Sirivennela Sitharama Sastry: సాహిత్యానికి చీకటి రోజు

ఉత్తేజిత పదాల పూదోట నడుమ పాటను స్వర్ణరథంలో ఊరేగించిన సిరిమువ్వ గోపాలుడాయన. సిరా చుక్కతో కోట్లాది మెదళ్లను కదలించిన సాహిత్య బ్రహ్మ ఆయన. పాటల్లో జీవిత పాఠాలు కూర్చి.. భావోద్వేగాల భవ సాగరంలో శ్రోతల్ని ఉల్లాసంగా ఓలలాడించిన పాటసారి ఆయన. మూడున్నర దశాబ్దాల   సినీ ప్రయాణంలో ఎన్నో

Updated : 01 Dec 2021 09:36 IST

* ‘‘సీతారామశాస్త్రి లాంటి గొప్ప కవిని కోల్పోవడం తెలుగు సాహిత్యానికి, చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఇది నాకూ వ్యక్తిగతంగా పెద్ద నష్టమే. గురువు గారూ మీరు నాలాంటి చాలా మందికి నమ్మకం, ధైర్యాన్నిచ్చారు. శక్తిని నింపారు. మా హృదయాల్లో మరెవరూ పూరించని స్థానాన్ని మీరు కలిగి ఉన్నారు. మేము నిజంగా మిమ్మల్ని ఎంత కోల్పోతున్నామో చెప్పలేను’’.

- దర్శకుడు క్రిష్‌   

* ‘‘సీతారామశాస్త్రి గారితో నా తొలి మెమరీ.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో చెట్టుకింద కూర్చొని కాలేజీ సాంగ్‌ సిచ్చువేషన్‌ చెప్పా. కవిత్వం ఏమీ వద్దండి.. మామూలు కాలేజీ స్టూడెంట్స్‌ మాటల్లో నుంచి వచ్చిన పాటలా కనిపించాలన్నా. అలా చెప్పిన రెండు మూడు సెకన్లలో ‘బోటనీ పాఠముంది.. మ్యాటనీ ఆట ఉంది’ అంటూ స్టార్ట్‌ చేశారు. తర్వాత గాయం కోసం ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ పాటిచ్చారు. ఇలా జ్ఞాపకాల్లోకి వెళ్తే ఎన్ని పాటలని చెప్పాలి. ఇక ఇప్పుడు జరిగిన ఘటన అందరికీ ఓ షాకనే చెప్పాలి. ఓ గొప్ప వ్యక్తి చెప్పినట్లు.. ‘అందరూ జీవిస్తారు.. కొందరే ముందు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తారు’. అలా సిరివెన్నెల తన సాహిత్యంతో చేసిన కృషిని తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటారు, ఆయన పాటల్ని ప్రతి ఒక్కరూ నెమరువేసుకుంటూనే ఉంటారు’’.

- దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ

* ‘‘పాటే శ్వాసగా జీవిస్తూ.. వెండితెర మీద సిరివెన్నెలలు కురిపించిన మా సీతారామశాస్త్రి ఇక లేరనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నా. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, దివ్యలోక ప్రాప్తికలగాలని కోరుకుంటున్నా’’

- పరుచూరి గోపాలకృష్ణ

* ‘‘సిరివెన్నెల గారు ఇక లేరనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా ఉంటాయి’’.

- నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌

* ‘‘సాహిత్య మేధావి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఈ కష్ట సమయంలో నా ఆలోచనలు, ప్రార్థనలు ఆయన కుటుంబంతో ఉన్నాయి’’.

- నటుడు మహేష్‌బాబు

* ‘‘సిరివెన్నెల మా అందరికీ ఆదర్శనీయుడు, మార్గదర్శకుడు. 1995 నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. సిరివెన్నెల చీకట్లో కలిసి పోయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన సిరా.. వెన్నెల. ఆయన ఏ పాట రాసినా మాకు మార్గదర్శకంగా ఉండేది. ‘నమస్తే అన్న’లో నేను రాసిన మొదటి పాట చూసి నన్ను ఆశీర్వదించిన గొప్ప మనసు ఆయనది. తెలుగు సినిమా పాటకు, సాహిత్యలోకానికి చాలా పెద్ద నష్టం. ఇది పూరించేది కాదు. ఎవరూ ఆయన్ను అనుకరించలేరు’’.

- సుద్దాల అశోక్‌ తేజ, గేయ రచయిత

* ‘‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణవార్త విని దిగ్భ్రాంతి, బాధ కలిగింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘సైరా’ కోసం ఆయన ఇచ్చిన విలువైన మాటలు నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. సాహిత్యం, తెలుగు సినిమాకి ఆయన చేసిన కృషి ఎనలేనిది’’.

- నటుడు రామ్‌చరణ్‌

* ‘‘ఆయన సాహిత్యంలోని ‘సిరివెన్నెల’ మన మనసుల మీద ఎప్పటికీ అలానే ఉంటుంది. వీడ్కోలు గురువు గారు’’.

  - నటుడు నాని

*  ‘‘మీ పాటలే మేం నేర్చుకున్న పాఠాలు. మీ సూక్తులు మేం రాసుకొనే మాటలు. బ్రహ్మ ఒక్కడే కష్టపడుతున్నాడు అని సాయంగా ఇంత తొందరగా వెళ్లిపోయారా? నా పాట పూర్తి చేసి వెళ్లిపోయారు కానీ పాఠం మధ్యలోనే వదిలేసారు గురూజీ! భరించలేని నిజాన్ని చెవులు వింటున్నాయి కానీ మనసు ఒప్పుకోవటం లేదు’’. 

  - దర్శకుడు మారుతి

తండ్రీ కొడుకుల అనుబంధం

మాటలకు అందని విషాదం. శాస్త్రిగారి వద్దనే శిష్యరికం చేశాను. మాది గురుశిష్యుల అనుబంధం కంటే.. తండ్రీకొడుకుల బంధం. నా ఉన్నతికి బాటలు వేసి మార్గం చూపిన స్ఫూర్తి దాత. అకస్మాత్తుగా ఆయన దూరమవటం తట్టుకోలేకపోతున్నాం.

- రామజోగయ్యశాస్త్రి, సినీ గేయ రచయిత


ఉత్తేజిత పదాల పూదోట నడుమ పాటను స్వర్ణరథంలో ఊరేగించిన సిరిమువ్వ గోపాలుడాయన. సిరా చుక్కతో కోట్లాది మెదళ్లను కదలించిన సాహిత్య బ్రహ్మ ఆయన. పాటల్లో జీవిత పాఠాలు కూర్చి.. భావోద్వేగాల భవ సాగరంలో శ్రోతల్ని ఉల్లాసంగా ఓలలాడించిన పాటసారి ఆయన. మూడున్నర దశాబ్దాల   సినీ ప్రయాణంలో ఎన్నో అమృత గుళికల్లాంటి గీతాలందించిన సిరివెన్నెల  ఇక లేరన్న వార్త తెలుగు చిత్రసీమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.


‘‘1996లో మేము అర్ధాంగి అనే సినిమాతో సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్నిచ్చి, వెన్నుతట్టి ముందుకు నడిపించినవి ‘ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి’ అన్న సీతారామశాస్త్రి గారి పదాలు. భయం వేసినప్పుడల్లా గుర్తు తెచ్చుకుని పాడుకుంటే ఎక్కడలేని ధైర్యం వచ్చేది. అప్పటికి నాకు శాస్త్రి గారితో పరిచయం చాలా తక్కువ. మద్రాసులో డిసెంబర్‌ 31వ తారీఖు రాత్రి 10గం.లకి ఆయన ఇంటికి వెళ్లాను. ‘ఏం కావాలి నందీ’ అని అడిగారు. ఒక కొత్త నోట్‌ బుక్‌ ఆయన చేతుల్లో పెట్టి మీ చేతుల్తో ఆ పాట రాసివ్వమని అడిగాను. రాసి, ఆయన సంతకం చేసిచ్చారు. జనవరి 1న మా నాన్న గారికి గిఫ్ట్‌గా ఇచ్చాను. నాన్న గారి కళ్లలో ఆనందం, మాటల్లో కొత్తగా ఎగదన్నుకొచ్చిన విశ్వాసం ఎప్పటికీ మర్చిపోలేను. సింహాద్రిలో ‘అమ్మయినా నాన్నయినా.. లేకుంటే ఎవరైనా’ పాట.. మర్యాద రామన్నలో ‘పరుగులు తియ్‌’ పాట, ఆయనకి చాలా ఇష్టం. అమ్మానాన్న లేకపోతే ఎంత సుఖమో అని కానీ, పారిపోవటం చాలా గొప్ప అని కానీ, ఎలా రాస్తాము నంది అని తిట్టి, మళ్లీ ఆయనే ‘ఐ లైక్‌ దిస్‌ ఛాలెంజెస్‌’ అంటూ మొదలు పెట్టారు. కలిసినప్పుడల్లా ప్రతీ లైన్‌ నెమరు వేసుకుంటూ, అర్థాన్ని మళ్లీ విపులీకరించి చెప్తూ, ఆయన స్టైల్‌లో గది దద్దరిల్లేలా నవ్వుతూ, పక్కనే ఉంటే వీపుని గట్టిగా చరుస్తూ ఆనందించేవారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో దోస్తీ మ్యూజిక్‌ వీడియోకి లిరిక్‌ పేపర్‌లో ఆయన సంతకం చేసే షాట్‌ తీద్దామని చాలా ప్రయత్నించాము. కానీ, అప్పటికే ఆరోగ్యం సహకరించక కుదర్లేదు. నా జీవన గమనానికి దిశా నిర్దేశం చేసిన సీతారామశాస్త్రి గారి కలానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ..’’.

- దర్శకుడు రాజమౌళి


* ‘‘సిరివెన్నెల సీతారామశాస్త్రి నా సన్నిహితుడు. సరస్వతీ పుత్రుడు. విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది’’

- నటుడు మోహన్‌ బాబు

*  ‘‘సినీ పాటకు సాహితీ గౌరవం కల్పించిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెలుగు పాటను దశదిశలా వ్యాపింపజేసిన ఘనత ఆయనకే దక్కుతుంది’’.

- నటుడు నందమూరి బాలకృష్ణ

* ‘‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరన్న వార్త విని దిగ్భ్రాంతి చెందా. ఆయన ప్రియమైన వారికి ప్రగాఢ సానుభూతి’’.

 - నటుడు నాగార్జున

* ‘‘సిరివెన్నెల గారు ఇక లేరనే వార్త విని నిరుత్సాహానికి గురయ్యా. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక’’. 

- నటుడు వెంకటేష్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని