలిచారు. 1800 మంది విద్యార్థుల చదువుకు సాయం చేశారు. కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో గోశాలలను ఏర్పాటు చేయించారు. పాఠశాల విద్యార్థుల కోసం ఇటీవల రాజ్‌కుమార్‌ లెర్నింగ్‌ యాప్‌ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

వర్కౌట్లను మాత్రం మరవరు..!

ఫిట్‌నెస్‌ విషయంలో పునీత్‌ ఎంతో శ్రద్ధగా ఉంటారు. షూటింగ్స్‌లో బిజీగా ఉన్నప్పటికీ వర్కౌట్లని మాత్రం మిస్‌ చేయరు. ‘POWER IN U’ అని పేర్కొంటూ తన వర్కౌట్‌ వీడియోలను ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో పంచుకునేవారు. వేరే ప్రాంతాల్లో ఉన్నప్పుడు జిమ్‌కి వెళ్లలేకపోతే.. కనీసం రన్నింగ్‌, జాగింగ్‌ అయినా చేసేవారు. అంతేకాకుండా వర్కౌట్‌ లేకపోతే ఆ రోజు తనకి వృథా అయినట్లేనని ఎన్నోసార్లు చెప్పారు.

ఆఖరి ట్వీట్‌ ఇదే..! 

తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను తరచూ ట్విటర్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలలో షేర్‌ చేసేవారు. ఈ క్రమంలోనే తన సోదరుడు శివరాజ్‌కుమార్‌ నటించిన ‘భజరంగీ-2’ విడుదలను పురస్కరించుకుని.. చిత్రబృందానికి ఆల్‌ది బెస్ట్‌ చెబుతూ శుక్రవారం ఉదయం 7.33 గంటలకు పునీత్‌ ట్వీట్‌ చేశారు. అనంతరం జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో ‘పునీత్‌ చేసిన ఆఖరి ట్వీట్‌ ఇదే’ అంటూ నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు.

నవంబర్‌ 1న ఏం చెప్పాలనుకున్నారు..!

ఇటీవల ‘యువరత్న’తో పునీత్‌ మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన రెండు ప్రాజెక్ట్‌లు ఓకే చేశారు. ప్రస్తుతం అవి చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతా వేదికగా నవంబర్‌ 1న ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు. ‘‘దశాబ్దకాలం క్రితం ఓ కథ పుట్టింది. భవిష్యత్తు తరాల వారిలో స్ఫూర్తి నింపుతూ.. లెజెండ్ తిరిగి రావడానికి సమయం ఆసన్నమైంది’’ అని ఆయన రెండు రోజుల క్రితమే పోస్ట్‌ పెట్టారు.
Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని